విలీనమా? విమోచనమా? విద్రోహమా? దురాక్రమణనా? అసలు చరిత్ర ఏంటి

by Disha edit |
విలీనమా? విమోచనమా? విద్రోహమా? దురాక్రమణనా? అసలు చరిత్ర ఏంటి
X

మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటిష్‌వారు విపరీతంగా నష్టపోయారు. దీంతో తాము భారత్‌లో పాలన సాగించలేమనే నిర్ణయానికి వచ్చారు. దేశాన్ని భారతీయులే పాలించుకునేలా 1919లో ఓ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇది మొదటి రాజ్యాంగం. బ్రిటిష్ ప్రావిన్సులను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న హైదరాబాద్, కాశ్మీర్, జూనాగఢ్, విదర్భలాంటి స్వతంత్ర రాజ్యాలు ఈ చట్ట పరిధిలోకి రాలేదు. వీటిని కలుపుదామని ప్రయత్నించినప్పుడు, అక్కడి రాజులు తమ స్వయం ప్రతిపత్తి దెబ్బ తింటుందని ఒప్పుకోలేదు. 1935లో మరో చట్టం (రెండవ భారత రాజ్యాంగం) తీసుకువచ్చాక ఎవరి వాటా వారికి ఇచ్చి చిన్న రాజ్యాలను కలుపుకున్నారు.అపుడు కూడా హైదరాబాద్ రాజ్యం భారత భూభాగంలో కలవలేదు.

అందుకే 1వ, 2వ రాజ్యాంగాలలో చెప్పినట్లు 1947లో భారత స్వాతంత్ర్య చట్టం ప్రకారం భారత్ లేదా పాకిస్తాన్‌లో కలవవచ్చని లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండవచ్చని బ్రిటిష్‌వారు సూచించారు. అధికార బదిలీ చట్టంలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఈ చట్టాలకు లోబడి 1947 ఆగస్టు 15 న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈ చట్టం ప్రకారం హైదరాబాద్, కాశ్మీర్, విదర్భ, జూనాగఢ్ లాంటి రాజ్యాలు భారత భూభాగంలోకి రావు. ఇవి స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. వీటి మీద భారత దేశానికి ఎలాంటి చట్టపర హక్కు లేదు. కనుక వీటితో భారతదేశం అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకోవటం మొదలు పెట్టింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా 'అంతర్జాతీయ' అనే పదం వాడకుండా జాగ్రత్తలు తీసుకుంది.

అనేక ఒప్పందాలు

1947-48 మధ్య కాలంలో భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంతో 'యథాతథ' ఒడంబడిక చేసుకుంది. దీని ప్రకారం హైదరాబాద్ అంతర్గత విషయంలో భారత్ జోక్యం చేసుకోరాదు, హైదరాబాద్ రాజ్యం కూడా భారత ప్రభుత్వానికి చెప్పకుండా ఏమీ చేయరాదు. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ రాజ్యం తన సైన్యాన్ని 4 వేల నుంచి 20 వేల వరకు పెంచుకోవచ్చు. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో హైదరాబాద్‌కు భారత ప్రభుత్వ అనుమతి అవసరం. కాశ్మీర్ విలీనం తరువాత హైదరాబాద్ విలీనం కోసం భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. దీనిని అడ్డుకోడానికే నిజాం తన సైన్యాన్ని పెంచుకోవచ్చనుకుని సంవత్సరం కాలానికి ఒప్పందం చేసుకున్నాడు.అప్పటికే బ్రిటిష్‌వారు స్థాపించిన 'కామన్‌వెల్త్' సమాఖ్యలో సభ్యత్వం కోసం నిజాం లేఖ రాశాడు.

హైదరాబాద్ ఇండియాలో భౌగోళికంగా అంతర్భాగంగా ఉందని, దూర ప్రయాసలతో కూడుకున్నదని, వ్యాపారాలకు సముద్ర తీరం లేదని బ్రిటిష్‌వారు ఒప్పుకోలేదు. దీంతో నిజాం కర్ణాటక ప్రాంత సముద్రతీరం కొనుక్కోడానికి యత్నించాడు. భారత ప్రభుత్వం దీనిని అడ్డుకుంది. ఇంతలో యథాతథ ఒడంబడిక గడువు తీరే సమయం వచ్చింది. గడువు తీరితే హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా గుర్తించాల్సి ఉంటుంది. ఒడంబడిక కాలం ముగియకముందే, ఇంకా 20-30 రోజుల కాలవ్యవధి ఉండగానే 13-17 సెప్టెంబర్ 1948 మధ్య కాలంలో భారత్ హైదరాబాద్‌ను ఆక్రమించుకుంది.

