- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మరోకోణం: కాంగ్రెస్ ముక్త్ భారత్.. ఫలిస్తోన్న మోడీ-షా ద్విముఖ వ్యూహం!!
చూడబోతే, ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా వ్యూహం సక్సెస్ అయ్యేట్టే కనిపిస్తోంది. దేశ రాజకీయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని వీరిద్దరూ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్'(Congress mukt Bharat) కోసం బహిరంగంగానే పిలుపునిచ్చారు. వారి కృషి ఫలితమా, అన్నట్లుగా 2014లో మొదటి దఫా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ హస్తం పార్టీ క్రమంగా బలహీనమవుతూ వస్తున్నది. ఆ యేడు కోల్పోయిన లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష హోదాను ఐదేళ్ల అనంతరం 2019లో కూడా పొందలేకపోయింది.
పోలైన ఓట్లలో పార్టీకి పడిన ఓట్లు సైతం 19.2 నుంచి 19.5 శాతానికి మాత్రమే పెరిగింది. 2014 నాటికి 13 రాష్ట్రాల్లో సొంతంగా ఉన్న అధికారం నేటికి కేవలం రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైంది. తాజాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలలో అత్యంత కీలకమైన గుజరాత్‌లో అత్యంత అవమానకర ఓటమిని చవిచూసింది. గత ఎన్నికలలో అక్కడ సొంతంగా 77 సీట్లు వచ్చి కొద్దిలో అధికారం కోల్పోయిన విషయం ప్రస్తావనార్హం. గత 24 ఏళ్లుగా నిరాటంకంగా పవర్‌లో ఉండి ప్రభుత్వ వ్యతిరేకతను దండిగా మూటగట్టుకున్న కమలనాథులకు కనీస పోటీ ఇవ్వలేక బొక్కబోర్లాపడింది. అంత ప్రాధాన్యం లేని హిమాచల్‌లో మాత్రమే ఉనికిని చాటుకోగలిగింది.
కారణాలు ఎన్నెన్నో
కాంగ్రెస్ ఈ దయనీయ స్థితికి చేరడానికి బలమైన అంతర్గత, బాహ్య కారణాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ(indira gandhi) తర్వాత ఆ పార్టీకి అంతటి సమర్థులు, రాజకీయ చతురులు, బలమైన వ్యక్తిత్వం కలిగివారు ఆ పార్టీకి అధినేతగా లభించలేదు. ఏడేళ్లు నాయకుడిగా ఉన్న రాజీవ్(rajiv gandhi) అనుభవశూన్యత, అపరిపక్వత కారణంగా బోఫోర్స్ కుంభకోణంలో, శ్రీలంక వివాదంలో చిక్కుకుపోయి ఒకే దఫాకు గద్దె దిగారు. తర్వాత అధ్యక్షులైన పీవీ నరసింహారావు(pv narasimha rao) మౌనమునిగా పేరు పడి పార్టీ కంటే పాలనకే ప్రాధాన్యమిచ్చారు. వివాదాస్పద బాబ్రీమసీదు కూలడానికి కారణమయ్యారు.
1996-98 మధ్య అధ్యక్షుడుగా ఉన్న సీతారాం కేసరి కాలంలో పార్టీలో అనేక గ్రూపులు ఏర్పడి చిదంబరం, మమతా బెనర్జీ, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ వంటి పలువురు కీలక నేతలు రాజీనామా చేశారు. చివరకు, గాంధీ కుటుంబం లేకుండా కాంగ్రెస్‌కు(congress) మనుగడ లేదని గ్రహించిన సీనియర్లు సోనియాగాంధీని తెరపైకి తెచ్చారు. 1998 నుంచి 2017 డిసెంబర్ వరకు 20 ఏళ్లు ఆమె పార్టీకి అధినేతగా ఉన్నారు.
