నేచురోపతి వైద్యులకు మొండిచెయ్యి

by Disha edit |
నేచురోపతి వైద్యులకు మొండిచెయ్యి
X

ప్రకృతి వైద్యం అనగానే మొదటగా గుర్తొచ్చేది బల్కంపేట ప్రకృతి వైద్యశాల. 1954లో డా. బి వెంకట్రావు, డా. బి విజయలక్ష్మి దీనిని ప్రారంభించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రకృతి వైద్యశాలగా పేరుపొంది దేశవిదేశాల నుండి రోగులు ఇక్కడి వైద్యం కోసం వస్తుండేవారు. దీంతో అప్పటి నిజాం ప్రభుత్వం వీరి పనితీరును గుర్తించి పక్కా ఆసుపత్రి భవనాలను నిర్మించారు. తర్వాత 1970లో ఒక డిప్లోమా కోర్సు ప్రవేశపెట్టి 30 సీట్స్‌తో దేశంలోనే మొట్టమొదటగా నేచురోపతి వైద్య విద్యను ప్రారంభించారు. రోజురోజుకీ డిమాండ్ పెరుగుతుండటంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీఆర్ 1987లో ఆంధ్రప్రదేశ్ యోగాధ్యయన పరిషద్ స్థాపించి నేచర్ క్యూర్ హాస్పిటల్, గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్, వేమన యోగ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్ అని నాలుగు విభాగాలుగా విభజించి నేచర్ క్యూర్ హాస్పిటల్‌లో జనరల్ వార్డ్, స్పెషల్ వార్డ్, కాటేజెస్ ప్రత్యేకంగా నిర్మించి ప్రజలకు ఉచితంగా ప్రకృతి వైద్యం అందేలా తీర్చిదిద్దారు.

డిమాండ్ పెరగడంతో..

కాలానుగుణంగా అప్పటి వరకు డిప్లొమా కోర్సులాగా ఉన్న ప్రకృతి చికిత్సను, 1991లో 5- 12 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీగా, 30 సీట్ల కెపాసిటీతో మొదలుపెట్టి ఉచితంగా ప్రభుత్వమే విద్యార్థులను ప్రకృతి వైద్యులుగా తీర్చిదిద్దింది. ఇక్కడి విద్యను అభ్యసించిన వారు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. 1985 నుండి దేశం మొత్తం విపరీతంగా డిమాండ్ పెరుగుతుండడంతో తమిళనాడు,కర్ణాటక, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ కాలేజ్ లు స్థాపించి ఉచిత ప్రకృతి వైద్య విద్యను ప్రవేశపెట్టారు. రోజు రోజుకి డిమాండ్ పెరుగుతుండడంతో 2019 విద్యా సంవత్సరం నుండి మన రాష్ట్రంలోని గాంధీ నేచురోపతి మెడికల్ కాలేజ్ నందు సీట్ల సంఖ్య 30 నుండి 60 కి పెంచారు. దీంతో ప్రతి సంవత్సరం 3000 నుండి 4000 వేల మంది ప్రకృతి వైద్యులు బయటికి వస్తున్నారు. ఇక ఉద్యోగ భద్రత విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ బిల్లు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు అనువైన ప్రదేశాల్లో నేచురోపతి డిస్పెన్సెరీస్ స్థాపించి రెగ్యులర్ ప్రకృతి వైద్యులను నియమించుకోవచ్చని నిబంధనలు ఉన్నాయి. 1994 పరిషత్ విధివిధానాలలో 70 మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, లెక్చరర్, నాన్ క్లినికల్ పోస్ట్‌లు అప్పటి గవర్నర్ కృష్ణకాంత్, ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంజూరు చేశారు. తర్వాత ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి ఒకానొక దశలో సరైన బడ్జెట్ కేటాయించక ప్రకృతి వైద్యంని పట్టించుకోలేదు.

ఇంత తక్కువ మందితో వైద్యమా..

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పటి ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహులు ప్రకృతి వైద్య కళాశాల, హాస్పటల్‌కు జరుగుతున్న అన్యాయం గురించి అసెంబ్లీలో చర్చ జరిపి వెంటనే సరైన స్టాఫ్‌నీ కేటాయించాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అంగీకరించడమే కాకుండా 6 నెలల్లో 100 క్లినికల్, నాన్ క్లినికల్ పోస్టుల భర్తీ చేపట్టారు. కాలానుగుణంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విభజన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన ప్రకృతి వైద్యశాల, వైద్య కళాశాలను విశాఖపట్నంకు అప్పగించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 22 ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ మంజూరు చేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్టు ఉంటుంది. ప్రపంచానికి ప్రకృతి వైద్యంని పరిచయం చేసిన రాష్ట్రంలో ప్రకృతి వైద్యం అభివృద్ధి శూన్యం.

తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో ఆయుర్వేదిక్, హోమియోపతి, యునానికి సంబంధించి దాదాపు 2వేలకు పైగా రెగ్యులర్ డిస్పెన్సరీస్ ఉన్నాయి. కానీ నేచురోపతికి ఒక్క రెగ్యులర్ డిస్పెన్సరి కూడా లేకపోవడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని రెగ్యులర్ డిస్పెన్సరీ మంజూరు చేయాలని కోరుతున్నా వాటిని పట్టించుకోలేదు. 60 సీట్లు, 300 బెడ్ కెపాసిటీ కలిగిన ప్రకృతి వైద్య కళాశాలలో ప్రస్తుతం కేవలం 17 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంత తక్కువ మంది వైద్యులతో ప్రకృతి చికిత్సాలయాన్ని ఎలా నడిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్ష ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్న తరుణంలో తెలంగాణ యోగధ్యయన పరిషద్‌కు 100 పోస్ట్‌లు భర్తీ చేయలేరా, జిల్లాకి రెండు నేచురోపతి డిస్పెన్సరీలు ఇవ్వలేరా? మొత్తంగా 150 పోస్టులు భర్తీ చేయలేరా? అలాగే ప్రకృతి వైద్యశాలనీ 9 కోట్ల బడ్జెట్‌తో రేనోవేషన్‌కు అనుమతిచ్చినందుకు కృతజ్ఞతలు కానీ అందులో రెగ్యులర్ పోస్ట్‌ల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

డా.చినపాక మణిరత్నం

అధ్యక్షులు, రాష్ట్ర నేచురోపతి వైద్యుల సంఘం

97039 35729

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

జోడో యాత్ర ముగిసింది- ఇక జోడీ యాత్ర కావాలి



Next Story

Most Viewed