పెరియార్ వారసత్వం అవసరం!

by Disha edit |
పెరియార్ వారసత్వం అవసరం!
X

దేవుడి పేరుతో తప్పుడు రాతలు రాసి.. దేవుడి బిడ్డల మధ్య కృత్రిమ విభజనలు సృష్టించిన స్వార్థపరులే కదా నిజమైన దైవ వ్యతిరేకులు? దేవుడి పేరిట కొనసాగుతున్న దుష్ట ఆచారాలని నిర్మూలించి.. దేవుడి బిడ్డలతో పాటు.. దేవుడికే న్యాయం చేసిన మానవోత్తముడు పెరియార్! 50 యేళ్ల క్రితం కంటే.. పెరియార్ వారసత్వం నేడు దేశానికి మరింత అవసరం!!

భారతదేశ చరిత్రలో సత్యాగ్రహ దీక్షలకు పేరుగాంచిన చారిత్రక వ్యక్తిగా మహాత్మా గాంధీ నిలిచాడు. ఆయన నాయకత్వంలో సాగిన ఉప్పు సత్యాగ్రహం, ఇతర దీక్షలు మన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో కీలకపాత్ర వహించాయి. దక్షిణ భారతదేశంలో తొలి సత్యాగ్రహాన్ని నడిపిన ఖ్యాతి దక్కించుకున్న మరో మహాత్ముడు పెరియార్ రామస్వామి నాయకర్!

అందరికీ సమాన హక్కులు ఉండాలని..

1924 - 25 మధ్యన ట్రావెన్‌కూర్ సంస్థానంలో.. వెనుకబడిన వర్గాల దేవాలయ ప్రవేశ హక్కు కోసం జరిగిన వైకోం సత్యాగ్రహాన్ని నడిపించిన జన నాయకుడు ఆయన. బ్రిటిష్ వాడు రుద్దిన రెండు వందల యేళ్ల రాజకీయ బానిసత్వాన్ని రద్దు చేయడానికి గాంధీ, నెహ్రూ, భగత్‌సింగ్ లాంటి వారు ఉద్యమిస్తే.. రెండు వేల యేళ్ల పాటు కొనసాగిన మనువాద గులాంగిరీని రద్దు చేయడానికి ఉద్యమించిన మహనీయుడు పెరియార్. ఆ స్వాతంత్ర్య ఉద్యమనేత గాంధీ మహాత్ముడైతే.. ఈ స్వాతంత్ర్య ఉద్యమ నేత సైతం నిస్సందేహంగా మాననీయుడే. పెరియార్ అనే తమిళ పదానికి అర్థం కూడా అదే!

వెంకటప్ప రామస్వామి నాయికర్ 17 సెప్టెంబర్ 1879న తమిళనాడులోని జన్మించాడు. హేతువాద భావాలతో ప్రభావితుడైన ఆయన.. కొందరు స్వార్ధపరులు సృష్టించిన కుల వ్యవస్థని రద్దు చేసి.. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించాలని ఉద్యమించాడు. ఆత్మగౌరవ ఉద్యమంగా తన పోరాటాన్ని కొనసాగించిన ఆయన పోరాటం క్రమంగా భారతదేశమంతటా వ్యాపించింది. ద్రవిడ ఉద్యమ పితామహుడని పిలుస్తారు. పెరియార్ జన్మదినాన్ని 'సామాజిక న్యాయ దినోత్సవం'గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ఈ దేశంలో కులవ్యవస్థ ప్రజల మధ్య విభేదాలను సృష్టించింది. సంఖ్యాపరమైన మెజార్టీ వర్గాలను సమన్యాయానికి దూరం చేసింది. మెజార్టీ వర్గాలకు జరిగిన వివక్షను సరిదిద్దడం కోసం ఏర్పడిన సామాజిక న్యాయ వ్యవస్థగా రిజర్వేషన్ల వ్యవస్థ ముందుకొచ్చింది. వీటిని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన మహనీయుడు కొల్లాపూర్ రాజు ఛత్రపతి సాహు మహారాజ్ అయితే.. ప్రజాస్వామిక పద్ధతిలో చట్టసభల ద్వారా ఆ రిజర్వేషన్ హక్కును దేశ ప్రజలకు అందించిన ఘనత పెరియారుకు ఆయన సహచరులైన జస్టిస్ పార్టీ నాయకులకు దక్కుతుంది.

ఆ ఉద్యమం కారణంగానే..

1927లో జస్టిస్ పార్టీ ఒత్తిడితో నాటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనల్ గవర్నమెంట్ ఆర్డర్‌ని జారీ చేసి.. ప్రభుత్వ ఉద్యోగాలలో 44 శాతం పోస్టులని వెనుకబడిన తరగతులకి, 8 శాతం పోస్టులను దళితులకు రిజర్వు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 1970 దశకం వరకు బ్రాహ్మణ రాజకీయ ఆధిపత్యం నడువగా.. ఆ తర్వాత పగ్గాలు ఇతర అగ్రకులాల చేతుల్లోకి మారాయి. మెజార్టీ వర్గాలకు రాజ్యాధికారం ఇంకా అందనంత దూరంలోనే ఉన్నది. పెరియార్ నడిపిన ద్రవిడ ఉద్యమం కారణంగా నేటికీ 60 ఏళ్ల క్రితమే వెనుకబడిన 'సెంగుంతార్' (చేనేత) కులానికి చెందిన అన్నాదురై.. ఆ పిదప మరింత వెనుకబడిన మంగలి కులానికి చెందిన కరుణానిధి తమిళనాట ముఖ్యమంత్రులు కాగలిగారు.

పెరియార్ గురించి ప్రస్తావించినప్పుడు పత్రికలన్నీ.. 'నాస్తికోద్యమ నాయకుడు' అంటూ వ్యతిరేక ధోరణిలోనే రాస్తుంటాయి. "ఆ దేవుడికి వారసుడు మామూలు మానవుడు" అన్న మన తెలుగు కవి వాక్కును నిజం చేస్తూ.. మానవులందరి సంక్షేమం కోసం, సమాన హక్కుల కోసం పాటుపడిన మహనీయుడు పెరియార్. దేవుడి పక్కనే నిలుచుండి.. అర్చనలు అభిషేకాలు చేస్తూ.. దేవుని బిడ్డల్లో కొందరిని శూద్రులు అనే పేరుతో, మరికొందరిని పంచములు అనే పేరుతో.. దేవుడికి, దేవాలయానికీ దూరంగా ఉండాలని శాసించిన వారికి నిజానికి దేవుడి మీద నమ్మకం ఉందని మనం చెప్పగలమా?

(నేడు 50వ వర్ధంతి సందర్భంగా..)

-ఆర్. రాజేశమ్,

కన్వీనర్, సామాజిక న్యాయవేదిక

9440443183


Next Story