నాయకత్వ లేమితో విఫలం
విదేశీ ముద్రతో పగ్గాలు చేపట్టిన సోనియా(sonia gandhi) పార్టీకి బలమైన నాయకత్వ కేంద్రంగా పనిచేయడంలో విఫలమయ్యారు. నెహ్రూకున్న దార్శనికత, ఇందిరకున్న ప్రజాకర్షణ, రాజీవ్‌కున్న సాంకేతికత, పీవీకున్న గాంభీర్యత సోనియాలో లోపించాయి. కీలక సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఊగిసలాటను ప్రదర్శించారు. ఫలితంగా అన్ని రాష్ట్రాల పీసీసీలలో అంతర్గత కుమ్ములాటలు తీవ్రతరమయ్యాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా నేతలు వ్యవహరించారు. విచ్ఛలవిడిగా క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడ్డారు. చర్యలు తీసుకోవాల్సిన హైకమాండ్‌లోనే అంతర్గత కలహాలు మొదలయ్యాయి.
2004లో, 2009లో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌కు సొంతంగా దక్కింది 145 (26.7శాతం), 206 (28.5శాతం) సీట్లు మాత్రమేనని మరచిపోకూడదు. 2017 చివరలో బాధ్యతలు చేపట్టిన రాహుల్ ఊగిసలాటలో తల్లిని మించిన తనయుడనిపించుకున్నారు. అమాయకత్వంతో కూడిన అసమర్థతలను ప్రదర్శించి అభాసుపాలయ్యారు. 2019 ఓటమి తర్వాత యుద్ధరంగానికి వెన్నుచూపి దేశప్రజల విశ్వాసం కోల్పోయారు. చివరకు, తప్పనిస్థితిలో సోనియా తిరిగి బాధ్యతలు తీసుకున్నా అనారోగ్యం మూలంగా నిస్తేజంగా ఉండిపోయారు.
ఆనాటి నుంచే పతనం
1990 నుంచి ఒక్కటొక్కటిగా రాష్ట్రాలు కాంగ్రెస్ నుంచి చేజారడం ఆరంభమైంది. ఢిల్లీ గద్దెను గెలవడానికి కీలకమైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ను కమలదళం వశపర్చుకుంది. ఈశాన్యం సైతం ఆ పార్టీకే మోకరిల్లింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, ఒడిశా, బిహార్, బెంగాల్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల చేతికి వెళ్లాయి. ఢిల్లీని ఆప్, కేరళను వామపక్షాలు ఆక్రమించాయి. కాంగ్రెస్ పార్టీకి స్పేస్ కరువై చివరకు ప్రాంతీయపార్టీకి ఎక్కువ, జాతీయపార్టీకి తక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రస్తుతం కేవలం సింగిల్ డిజిట్ రాష్ట్రాలలోనే అధికారంలోనో, ప్రధాన ప్రతిపక్షంగానో ఉన్నది.
ఫలించిన బీజేపీ వ్యూహం
కాంగ్రెస్ క్షీణతకు మరో కారణం బాహ్యమైనట్టిది. కాషాయ థింక్ టాంక్, ప్రధాని మోడీ-హోమ్ మంత్రి షా అనుసరిస్తున్న ద్విముఖ వ్యూహం నుంచి ఉద్భవించినట్టిది. బీజేపీ అధికారంలో ఉన్న లేదంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రతిపక్ష స్థానం నుంచి లేదా ప్రభుత్వం నుంచి గెంటేయడానికి, ఓట్లను చీల్చడానికి చిన్నపార్టీలను, ప్రాంతీయ పార్టీలను పరోక్షంగా ప్రోత్సహించడం మొదటిది.
ఢిల్లీ, పంజాబ్, నేడు గుజరాత్‌లో ఆప్(aam aadmi party) సరిగ్గా ఈ పనే చేసింది. బీజేపీ(bjp) బలంగా లేనిచోట లేదంటే అసలు ఉనికే కరువైన చోట స్థానికంగా ఉన్న ప్రాంతీయపార్టీలను నయానో భయానో లొంగదీసుకోవడం, ఎన్డీఏలో(NDA) చేర్చుకోవడం రెండవది. ఈశాన్యం తదితర చిన్న రాష్ట్రాలలో ఇది ఫలించింది. ఈ ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తూ వాళ్లు వరుస విజయాలు సాధిస్తున్నారు. రాష్ట్రం తర్వాత రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కర్ణాటక, ఒడిశా, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను రెండవ స్థానం నుంచి మూడో స్థానానికి పంపించగలిగారు.
