'నమో' శకం - మన్ కీ బాత్ శతకం

by Disha edit |
నమో శకం - మన్ కీ బాత్ శతకం
X

ఏప్రిల్ 30, 2023 ప్రత్యేకత ఏమిటంటే ప్రధాని నిర్వహిస్తున్న మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఆ రోజున దేశమంతటా రేడియో, టీవీ మాధ్యమాల ద్వారా ప్రసారం కావడం! ఈ సందర్భంగా, దేశం మొత్తంమీద ఎంపిక చేసిన 100 శాసనసభా నియోజకవర్గాలలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నారు. ఇక, ఈ కార్యక్రమం దేశంలోని ఒక లక్షకు పైగా వేర్వేరు ప్రాంతాలలోని బూత్‌లలో టీవీలద్వారా ప్రసారం కాబోతున్నది. ఈ సందర్భంగా దేశమంతటా 100 రూపాయల నాణేలను విడుదల చేయబోతున్నారు.

మన్ కీ బాత్' ధ్యేయం

మన ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన వెంటనే ఆయనకు కలిగిన విశిష్టమైన ఊహ మాన్ కి బాత్ దీని ధ్యేయం ఆయనకు కలిగే అభిప్రాయాలను, ఊహలను జనసామాన్యంతో పంచుకోవడం, తద్వారా దేశజనులు తమ ఆశలను, ఆశయాలను వెలిబుచ్చేందుకు ఒక వేదికను ఏర్పరచడం. దైనందిన ప్రాతిపదికపైన పరిపాలనకు సంబంధించి పౌరులతో ఆయన ముచ్చటించడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. పౌరుల ఆలోచనలను, ఊహలను స్వాగతించడం, ప్రతి అంశానికి సంబంధించిన అభిప్రాయాలను ఒక క్రమపద్ధతిలో సేకరించడం, వాటిని అధ్యయనం చేయడం, తదుపరి వాటినన్నింటినీ చర్చించడం - ఈ విధంగా ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. తదుపరి సత్ఫలితాలకోసం ఒక నిర్మాణాత్మకమైన విధానం ఏర్పరచబడి, దానికి అనుగుణమైన చర్యలను చేపట్టడం జరుగుతుంది.

అందుకే మోదీ ఎన్నుకునే అంశాలు చాలా వైవిధ్యం కలిగినవి. ఆయన తీసుకునే అంశం ఏకతా దివస్ (సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జన్మదినం) కావచ్చు; లాలిపాటలు & ముగ్గులు కావచ్చు; పౌరులలో పోటీ మనస్తత్వాన్ని పెంపొందింపజేయడం కావచ్చు; లేదా భారతదేశపు సాంస్కృతికవైవిధ్యం కావచ్చు. అలాగే, ఆయన తన ప్రసంగాలలో లబ్ధప్రతిష్ఠులైన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ని గానీ, లేదా సంగీతకారుడైన జోయ్ దీప్‌ను గానీ, లేదా కవయిత్రి విజయదుర్గ తాడిచర్లని ('నారీ సత్కార్' పురస్కారగ్రహీత) గానీ - ఇలా ఎవరినైనా పేర్కొనవచ్చు.

ఈ కార్యక్రమంలోని ప్రతి ఎపిసోడ్ ఆకాశవాణి (రేడియో), జాతీయ దూరదర్శన్, దూరదర్శన్ వార్తల ఛానెళ్ళద్వారా ముఖ్యంగా హిందీలో ప్రసారమౌతూ దీని అనువాదం దేశంలోని ముఖ్యభాషలన్నిటిలోనూ లభిస్తుంది.

కొన్ని ప్రాచుర్య సూచికలు

ఈ కార్యక్రమం సుమారు 90% పౌరులకు అందుబాటులో ఉంది. మొదటి 15 ప్రసంగాల తరువాత సుమారుగా 61,000 మంది తమ అభిప్రాయాలను ప్రకటిస్తూ స్పందించారు. 1.4 లక్షల ఆడియో రికార్డింగులు జరిగినట్లుగా తెలియవచ్చింది. ఎన్నో ఎపిసోడ్లకు ప్రసంగాలు పూర్తైన 24 గంటలలోగానే 5 లక్షలమంది దాకా వాటిని ఇష్టపడినట్లు 'లైకుల'ద్వారా ప్రకటితమయింది. ఆకాశవాణి (ప్రభుత్వ రేడియో) ఆదాయానికి ఈ కార్యక్రమం ఎంతగా దోహదపడిందంటే ప్రతి 10 సెకన్ల వ్యవధికి రెండు లక్షల రూపాయలు లభించేటంతగా బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి పలు రాష్ట్రాలలోని ఎందరో పౌరులు దీనిని అమితంగా ఇష్టపడ్డారు. 2014లో జరిపిన ఒక సర్వే ప్రకారం 67% ప్రజలు ఈ 'మన్ కీ బాత్'ను విని, దీనిని తమకు శ్రేయస్కరమైన కార్యక్రమంగా భావించారు.

ప్రముఖుల భాగస్వామ్యం, సందేశాలు

3వ ఎపిసోడ్‌లో మోదీజీ తనకు, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ కు మధ్య జరిగిన సంభాషణను కూడా వినిపించారు. 4వ ఎపిసోడ్ లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా పాల్గొని, నాటి ఆ కార్యక్రమాన్ని 'అమెరికా దేశాధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి మొట్టమొదటిసారిగా కలసి రేడియోద్వారా మాట్లాడిన కార్యక్రమంగా' అభివర్ణించారు. 17వ ఎపిసోడ్ లో సచిన్ తెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, మొరారి బాపు 'విద్యార్థుల పరీక్షల విషయమై తమ అభిప్రాయాలను రికార్డింగులద్వారా ప్రకటించి, విద్యార్థులలో ఉత్తేజాన్ని నింపారు.

ఈ కార్యక్రమం... భవిష్యత్తు

ఈ కార్యక్రమం 'కేవలం అలంకారప్రాయమైనదిగా కాకుండా, బహుళప్రయోజనకారిగా' రుజువైంది. మన ప్రధాని సగటు మనిషికి గల ఆకాంక్షలను, అవసరాలను మరింత సమర్థవంతంగా తెలుసుకొనేందుకు, తదనుగుణమైన చర్యలను చేపట్టేందుకు మరింత అవకాశం కల్పిస్తుందని ఇప్పటికే తేటతెల్లమయింది. 'అందరితో సంప్రదిస్తూ, అర్థవంతమైన చర్యలను చేపట్టడానికి' ఈ కార్యక్రమం ఒక సువర్ణావకాశాన్ని కలిగిస్తోంది కాబట్టి, ఇది అంచెలంచెలుగా పెంపొంది, కాలక్రమేణా వజ్రోత్సవాన్ని కూడా జరుపుకోగలదనడంలోను, మన భారతదేశం ప్రజాబాహుళ్య భాగస్వామ్యం కారణంగా ఎన్నో సకారాత్మకమైన ముందడుగులు వేసి, అతి త్వరలోనే 'విశ్వగురువు' కావడానికి ఇటువంటి కార్యక్రమాలెన్నో దోహదపడతాయనడంలోను అతిశయోక్తి ఏమీ లేదు!

-డాక్టర్ పద్మ వీరపనేని

బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్

90108 33999



Next Story

Most Viewed