అర్థం మారిన పాన్ ఇండియా

by Disha edit |
అర్థం మారిన పాన్ ఇండియా
X

మన దేశంలో ప్రతి ఆరు కోసుల దూరంలో ఉన్న ప్రజల భాష, యాస, జీవన విధానం, ఆహారపుటలవాట్లు, ఆహార్యంలో భిన్నత్వముంటుంది. అంత వైవిధ్యభరిత దేశం మనది. అలాంటప్పుడు ఒక సినిమా 'పాన్ ఇండియన్' కావాలంటే చాలా లక్షణాలను కలిగి ఉండాలి. మన తెలుగు సినిమా దాదాపు 70వ దశకం ఆరంభం నుండే కనీస ప్రాంతీయ లక్షణాలను కోల్పోయిందనేది వాస్తవం. ప్రాంతీయ సినిమాగా నిలబడాలంటే ఆ ప్రాంతపు ప్రజల జీవితాలూ, జీవన విధానాలూ, భాషాసంస్కృతులు వాటిలో ప్రతిబింబించాలి. కానీ, ఆ పరిస్థితి మెజారిటీ సినిమాలలో లేకుండా పోయింది. ఏదైనా ఒక ప్రాంతీయ సినిమా గొప్ప వాస్తవికతతో రూపొంది, మొత్తం భారతీయ సమాజం అందులో ఐడెంటిఫై అయితే, అది 'పాన్ ఇండియన్' సినిమా అవుతుందని నేననుకుంటాను.

వ్వాళ తెలుగు సినిమా రంగంలో వినిపిస్తున్న బజ్ వర్డ్ 'పాన్ ఇండియా మూవీ' మరి, 'పాన్ ఇండియన్ మూవీ' అంటే ఏమిటి? ఏదో ఒకటి రెండు సినిమాలు దేశవ్యాప్తంగా డబ్బింగ్ అయిపోతే 'పాన్ ఇండియన్' అయినట్టేనా? కమలహాసన్ హైదరాబాద్ వచ్చి 'పాన్ వరల్డ్' సినిమా తీయాలనేసి వెళ్లిపోయారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఆయా సినిమాలు విడుదలై విజయవంతమైతే, అక్కడి ప్రజలను ఆకట్టుకుంటే దాన్ని 'పాన్ ఇండియన్' అనాలి. అనేక భాషలలోకి డబ్ చేసి విడుదల చేస్తే అవి డబ్బింగ్ సినిమాలే అవుతాయి.

గతంలో ఎంజీ రామచంద్రన్, శివాజీ గణేశన్‌లాంటివాళ్ల సినిమాలు తెలుగులో వచ్చినప్పుడు వాటిని డబ్బింగ్ సినిమాలు అనేవాళ్లు. తెలుగు సినిమాలు దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ విజయసోపానాలు ఎక్కుతున్నాయనే మరో వాదనా ఉంది. అంటే 'పాన్ ఇండియా' అన్న భావనకు వసూళ్లు మాత్రమే కారణమంటారు. ఒక 'పుష్ప' లేదా 'ఆర్‌ఆర్‌ఆర్'లాంటివి కొన్ని ఆ కోవలోకి వస్తాయి వాటితో పాటు 'పాన్ ఇండియన్ స్టార్' అని పిలిపించుకున్న ప్రభాస్ సినిమా 'రాధేశ్యామ్' చిరంజీవి అండ్ చరణ్ సినిమా 'ఆచార్య' ఎంత పెద్ద ప్లాప్ చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో కమర్షియల్‌గా కూడా తెలుగు సినిమా ఇంకా 'పాన్ ఇండియన్' స్థాయికి రాలేదన్నది వాస్తవం.

