జాతర సంతోషంగా సాగాలి

by Disha edit |
జాతర సంతోషంగా సాగాలి
X

తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా చెప్పుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాష్ట్రంలోనే ఇది అతిపెద్ద జాతర. దీనికి దాదాపు రెండు కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా... అయితే ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులను ప్రభుత్వం కల్పించాలి.

ప్రత్యేక వసతులు

ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో.. ఈసారి వాళ్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో సరిపడా ఆర్టీసీ బస్సులు మరుగుదొడ్లు, శౌచాలయాలు, తల్లుల కోసం ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ఎండలు మండిపోతుండటంతో ప్రతి అర కిలోమీటర్ లోపు చల్లని తాగునీరు సదుపాయం కల్పించాలి. చిన్నపిల్లల తల్లులు, వృద్ధులు, వికలాంగులకు దర్శనం కోసం ప్రత్యేక వరుసలు(క్యూ లైన్ లు) ఏర్పాటు చేయాలి.

ప్రమాదం జరగకుండా.. జంపన్నవాగు, ఇతర వాగుల్లో స్నానమాచరించే భక్తులు ప్రమాదాల బారిన పడకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి. అదే విధంగా ఇక్కడ దేవతామూర్తులకు భక్తులు బెల్లం బంగారాన్ని భారీ మొత్తంలో సమర్పించుకుంటారు. స్థానిక వ్యాపార సముదాయాల్లో బెల్లం, ఇతర వస్తువుల ధరలను నియంత్రించాలి. అమ్మవార్ల దర్శనానికి వచ్చే.. ప్రభుత్వ ముఖ్య అధికారులు, రాజకీయ నేతల కోసం సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టవద్దు. అందరినీ సమానంగా చూడాలి. మేడారం జాతరకు వచ్చే భక్తులు, ప్రతి జీవీ సమ్మక్క సారలమ్మను దర్శించుకుని సంతోషంగా ఇంటికి చేరుకోవాలి.

- తలారి గణేష్

99480 26058



Next Story

Most Viewed