'పింక్' (హిందీ చిత్రం) సమీక్ష

by Disha Web Desk 17 |
పింక్ (హిందీ చిత్రం) సమీక్ష
X

నిన్ను వెతుక్కుంటూ బయలుదేరు

ఎందుకు నిరాశతో కూర్చుండిపోతావు,

నీ ఉనికి కోసం బయలుదేరు,

కాలం కూడా శోధిస్తోంది,

నిన్ను బంధించినవి బేడీలు అనుకోకు

వాటిని అస్త్రాలుగా మలచుకో

నీ చున్నీని ఎగరేసి జెండాగా ఎగరేయి

ఆకాశం కూడా వణికి పోతుంది

నీ చున్నీ పడిపోతే భూకంపమే వస్తుంది

అందుకే

నిన్ను వెతుక్కుంటూ నువ్వు బయలు దేరు

ఎందుకు నిరాశతో కూర్చుండి పోతావు,

నీ ఉనికి కోసం బయలుదేరు, కాలం కూడా శోధిస్తోంది

ఇట్లా మన సమాజంలో మహిళలకు ఆత్మ స్థైర్యాన్ని నిలిచి పోరాడే శక్తిని ఇస్తూ సాగిన మంచి సినిమా పింక్. వర్తమాన సమాజం మహిళ పట్ల, వారి స్వేచ్ఛ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో, వారి వ్యక్తిత్వాన్ని ఎట్లా హననం చేస్తుందో, అన్ని నిబంధనలు మహిళలకే ఎట్లా అమలు చేస్తారో ప్రతిభావంతంగా చిత్రించారు. ఈ వ్యవస్థ మహిళలను ఎట్లా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటుందో వివరిస్తుంది. వ్యక్తులు, కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళు మొత్తంగా సమాజం మహిళలపట్ల ఎట్లా వివక్షతతో ప్రవర్తిస్తుందో ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుంది.

పింక్‌లో సీనియర్ న్యాయవాది దీపక్ సెహెగల్ చేత కోర్టులో వాదన సమయంలో పలికించిన మాటలు అందరూ ఆలోచించాల్సినవి. మొత్తం సమాజాన్ని స్కాన్ చేసినట్టుగా వున్న ఆమాటలు అందరినీ ఆలోచింప చేస్తాయి. ఎవరికి వారు అంతర్మథనానికి గురయ్యి తీరుతారు.

కాదు అంటే కాదనే...

ఇక్కడ బండి తాళపు చెవులు స్త్రీ గుణాన్ని నిర్ధారిస్తాయి, ఒక అమ్మాయి రాక్ షోకు వెళ్తే ఆమె సూచన ఇచ్చినట్టు, గుడికి పోతే కాదు అంటే గుణాన్ని స్థలం నిర్ణయిస్తుంది, ఇక్కడ ఎవరయినా ఒక యువతి ఒక యువకుడితో వెళ్లినంత మాత్రాన ఆతడికి అన్ని రకాల స్వేచ్ఛా ఇచ్చినట్టు అయిపోతుంది, ఇక్కడ తాగడం చెడిపోయిన లక్షణం స్త్రీలకు, మగవారికి కాదు. అవును మరి మన వ్యవస్థ బలహీనుల్నే హింసిస్తుంది... ఇలా ఎన్నో మాటలు వ్యవస్థ ద్వంద్వ ప్రమాణాల్ని, స్వభావాన్ని ఈ సినిమా సూటిగా ప్రశ్నిస్తుంది. కోర్టులో చివరగా ఒక మాట చెబుతాడు దీపక్ సెహెగల్, కాదు అంటే కాదనే, ఆ మాట కేవలం ఒక పదం కాదు అది పూర్తి వాక్యమే. దానికి అర్థాలు వివరణాలూ అవసరం లేదు. లేదు అంటే లేదనే.

అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి, ఆండ్రియాలు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుద్ద రాయ్ చౌధురి దర్శకత్వం వహించారు. మీనాల్, ఫలక్, ఆండ్రియాలు ముగ్గురూ దక్షిణ ఢిల్లీ లోని ఒక అపార్టమెంట్‌లో కలిసి వుంటారు. ముగ్గురూ తలా ఒక జాబ్ చేసుకుంటూ హాయిగా వుంటారు. ఒక రోజు రాక్ షో తర్వాత మినాల్‌కు పరిచయం వున్న రజ్వీర్ ఈ ముగ్గురినీ సూరజకుంద్ లోని ఒక రిసార్టుకి డిన్నర్‌కి ఆహ్వానిస్తాడు. రజ్వీర్ ఆతని ఇద్దరు మిత్రులు మత్తుగా తాగి ముగ్గురు అమ్మాయిలని విడదీసి తలా ఓ పక్కకు తీసుకెళ్తారు. రజ్వీర్ మినాల్‌ని బలవంతం చేసే ప్రయత్నం చేస్తాడు. నో నో అంటుంది మీనాల్. రిజ్వీ వినిపించుకోక పోవడంతో పక్కనే వున్న సీసాతో ఆతని నుదుటి మీద బాదుతుంది. దాంతో రిజ్వీ కంటికి తీవ్ర గాయమవుతుంది. రిజ్వీకి దగ్గరి బంధువైన రాజకీయనాయకుడు పోలీసుల్ని అలర్ట్ చేస్తాడు.

మినాల్ ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు నమోదు చేయరు. ఇంతలో మినాల్ తనపై హత్యా ప్రయత్నం చేసిందని కేసు పెడతాడు రిజ్వీ. పోలీసులు మినాల్‌ని అరెస్టు చేస్తారు. కేసు పెద్దదవుతుంది. అమ్మాయిలు వుంటున్న అపార్ట్‌మెంట్స్‌ లోనే వుంటున్న రిటైర్డ్ వకీలు దీపక్ సెహెగాల్, మీనాల్ కేసుని వాదించడానికి ముందుకు వస్తాడు. రిజ్వీ తరఫున వాదించిన వకీలు, మినాల్ ఆమె మిత్రులు చెడిపోయిన వారని, రిజ్వీ అతని మిత్రుల్ని డబ్బుకోసం రొంపిలోకి దించే ప్రయత్నం చేశారని అన్ని బూటకపు ఆధారాలు చూపిస్తారు. అప్పుడు దీపక్ సెహెగల్ చేసిన వాదం మొత్తం సమాజాన్ని, దాని మౌలిక స్వభావాన్ని స్వరూపాన్ని నిలదీస్తుంది. అద్భుతమైన వాదనతో నిలదీస్తాడు. పార్టీకి వచ్చినంత మాత్రాన, మీతో కలిసి కొంత మందు కొట్టినంత మాత్రాన అన్నింటికీ అంగీకరించినట్టు కాదని 'నో' అంటే నో అనే అర్థమని అంటాడు.

లేదంటే లేదు అనే...

ఒక అమ్మాయి లేదా స్త్రీ అంగీకారం లేనిదే గర్ల్ ఫ్రెండ్ అయినా, భార్య అయినా చివరికి సెక్స్ వర్కర్ అయినా నో అన్నప్పుడు అది నో అనే, లేదంటే అది అత్యాచారం కిందికే వస్తుందని వాదిస్తాడు. మౌలిక ప్రశ్నలను లేవదీస్తూ సాగిన వాదనను అంగీకరిస్తూ కోర్టు కేస్ కొట్టి వేస్తుంది. కోపమూ, భయమూ, నిర్లిప్తతతో వుండిపోయిన మినాల్‌ని ఆమె మిత్రుల్ని ఉద్దేశించి భావస్ఫోరకమయిన కవితతో చిత్రం ముగుస్తుంది.

పింక్ దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఆర్థికంగా కూడా 4 కోట్ల పెట్టుబడికి మొదటి పది రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. సినిమాలో అమితాబ్ నటన చాలా గొప్పగానూ హుందాగానూ సాగుతుంది. ఇక తాప్సీ... కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమయిన ఆమె నటన పింక్‌లో ఊహకందనంత స్థాయికి చేరింది. జ్వరంతో కూడా ఆమె చేసిన కోర్ట్ దృశ్యాలు మరింత ప్రభావవంతంగా సాగాయి. 2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా ఆ ఏటి ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఆన్ లైన్‌లో అందుబాటులో వుంది.

'పింక్' (హింది చిత్రం) ముఖ్య నటీనటులు అమితాబ్ బచ్చన్, తాప్సీ, అంగద్ బేడి మొ..

దర్శకత్వం: అనిరుధ్ధ రాయ్ చౌధురి. నిర్మాణం: రశ్మి శర్మా, శూజీ సర్కార్. రచన: అనిరుధ్, సూజిత్, రితేశ్ శా

-వారాల ఆనంద్

94405 01281

Next Story

Most Viewed