కథా సంవేదన: జాగిలం తెలివి

by Disha edit |
కథా సంవేదన: జాగిలం తెలివి
X

దినేష్ మొబైల్ ఫోను మోగింది. 'హలో' అన్నాడు. 'నమస్తే సార్, మీ ఆఫీసులో దొంగతనం జరిగిందని సమాచారం వచ్చింది. చూసి తగు చర్యలు తీసుకోండి సార్,' చెప్పాడు టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ తనని తాను పరిచయం చేసుకుంటూ. ఆ సమాచారంతో దినేష్ ఖిన్నుడైపోయాడు. ఆలోచనల్లో పడ్డాడు. 'మీకెలా తెలిసింది' అన్నాడు గొంతు సవరించుకుంటూ. 'ఒక విలువైన పత్రం మా చేతికి వచ్చింది. అందుకని మీకు ఫోన్ చేశాను. మేం కేసు దర్యాప్తు చేయలేం' అన్నాడు వినయంగా.

విలువైన పత్రం అనగానే దినేష్ ఆందోళన చెంది సంబంధిత పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి వెంటనే ఆఫీసుకు బయల్దేరాడు. అతను ఆఫీసు చేరుకోగానే అక్కడ అంతా హడావిడిగా కన్పించింది. అప్పటికే అక్కడికి ఇన్‌స్పెక్టర్, అతని సిబ్బంది వచ్చారు. దినేష్ ఆఫీసు సిబ్బంది కూడా వచ్చేశారు. దినేష్ ఆఫీసు రూంలోకి వచ్చాడు ఇన్‌స్పెక్టర్. ఆ విలువైన పత్రాలన్నీ ఏ బీరువాలో పెడతారో అడిగి తెలుసుకున్నాడు. అందరి సమక్షంలో బీరువాని తెరిచాడు. దానికి తాళం వేసి లేదు. ఆశ్చర్యపోయాడు ఇన్స్పెక్టర్. కొన్ని పత్రాలు మాయమైనట్లు గుర్తించారు. దినేష్ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదు రాసి ఇన్‌స్పెక్టర్‌కి ఇచ్చారు.

ఆ ఫిర్యాదుని పోలీసు స్టేషన్‌కి పంపించాడు ఇన్‌స్పెక్టర్. అందరినీ విచారించడం మొదలెట్టాడు. అనుమానం ఉన్న నలుగురి సిబ్బందిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కి బయలుదేరాడు. దినేష్ ఆఫీసులో విలువైన పత్రాల దొంగతనం జరిగిందని అందరికీ తెలిసిపోయింది. టీవీల్లో మీడియా గగ్గోలు పెట్టడం మొదలైంది. ఆ వార్త రాష్ట్ర వ్యాప్తం అయిపోయింది. ఆ నలుగురిని ఇన్‌స్పెక్టర్ విచారించడం మొదలుపెట్టాడు. పోలీసులు కొడతారన్న భయంతో ఇద్దరు వ్యక్తులు తామే దొంగతనం చేశామని ఒప్పుకున్నారు. మిగతా ఇద్దరు ఎంత బెదిరించినా ఒప్పుకోలేదు.

టీవీల్లో ఆ రహస్య పత్రాల దొంగతనం గురించి చర్చలు మొదలైపోయినాయి. మధ్యాహ్నం డిజిటల్ ఎడిషన్లో అది ప్రధాన వార్త అయింది. విషయం తెలిసి ఎస్పీ ఆ పోలీసు స్టేషన్‌కి పరుగుపరుగునా వచ్చేశాడు. అప్పటిదాకా ఇన్‌స్పెక్టర్ చేసిన దర్యాప్తుని సమీక్షించాడు. అది కొంచెం సీరియస్ కేసని భావించి డీఎస్పీని పిలిచాడు. 'ఈ రహస్య పత్రాల దొంగతనం కేసులో చాలామందికి ప్రమేయం ఉన్నట్లుంది. డీజీపీ గారు ఈ కేసు గురించి ఇప్పుడే మాట్లాడినారు. ఈ విషయం సీఎం దాకా వెళుతుంది. అందుకని మనం ఈ కేసును చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ డగ్రీ పద్ధతుల్లో కాకుండా సైంటిఫిక్‌గా ఈ కేసును పరిశోధన చేయాలి. అసలే మీడియా మనమీద అనిమేషగా ఉంటున్నాయి.' అన్నాడు.

