నిరాశ పరుస్తున్న... ‘పాన్ ఇండియా’

by Disha edit |
నిరాశ పరుస్తున్న... ‘పాన్ ఇండియా’
X

వర్తమానంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలంతా పలవర్తున్న, కలవరిస్తున్న, దర్శక నిర్మాతలు ప్రచార చిత్రాలలో ఊదరగొడుతున్న పదం ‘పాన్ ఇండియా చిత్రం’. మాది పాన్ ఇండియా చిత్రమని చెప్పుకోవడం ఒక సంప్రదాయంగా మారుతున్నది. ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే గతంలో విడుదలైన రాధేశ్యామ్, లైగర్, శాకుంతలం, యశోద వంటి సినిమాలు నిర్మాత, దర్శకులనే కాకుండా ఆయా చిత్రాల హీరోలను, ప్రేక్షకులను కూడా నిరాశపరచాయి. దసరా, విరూపాక్ష వంటి చిత్రాలు బహుభాషా చిత్రాలుగా ప్రకటనలు గుప్పించినా తెలుగులో తప్పా మిగిలిన భాషలో నిరాశనే మూటగట్టుకున్నాయి. మేజర్, కార్తికేయ-2 చిత్రాలు మాత్రం జాతీయస్థాయిలో తమ స్టామీనాను నిరూపించుకొన్నాయి. మిగిలిన చిత్రాలతో విజయవంతమైన చిత్రాలను పోల్చిచూస్తే ఫలితాల్లో తేడా ఎక్కడుంది అనేది స్పష్టంగానే కనిపిస్తుంది.

సినిమాకు కావాల్సిందేంటో ఊహించుకోలేక..

‘పాన్ ఇండియా’ చిత్రం అంటే ఒకేసారి బహు భాషలను లక్ష్యంగా చేసుకోవడం. ఏకకాలంలో ఆయా భాషల్లో విడుదల చేయాలి. అయితే ఇదంతా సులభం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క భాషా చిత్ర పరిశ్రమకు తమదైన ‘శైలి’ ఉంటుంది. ‘ప్రాంతీయత’ ఉంటుంది. ఆచార సంప్రదాయాలు ఉంటాయి. వీటి నేపథ్యంలో వాటికున్న వైవిధ్యాలు వేరు, విరూపాక్ష, దసరా వంటి సినిమాల కథానేపథ్యం మిగిలిన భాషా చిత్రాలకు నప్పదు. డబ్ చేసుకోవడం వేరు. మలయాళం, తమిళ, కన్నడ వంటి చిత్ర పరిశ్రమలు తమ ప్రాంతీయతకు అనుగుణంగా కథలను వ్రాసుకుని సినిమాలుగా మారుస్తాయి. ఉదాహరణకు ‘కాంతారా’. అదే విధంగా తెలుగు సినిమా విరూపాక్ష, వీటిని ఏ దృష్టి కోణంలో ‘పాన్ ఇండియా’ చిత్రాలుగా వర్గీకరించాలనేది ప్రచార ఉబలాటం కోసం వినియోగించుకున్నప్పటికీ, తదుపరి కాలంలో మలయాళీ, హిందీ, తెలుగు భాషల చిత్రాల నేపథ్యాలకు పొసగవు. కనుకనే విరూపాక్ష, దసరా, ఏంజెల్, రావణాసుర, దాస్ కా దమ్కీ వంటి చిత్రాలను మిగిలిన భాషలలో విడుదల చేసినా అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

ఈ మధ్యకాలంలో మరో కొత్త సంప్రదాయాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు మన దర్శక నిర్మాతలు. అదేటంటే, మన తెలుగులో విజయవంతమైన చిత్రాలను తరువాత మిగిలిన భాషలలో విడుదల చేస్తున్నారు. ఇలా ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నా సరే ఫలితం మాత్రం నిరాశపరుస్తుంది. ‘పాన్ ఇండియా’ చిత్రమంటే గ్రాఫిక్స్, భారీ సెట్టింగ్స్, విదేశాలలో చిత్రీకరణ, వివిధ భాషలకు చెందిన గొప్ప గొప్ప నటులు వంటి హంగులు అనుకుంటున్నారు తప్పా, సినిమాకు ప్రధానమైన కథ అవసరమని ఎవరూ ఊహించలేకపోతున్నారు.

ఇంట గెలిచే ప్రయత్నాలు చేస్తూ

కొన్ని చిత్రాల్లో సాంకేతిక హంగులన్నీ ఉంటాయి కానీ కథ ఉండదు. సూపర్ స్టార్స్, మెగాస్టార్ ఇలా రకరకాలైన స్టార్స్ తమ పరిధిలో(తమది కాని పరిధిలో కూడా) చేతులు పెడుతూ చిత్రం అపజయానికి తమదైన సహాయం చేస్తున్నారు. అందరూ ఇలా ఉంటారని కాదు. కానీ ప్రేక్షకులను మెప్పించటం కోసం కొత్తగా వస్తున్న యువదర్శకుల సృజనలో జోక్యం చేసుకుంటున్నారు. అటువంటి పాన్ ఇండియా చిత్రాలు సోదిలోకి కూడా లేకుండా పోతున్నాయి. సొంత బ్యానర్‌లో తీసుకున్న కాకలు తీరిన అనుభవం ఉన్న నిర్మాతలు కూడా మునిగిపోతున్నారు. క్రమంగా దర్శక, నిర్మాత, నటీనటులకు ‘పాన్ ఇండియా’ వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇంట గెలిచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్, రవితేజ తదితరులంతా ‘పాన్ ఇండియా’ చిత్రాల నిర్మాణంలో ఉన్నారు. వీరంతా గతకాలపు చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారా? లేదా? ముందుగా తెలుగు ప్రేక్షకులను మంచి కథలతో మెప్పించి విజయం సాధించాక మిగిలిన భాషల వైపు చూస్తారా? లేదా? అనేది కాలం చెప్పాలి. ఏది ఏమైనా కథను కాదని కేవలం హంగులద్ది నటీనటులను ఏరి కోరి, శ్రమకోర్చి తెచ్చి ‘పాన్ ఇండియా’ చిత్రాలను నిర్మిస్తే నిరాశపూరిత ఫలితాలు పునరావృతం కాక తప్పదు అనేది వాస్తవం. సినిమా నిర్మాణం అంటే కోట్లాది రూపాయలు ఖర్చు మాత్రమే కాదు. మానవ వనరుల శ్రమ కూడా. ఒక సినిమా విజయవంతం అయితే లైట్ బాయ్ నుంచి హీరో వరకు మరో చిత్రం లభిస్తుంది. ఉపాధికి అవకాశం ఉంటుంది. గొప్ప గొప్ప హీరోలకు ‘పాన్ ఇండియా’ ఫలితాలు ఏమీ చేయలేకపోవచ్చు. కానీ ఆ సినిమా నిర్మాణం వెనక పనిచేసే కొన్ని వందల మంది కార్మికులతో పాటు సదరు నిర్మాత గాలి కొట్టుకుపోతాడు. వారిపై జాలిపడేవారు కూడా ఉండరు. దర్శక నిర్మాతలు ‘పాన్ ఇండియా’ సినిమాకు ముందుగా ‘పాన్ ఇండియా’ స్థాయి కలిగిన కథ అవసరమని గుర్తించాలి.

-భమిడిపాటి గౌరీ శంకర్

94928 58395



Next Story