ఎన్నో మార్పులతో

భారత్ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నదని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఆగస్టు 21, 1948 న మొదటిసారి, 1948 సెప్టెంబర్ 12న రెండవసారి నిజాం ఫిర్యాదు చేశాడు. ఈలోగా సెప్టెంబర్ 13-17 మధ్యకాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం ఆక్రమించింది. భద్రతామండలిలో వాదోపవాదనలు జరిగినపుడు భారత ప్రభుత్వం నిజాంతో బలవంతంగా సంతకాలు తీసుకుని హైదరాబాద్ రాజ్యం ఎప్పుడో భారతదేశంలో కలిసిపోయిందని వాదించింది. ఆ సమయంలో అర్జెంటీనా దౌత్యవేత్త 'జోస్ అర్స్' తన వాణిని వినిపిస్తూ ఒక రాజ్యం గొంతు మీద కత్తి పెట్టి బలవంతంగా 'నువ్వు మా రాజ్యంలో కలవాలి' అంటే కలవకుండా ఎలా ఉంటారని' అన్నారు. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఇది మూడవ రాజ్యాంగం. ఇందులో మొదటిసారిగా హైదరాబాద్ అనే పదం చేర్చబడింది.

1948లో నిజాం మీద బాంబు దాడి జరిగినప్పుడు హైదరాబాద్ రాజ్యం నిందితులకు ఉరిశిక్ష విధించింది. 1950 తర్వాత దీని మీద భారత సుప్రీంకోర్టుకి వెళ్తే 'హైదరాబాద్ రాజ్యం భారత సమాఖ్యలో భాగం కాదు. స్వతంత్ర రాజ్యంగా ఉంది కనుక, దాని హైకోర్టు తీర్పునే చివరిదిగా పరిగణించాలని' స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్ వేసినా 16 మార్చి 1950లో 'మీరు భారతీయులు కాదని' పునరుద్ఘాటించింది. దీంతో చట్టపరంగా హైదరాబాదు రాజ్యాన్ని ఎదుర్కోలేక 1956లో మూడు ముక్కలుగా విడగొట్టి మహారాష్ట్రలో కొంత, ఆంధ్రలో కొంత, కర్ణాటకలో కొంత కలిపేసి హైదరాబాద్ రాజ్యం అనేది లేకుండా చేశారు. ఈ విధంగా 1947 వరకు దేశంగా ఉన్న హైదరాబాద్ 1948 నుంచి 1956 వరకు ఒక రాష్ట్రంగా ఉండి, 1956 నుంచి 2014 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ఉండి, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంగా మారిపోయింది.

చరిత్ర తెలుసుకోకుండా

1950లో భారత రాజ్యాంగం వచ్చాక ఆర్టికల్ 356 అమలులోకి వచ్చింది. కానీ, అంతకు ముందే ఆర్టికల్ 356 (సెక్షన్ 93 భారత రాజ్యాంగం- 1935 ) అమలు చేసి 1948 నుంచి 1952 వరకు హైదరాబాద్ రాజ్యంలో మిలిటరీ పాలన అమలు చేశారు. హైదరాబాద్ రాజ్యాన్ని కాపాడుకునేందుకు నిజాం సైన్యం, రజాకారులు, కమ్యూనిస్టులు ఏకమై భారత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాయి. దీనిని అనుసరించే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ 'ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్‌యూ వరకు ఏకం కావాలి' అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. హైదరాబాద్ రాజ్యం నిధులను భారత్ మొదటి,. రెండవ ప్లానింగ్ కమిషన్‌కి కేటాయించారు. భారత్- చైనా, భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలోనూ ఈ నిధులను వాడుకున్నారు.

హైదరాబాద్ కరెన్సీని భారత కరెన్సీగా మార్చటానికి 1948 నుంచి 1956 వరకు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. ఇక్కడ పనిచేసే 70 వేల మంది ఉద్యోగులను తొలగించి తమకు అనుకూలంగా ఉన్న మద్రాస్, బాంబే, కర్ణాటక నుంచి ఉద్యోగులను తెచ్చుకున్నారు. భారత ఆర్మీ హైదరాబాద్‌ను ఆక్రమించుకునేటపుడు ఏం జరిగింది? ఎంత ప్రాణ నష్టం జరిగింది? తెలుసుకోవడానికి నెహ్రూ సుందర్‌లాల్ కమిటీనీ నియమించారు. 20 నుంచి 40 వేల మందిని చంపేశారని కమిటీ నివేదించింది. ఈ నివేదికను 2014లో బీబీసీ బహిర్గతం చేసింది. ఇదంతా తెలియని రాజకీయ పార్టీలు చరిత్రను వక్రీకరించే పనిలో పడ్డాయి. చరిత్రను సరిగా చదివితే ఇది విలీనమా? విమోచనమా? విద్రోహమా? దురాక్రమణనా? అనేది తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రాజకీయ యుద్ధ వాతావరణంలో సమైక్యతా దినోత్సవమని ప్రకటించింది.

Also Read : వివాదంలో సెప్టెంబర్ 17.. ఆ రోజు అసలు ఏం జరిగింది?


శ్రీకాంత్ స్మిత్

తెలంగాణ ద్రవిడ లాయర్స్ అసోసియేషన్

రాష్ట్ర అధ్యక్షులు

94948 41254

Next Story

Most Viewed