'అవును సార్! ఏం చేయమంటారు' వినయంగా అడిగాడు డీఎస్పీ. 'మన పోలీస్ జాగిలాలని తెప్పించు. వాటిని తీసుకొని మనం వాళ్ళ ఆఫీసుకి వెళ్దాం' అన్నాడు ఎస్పీ. వెంటనే డీఎస్పీ, ఇన్స్‌పెక్టర్ వైపు చూశాడు. ఇన్స్‌పెక్టర్ వెంటనే బయటకు వెళ్ళి సంబంధిత అధికారులకి ఫోన్ చేశాడు. అరగంటలో రెండు జాగిలాలు వచ్చేశాయి. వాటిని తీసుకొని ఎస్పీ, డీఎస్పీ మిగతా పోలీస్ సిబ్బంది దినేష్ ఆఫీసుకి వచ్చారు.

ఏ రూంలోనైతే ఆ విలువైన పత్రాల దొంగతనం జరిగిందో పరిశీలించారు. బీరువాని చూశారు. తాళం పగులగొట్టిన జాడలు ఏవీ కన్పించలేదు. దొంగతనం ఎలా జరిగిందో ఎస్పీకి అర్థం కాలేదు.

ఆ ఆఫీస్ ఇంచార్జి అధికారిని పిలిచి విచారించాడు. దినేష్‌ని వివరాలు అడిగాడు. ఆ బీరువాకి తాళం వేయడం అలవాటు లేదని చెప్పారు. ఏం అనాలో ఎస్పీకి అర్థం కాలేదు. ఆయన సూచన మేరకు రెండు జాగిలాలని ఆ బీరువా దగ్గరికి తీసుకొని వెళ్ళి వాసన చూపించారు. ఆ జాగిలాలు తమ పనిని మొదలు పెట్టాయి. ఆఫీసు అంతా తిరగడం మొదలు పెట్టాయి. ఆఫీసులోని అందరి మొఖాల్లో ఆందోళన. పొరపాటున తమని పట్టుకుంటామోనని అందరిలోనూ భయం.

జాగిలాలు అన్ని సెక్షన్లని తిరిగాయి. అందరి చుట్టూ తిరిగాయి. చివరికి దినేష్ రూం వద్దకి వచ్చాయి. వచ్చీ రావడంతోనే ఒక జాగిలం దినేష్ ప్యాంట్‌ని పట్టుకుంది. మరో జాగిలం ఆ ఆఫీస్ ఇంచార్జి ప్యాంట్ ని పట్టుకుంది. వాళ్ళిదగ్గరికి కోపం వచ్చింది. 'ఇదేంటి ఎస్పీ గారు! దొంగల్ని పట్టుకోమంటే ఇవి వచ్చి మమ్మల్ని పట్టుకున్నాయి. ఇవి తెలివి తక్కువ జాగిలాల మాదిరిగా ఉన్నాయి' అన్నాడు దినేష్ ఎస్పీతో.

ఎస్పీకి విషయం అర్థమైంది. సార్ అవి తెలివి తక్కువ జాగిలాలు కాదు. తెలివైన జాగిలాలు. మా పోలీసుల మాదిరిగా కాదు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ దొంగతనం జరిగిందో వాళ్ళని పట్టుకున్నాయి. అంతే! జవాబు చెప్పాడు ఎస్పీ దినేష్‌తో. దినేష్‌కి ఏమి పాలు పోలేదు. ఏం అనాలో అంతకన్నా తోచలేదు. జాగిలాల తెలివికి మురిసిపోయి వాటిని దగ్గరికి తీసుకున్నాడు ఎస్పీ.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed