పొత్తుపై.. ప్రజల అనుమానాలు తీర్చాలి!

by Disha edit |
పొత్తుపై.. ప్రజల అనుమానాలు తీర్చాలి!
X

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన రాజకీయ యాత్రలు, యువనేత నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్రలతో చెల్లాచెదరు అయిపోయిన కార్యకర్తలను ఒకచోట చేర్చి స్తబ్దుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నెలకొల్పిందనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ పుంజుకొని పార్టీకి పూర్వ వైభవం లభిస్తుంది అనుకుంటున్న తరుణంలో ఈ నెల ఎనిమిదవ తేదీ నంద్యాలలో నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో సీఐడీ వారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఉత్సాహభరితంగా సాగుతున్న యువగళం పాత్రను నారా లోకేష్ అర్ధాంతరంగా ముగించి వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయ్యింది. అదే సమయంలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో క్విడ్ ప్రోకో, ఫైబర్ గ్రిడ్ స్కాం ఆరోపణలతో నారా లోకేష్ పేరును మూడు కేసుల యఫ్.ఐ.ఆర్ లలో చేర్చడంతో తెలుగుదేశం పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. నారా లోకేష్ కూడా అరెస్ట్ అవుతారంటూ వస్తున్న వార్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మరియు కార్యకర్తలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో అనేక సంక్షోభాలను దీటుగా ఎదుర్కొన్న చరిత్ర,అనుభవం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అధికంగా ఉంది. కానీ సంక్షోభాలను ఎదుర్కొనే అధినేతలే వివిధ స్కామ్‌లలో కేసులు ఎదుర్కొన్న చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఇంతవరకు లేదు.

పొత్తుతో ఆత్మస్థైర్యం..

అదేసమయంలో భవిష్యత్తులో జనసేనాని పవన్ కళ్యాణ్‌తో కలసి ముందుకు పోవడం ఎలానో అర్ధంకాక తెలుగుదేశం పార్టీ అధిష్టానం సతమతమౌతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఇటీవల నారా చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయిన సందర్భంలో జైలు వద్ద పవన్ కళ్యాణ్, నారాలోకేష్, నందమూరి బాలకృష్ణలు సంయుక్తంగా పాత్రికేయ సమావేశం నిర్వహించి, ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో కలసి జనసేన పార్టీ పని చేయడంతో పాటూ రాబోయే 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేసి జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించుతామని ఆ సమావేశంలో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. జనసేనాని చేసిన వాఖ్యలు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపి ఉండవచ్చు, కానీ ఆ సన్నివేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట అమాంతం దిగజారినట్లు కనిపించింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీలో నాయకత్వ లేమి స్పష్టంగా బట్టబయలైంది. ఆ సన్నివేశం ప్రామాణికంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట దిగజారుస్తూ వివిధ మాధ్యమాలలో ఇప్పటికీ అనేక రకాలుగా వార్తలు, కార్టూన్లు వస్తూ వుండడం గమనార్హం. ఈ పరిణామం వలన పవన్ కళ్యాణ్‌తో కలసి అడుగులు వేసే విషయంలో తెలుగుదేశం పార్టీ ఆచితూచి వ్యవహరించవలసిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో పొత్తు వలన కలిగే లాభ, నష్టాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అడుగులు వేయాల్సిన ఆవశ్యకత తెలుగుదేశం పార్టీ పై అధికంగా ఉందని పరిస్తితులు తేటతెల్లం చేస్తున్నాయి.

సీఎం పదవిని షేర్ చేసుకుంటారా?

పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మకుటంలేని మహారాజు అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆయన అభిమానుల్లో యువకులే అధికశాతం. అలాగే పవన్ కళ్యాణ్ స్వీయ సామాజిక వర్గమైన కాపు, బలిజ కులస్తులు రాష్ట్ర జనాభాలో అత్యధికంగా సుమారు పదిహేను శాతం పైగా ఉన్నారు. గతంలో ఎలా వ్యవహరించినా రాబోయే 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని కాపు కులస్థులలో అధికభాగం భావిస్తున్నారనేది నిర్వివాదాంశం. అభిమానులు, స్వీయ సామాజికవర్గమైన బలిజ కులస్తులు ముఖ్యమంత్రి అభ్యర్థి అయినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్‌కు లేదా పవన్ మద్దతు ఇచ్చే పార్టీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుందని ఇప్పటికే అనేక కాపు సంఘాలు, పవన్ అభిమాన సంఘాలు స్పష్టం చేశాయి. ఈ పరిణామ ప్రకారం పవన్ కళ్యాణ్‌కు కొద్దికాలమైనా ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందే ప్రకటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్‌కు పవర్ షేర్ ప్రకటనకు ముందే టీడీపీ కార్యకర్తలు, తటస్థులు, మేధావులు పవన్‌కు ముఖ్యమంత్రి పదవి కేటాయించడాన్ని ఎలా స్వీకరిస్తారో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

రెండు పడవలపై ప్రయాణం

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పొత్తు ప్రకటించి రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరచారు . ఆ సమయంలో బీజేపీని కూడా టీడీపీతో పొత్తుకు ఒప్పిస్తానని జనసేనాని ప్రకటించడం గమనార్హం. బీజేపీతో పొత్తు పొడుస్తుందా లేదా అనేదానికన్నా బీజేపీతో పొత్తు వలన వచ్చే లాభ, నష్టాలను కూడా టీడీపీ అధ్యయనం చేయాల్సిన పరిస్థితి అధికంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని లోకం కోడై కూస్తున్న విషయం జగమెరిగిన సత్యం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మేధావులు, తటస్థులు, అన్ని వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీపై రగిలిపోతున్నారనేది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల సమయంలో బీజేపీ వైఖరిని టీడీపీ తీవ్రంగా దుయ్యబట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిజెపి రాష్ట్రానికి ప్రత్యేకంగా చేసిన మేలు కూడా ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో అప్పుడు చెడుగా కనిపించిన బీజేపీ ఇప్పుడు మంచిగా ఎలా కనిపిస్తుంది అని తెలుగుదేశం పార్టీకి ప్రజల నుంచి అనేక ప్రశ్నలు ఎదురుకావచ్చు. ఇటువంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు బీజేపీతో వ్యవహరిస్తేనే తెలుగుదేశంకు మంచి జరిగే అవకాశం ఏర్పడుతుంది.

అస్పష్టమైన పొత్తుతో ప్రమాదం!

జనసేన పార్టీతో పొత్తు విషయంలో బీసీల నుంచి కూడా అనేక అభ్యంతరాలు తెలుగుదేశం పార్టీకి ఎదురయ్యే పరిస్థితి అధికంగా ఉంది. నాకు కులాన్ని అంటగట్టవద్దు, నేను అన్ని కులాలకు చెందిన వాడిని అని పవన్ కళ్యాణ్ చెపుతున్నా దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో జరుగుతున్న కుల రాజకీయాలు, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాల నేపథ్యం దీనికి నిదర్శనంగా భావించవచ్చు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించమని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుండడం కూడా జనసేనతో టీడీపీ పొత్తుపై బీసీలు అభ్యంతరం తెలుపుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి అనేక విషయాలపై నిర్ధిష్టమైన, నిర్మాణాత్మకమైన, ఆమోదయోగ్యమైన స్పష్టత ప్రజలకు సంబంధిత వర్గాలకు ఇచ్చినప్పుడు మాత్రమే జనసేనానితో కలిసి ముందుకు వెళితే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా జగన్ మోహన్ రెడ్డికి అధికారం రానీయకూడదు అనే ఏకైక లక్ష్యంతో గుడ్డి గా అస్పష్టమైన పొత్తుతో ముందుకు వెళితే ఇరుపార్టీలకు మరోమారు చెడు అనుభవం ఎదురవచ్చు. జనసేన, బీజేపీలు మరో పర్యాయం ఓటమి పాలయిన ఆయా పార్టీలకు వచ్చే నష్టం ఏమీ ఉండదు. తెలుగుదేశం పార్టీ మరో మారు ఓటమి పొందితే నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ, చారిత్రాత్మక నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ అస్తిత్వంపై ప్రజలలో అనేక రకాల అనుమానాలు తలెత్తే పరిస్థితి కచ్చితంగా ఏర్పడుతుంది.

కైలసాని శివప్రసాద్

సీనియర్ జర్నలిస్ట్ & కాలమిస్ట్

94402 03999



Next Story

Most Viewed