సీన్ రిపీటవుతుందా?
గుజరాత్‌లో పొందిన అద్భుత విజయం మోడీ-షా ద్వయాన్ని మరింత ఉత్సాహపరుస్తుంది. ఇనుమడించిన పట్టుదలతో వాళ్లు భవిష్యత్తులో కాంగ్రెస్‌కు కళ్లెం వేయడం ఖాయం. 2023 ప్రథమార్థంలో జరగనున్న కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలలో, ద్వితీయార్థంలో జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో తమ వ్యూహాన్ని అనేక ఎత్తులు, జిత్తులు వేయడం ద్వారా అమలు చేస్తారు. అయితే బీజేపీ విజయఢంకా మోగించాలి లేదంటే కాంగ్రెస్ గెలవకూడదు. మధ్యలో మరే పార్టీ గెలిచినా పరవాలేదు.
కాంగ్రెస్ నిర్వీర్యమైన స్థితిలో 2024 సాధారణ ఎన్నికలు జరగడం వాళ్ల అంతిమ లక్ష్యంగా ఉంటుంది. అప్పుడు ఆ ఎన్నికలే కాదు, 2029 ఎన్నికలు కూడా ఆ పార్టీకి నల్లేరుపై నడకే అవుతుంది. ఈ కోణంలో చూస్తే, తెలంగాణలో గెలవడానికి కమలదళం తీవ్రంగా యత్నిస్తుంది. గెలవని పరిస్థితులలో కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరిస్తుంది. మునుగోడులో ఇదే జరిగింది. రేపటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే జరగవచ్చేమో!
ఆయనకు స్వేచ్ఛ ఇవ్వాలి
ఇక, కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుజరాత్‌లో జరిగిన ఘోర తప్పిదం మరోమారు రిపీట్ కాకుండా చూసుకోవాలి. రెండు రాష్ట్రాల ఎన్నికలను(gujarat-himachal pradesh elections) దృష్టిలో ఉంచుకోకుండా భారత్ జోడో యాత్ర రూట్‌ను ప్లాన్ చేయడం తప్పుడు నిర్ణయమని గుర్తించాలి. ఎన్నికలలో పాల్గొనే రాజకీయ పార్టీకి బ్యాలట్ విజయాలే కీలకం. కాంగ్రెస్ వంద శాతం ఎన్నికలలో పాల్గొనే, ఎన్నికలపై ఆధారపడే పార్టీయే. జోడో యాత్ర(bharat jodo yatra) ద్వారా రాహుల్(rahul gandhi) సంపాదిస్తున్న ప్రజాదరణ ఎంతైనా ఉండవచ్చు కానీ, 2024 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావించిన గుజరాత్ ఓటమి అంతకంటే చాలా నష్టదాయకమైనది.
ఇంకా మిగిలిన ఏడాదిన్నర సమయాన్ని ఆ పార్టీ హైకమాండ్ యుద్ధ ప్రాతిపదికన వినియోగించుకోవాలి.కొత్త అధ్యక్షుడు ఖర్గేను(mallikarjun kharge) స్వతంత్రంగా పనిచేయనివ్వాలి. ఫ్యూచర్ పీఎంగా సమర్థుడైన నేతను ఫోకస్ చేయాలి. తెలంగాణ సహా ఎన్నికలున్న రాష్ట్రాలపై వెంటనే కేంద్రీకరించాలి. అన్ని రాష్ట్రాలలో నెలకొన్న అంతర్గత ముఠా తగాదాలను, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉక్కు పిడికిలితో అణచివేయాలి. బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టేలా ప్రతివ్యూహాలను రచించాలి. అప్పుడే 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అసాధ్యమని నిరూపించగలదు. లేదంటే భారత ప్రజలకు మరో జాతీయ పార్టీ కోసం ఎదురుచూపులు తప్పవు.