వర్షాలు.. వెంటాడే అంటురోగాలు

by Disha edit |
వర్షాలు.. వెంటాడే అంటురోగాలు
X

రెండు తెలుగు రాష్ట్రాలలో రుతుపవనాల రాకతో వానలు మొదలయ్యాయి. వర్షాకాలం వచ్చేసింది. వాతావరణంలో తేమ, చల్లగా ఉండడం వలన దోమలు, ఈగలు ఎక్కువవుతాయి. సూక్ష్మ జీవులు, వైరస్‌లు వృద్ధి చెందుతాయి. వీటి కారణంగా మలేరియా, ఫైలేరియా, డెంగీ, టైఫాయిడ్, కలరా, అతిసారం, ఫ్లూ వంటి జబ్బులతో పాటు వైరల్ జ్వరాలు సోకే ప్రమాదం పొంచి ఉంది. ఎక్కువగా చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు వీటి బారిన పడతారు.

మలేరియా, మెదడువాపు, కలరా

మలేరియా తీవ్రమైన చలిజ్వరంతో మొదలవుతుంది. రోజు విడిచి రోజు జ్వరం వస్తూ ఉంటుంది. తలనొప్పి, ఒళ్ళు నొప్పులు కూడా ఉంటాయి. చికెన్ గున్యా, చలితో కూడిన జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనబడతాయి. ఫైలేరియా లేదా బోదకాలు వ్యాధి గ్రస్తులకు చంకల్లో, గజ్జల్లో, బిళ్ళలు వాచినట్లు ఉంటూ కొద్దిపాటి జ్వరం ఉంటుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలు ఎక్కువవుతాయి ఆకస్మికంగా జ్వరం రావడం, జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శరీరం మెలికలు తిరిగినట్లుగా ఏదో ఒక ప్రక్క పక్షవాతానికి గురవుతున్నట్లు ఉంటుంది. ఇక అతిసారం, కలరా వంటి రోగాలలో వాంతులు, విరోచనాలు ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో పనికిరాని వస్తువులు, పగిలిన సీసాలు, పూలకుండీలు, టైర్లు, వినియోగంలో లేని కూలర్లు, కొబ్బరి చిప్పలు, పనికి రాని బట్టలు మొదలైనవి ఇంట్లో లేకుండా చూసుకోవాలి. అంతే కాకుండా ఎక్కువ రోజులు ఒకే ప్రదేశంలో నీరు నిల్వ ఉండే ప్రదేశంలో దోమలు గ్రుడ్డులు పెట్టి పొదగడానికి అవకాశం ఉండడం వలన ఎప్పటికప్పుడు వాన నీరు నిలువ లేకుండా చూసుకోవాలి. రాత్రి నిద్రించేటప్పుడు దోమతెరలు వాడాలి. పిల్లలకు పొడుగు ప్యాంట్లు, పొడవాటి చేతులు కలిగిన చొక్కాలు ధరింపజేయాలి. ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా మూతలు పెట్టుకోవాలి. మంచి నీటి బావులు, కుళాయిలు, బోర్లా వద్ద చుట్టూ ఉండే ప్రదేశం పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.

వర్షాకాలం జాగ్రత్తలు

వర్షాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే పాలు ,పండ్లు, కాయగూరలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. పిల్లలకు టీకాలు వేయించాలి. పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. ఎక్కువ నీరు తాగాలి. తరచూ కాళ్లు, చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వైరస్‌లు, బాక్టీరియాల నుండి రక్షణ కొరకు పాటశాలలకు వెళ్ళే పిల్లలకు మాస్క్‌లు ధరింపజెయ్యాలి.

డి జె మోహన రావు,

టీచర్. శ్రీకాకుళం

94404 85824



Next Story

Most Viewed