లెక్కాపత్రాల మీద అనుమానం

కలెక్షన్స్ విషయంలో ఎవరెంతగా నిజాలు చెబుతున్నారో తెలీదు. ప్రచారాన్ని బట్టి వాళ్లంతా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో టాక్స్ కట్టాలి. కడుతున్నారా? 'లోగుట్టు పెరుమాళ్లకెరుక' ఇక మన ప్రభుత్వాలు అడక్కముందే టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులిస్తాయి. టాక్స్ విషయంలో మాత్రం ఏ మాటా బహిరంగంగా వుండదు. అవన్నీ మన కెందుకు కానీ, అకడమిక్‌గా ఆలోచిస్తే ఈ 'పాన్ ఇండియా' అనే దానిలోనే ఏదో అర్థ రాహిత్యం ఉందనిపిస్తుంది. ఎందుకంటే, మన దేశంలో ప్రతి ఆరు కోసుల దూరంలో ఉన్న ప్రజల భాష, యాస, జీవన విధానం, ఆహారపుటలవాట్లు, ఆహార్యంలో భిన్నత్వముంటుంది. అంత వైవిధ్యభరిత దేశం మనది. అలాంటప్పుడు ఒక సినిమా 'పాన్ ఇండియన్' కావాలంటే చాలా లక్షణాలను కలిగి ఉండాలి.

మన తెలుగు సినిమా దాదాపు 70వ దశకం ఆరంభం నుండే కనీస ప్రాంతీయ లక్షణాలను కోల్పోయిందనేది వాస్తవం. ప్రాంతీయ సినిమాగా నిలబడాలంటే ఆ ప్రాంతపు ప్రజల జీవితాలూ, జీవన విధానాలూ, భాషాసంస్కృతులు వాటిలో ప్రతిబింబించాలి. కానీ, ఆ పరిస్థితి మెజారిటీ సినిమాలలో లేకుండా పోయింది. ఏదైనా ఒక ప్రాంతీయ సినిమా గొప్ప వాస్తవికతతో రూపొంది, మొత్తం భారతీయ సమాజం అందులో ఐడెంటిఫై అయితే, అది 'పాన్ ఇండియన్' సినిమా అవుతుందని నేననుకుంటాను. అది వ్యాపార సినిమా అయినా సరే. తెలుగులో ఆ సినిమాలు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.

అబ్బురపరిచే చిత్రాలు

ప్రాంతీయంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తున్న సినిమాల గురించి మాట్లాడుకోవాలి. ఇప్పటికీ ఇంకా అనావిష్కృతంగా ఉన్న అక్కడి భాషా సంస్కృతులు, జీవన విధానమూ అన్నీ ఇటీవల అక్కడ నుంచి వచ్చిన సినిమాలలో మనకు స్వచ్ఛంగా కనిపిస్తాయి. అవి దేశ విదేశాలలో మన్ననలు కూడా అందుకున్నాయి. ప్రకృతి సిద్ధ నదీనదాలూ, పర్వతాలతో, స్వచ్ఛ వాతావరణంతో తులతూగే ఈశాన్య భారతం నుంచి వచ్చిన సాహిత్యం, సంగీతం, సినిమా మొదలు అన్ని కళలూ అత్యంత ప్రాంతీయమై, దేనికీ అనుకరణ కాకుండా, ఆసలు సిసలు కళారూపాలుగా ఉంటాయి.

అస్సామీ సినిమా 'జాలీవుడ్' గా పిలవబడుతున్నది. 1935లో జ్యోతిప్రసాద్ అగర్వాలా నిర్మించిన 'జోయ్‌మతి'తో అసామీ సినిమా ప్రారంభమైంది. ఇటీవల దర్శకురాలు రీమాదాస్ రచించి, దర్శకత్వం వహించిన సినిమా 'విలేజ్ రాక్ స్టార్స్' సహజంగానూ, గ్రామీణ నేపథ్యంలోనూ చిత్రించబడింది. అసామ్ జనజీవన సజీవ దృశ్యంలా సాగుతుంది. మహిళలు ముఖ్యంగా అమ్మాయిలు స్వంత కాళ్లపై నిలబడడం, వ్యక్తిత్వ నిర్మాణం రూపొందించుకోవడం, తన కలలను సాకారం చేసుకోవడం అనే అంశాలపై ఈ సినిమా సాగుతుంది. విజువల్‌గా అద్భుతంగా ఉండి అబ్బుర పరుస్తుంది.

జోయ్‌మతి సినిమా కథ

ఓ మారుమూల గ్రామంలో ధును అనే పదేళ్ల అమ్మాయి విధవరాలైన తన తల్లి, బద్దకస్తుడు అయిన అన్నతో కలిసి జీవిస్తుంటుంది. తల్లి చేసిన తినుబండారాలను అమ్ముకురావడానికి జాతరకు వెళ్లిన ధును అక్కడ ఒక బాండ్ ప్రదర్శన చూసి అబ్బురపడుతుంది. ఒక కార్టూన్ పుస్తకం చూసి ప్రభావితమవుతుంది. తానూ ఒక గిటారిస్ట్ కావాలని, తానూ ఒక బాండ్ రూపొందించుకోవాలని కలలు కంటుంది. పాజిటివ్‌గా ఉంటే కలలు సాకారమవుతాయని, దాంతో దేన్నయినా సాధించుకోవచ్చునని అర్థం చేసుకుంటుంది. పేదరికం, అసహాయత అడ్డు పడుతున్నా దీక్షతో ఒక్కో రూపాయి కూడబెడుతుంది.

అప్పుడే ధును రజస్వల అవుతుంది. ఆచారాల ప్రకారం తంతు నిర్వహిస్తారు. అప్పటి నుంచి ఆంక్షలు మొదలవుతాయి. చీరె కట్టుకోవాలని, మగపిల్లలతో కలిసి తిరగొద్దని చెబుతారు. ధును తల్లి అందుకు భిన్నంగా తన బిడ్డకు పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. వరదలకు వాళ్లకున్న కొద్ది భూమిలో పంట కొట్టుకు పోతుంది. ఏటా వరదలకు కొట్టుకుపోయే ఈ వ్యవసాయం ఎందుకు చేయాలని ధును తల్లిని అడుగుతుంది. మునిగిపోతుందని ఏమీ చేయకుండా ఉండలేము కదా? అంటుంది తల్లి. రూపాయి రూపాయి కూడబెట్టిన ధును తన గిటార్ కలను నెరవేర్చుకుంటుంది.

తెలుగులోనూ వస్తాయా?

ఇక 'లోక్ తక లయిరంబీ ' సినిమాకు పబ్బాన్ కుమార్ దర్శకత్వం వహించారు, ఫుండి సరస్సులో మణిపూర్ ప్రభుత్వం చేపట్టిన 'బయోమాస్ క్లియరెన్స్' కార్యక్రమం ఫలితంగా నిర్వాసితులైన మత్స్యకారుల జీవనపోరాటం ఈ సినిమా. మణిపూర్ జీవన చిత్రంగా నిలుస్తుంది. మరో సినిమా 'నానా' మన కథే. తియాకుం జుక్ తీసిన ఈ సినిమా నాగా ఫిలిం. ఇక త్రిపురకు చెందిన అత్యంత సారవంత రైమా లోయ ప్రాంతం దుమ్‌బూర్ డ్యాం నిర్మాణం వలన ఎట్లా మునిగిపోయిందో, ఫలితంగా ఎంతమంది నిర్వాసితులయ్యారో, వారి జీవితాల చుట్టూ తిరుగుతుందీ సినిమా.

ఇట్లా దేశంలో మారుమూల ప్రాంతం ఈశాన్య రాష్ట్రాల నుంచి అత్యంత ప్రతిభావంత ప్రాంతీయ సినిమాలు అనేకం వస్తున్నాయి. అదే తరహాలో మన తెలుగు సినిమాలు కూడా ప్రాంతీయ సినిమా లక్షణాలను పుణికి పుచ్చుకుని 'పాన్ ఇండియా' సినిమాగా ఎదగాలి. ఆ సినిమాలు వ్యాపారాత్మకం అయినా సరే. 'ఆల్ ది బెస్ట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ'.

వారాల ఆనంద్

94405 01281


Next Story