వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!

by D.Markandeya |
వెంటిలేటర్‌పై టీ-కాంగ్రెస్!
X


తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి నియామక ప్రక్రియ ఈ వారం మరోమారు వార్తలలో నిలిచింది. రెండు మూడు రోజులలోనే కొత్త చీఫ్ పేరును పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందన్న సమాచారం మీడియాకు అందింది. యథాప్రకారం ఆ పదవిని ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కీ తదితర నేతలు ఢిల్లీ చేరారు. మరోవైపు ఫలానా నేతకు అవకాశమిస్తే బాగుండదని ఒకరు, నాకే ఇవ్వబోతున్నారని ఒకరు, బయట పార్టీ నుంచి వచ్చినవారికి ఎలా ఇస్తారంటూ ఒకరు, నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా ఇవ్వాలని ఒకరు, నేను రేసులో లేనని ఒకరు, మళ్లీ అభిప్రాయ సేకరణ చేయాలని ఒకరు.. ఇలా ఆశావహులు రకరకాల ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల అభిమతం తెలుసుకున్న హైకమాండ్ ఎందువల్లనో మళ్లీ టైం తీసుకుంది. ఈసారి అభిప్రాయ సేకరణ బాధ్యతను మరో ముఖ్యనేతకు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. ఇప్పటికయినా ఫైనల్ డెసిషన్ వస్తుందా? లేక ఇది మరో సాగదీత తతంగమా? అన్న విషయమై తెలంగాణలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి.

రెండేళ్లు గడిచినా

పీసీసీ అధ్యక్ష పీఠానికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసి రెండున్నరేళ్లు గడిచింది. శాసనసభ ఎన్నికలలో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని నాన్చుతూనేవుంది. త్వరలోనే నిర్ణయమంటూ ఢిల్లీ నుంచి సంకేతాలు వెలువడిన వెంటనే ఇక్కడ నేతలు బాధ్యతారహిత, స్వార్థపూరిత ప్రకటనలు చేయడం, ఎవరి పేరును ప్రకటించినా అసంతృప్తి రెక్కలు విప్పుతుందనే పరిస్థితులను కల్పించడం, చివరకు హైకమాండ్ వెనకడుగు వేయడం చర్వితచరణంగా జరుగుతూనేవున్నది. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితం వెలువడగానే పీసీసీ కొత్త చీఫ్‌ను ప్రకటిస్తామని పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ చెప్పినా అది ఇప్పటికీ వాస్తవరూపం దాల్చలేదు. ఇప్పుడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో హుజూరాబాద్ స్థానానికి త్వరలో మరో ఉపఎన్నిక జరగనున్నది. అప్పటికైనా కొత్త నేత బాధ్యతలు స్వీకరిస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

జీవన్మరణ పోరాటం

నిజానికి, 135 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు, జాతీయస్థాయిలోనూ వెంటిలేటర్‌పై జీవన్మరణ పోరాటం చేస్తున్నది. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి బలమైన నేతలను దేశానికి అందించిన ఆ పార్టీ పీవీ నర్సింహారావు, మన్మోహన్‌సింగ్‌ హయాంలో బలహీనపడింది. గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలిగా సోనియాగాంధీ చేతులలో అసలు అధికారమంతా కేంద్రీకృతం కావడం, వాళ్లు రబ్బర్ స్టాంపు ప్రధానులుగా పనిచేయడం ఇందుకు ప్రధాన కారణం కావచ్చు. ఆర్థిక సంస్కరణల విషయంలో దేశగతిని మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, పార్టీ-ప్రభుత్వం మధ్య ఉండాల్సిన సమన్వయం కొరవడింది. సోనియా బలహీన నాయకత్వం ఇందుకు తోడైంది. దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రాన్ని మొదట ప్రాంతీయ పార్టీలకు, తదుపరి బీజేపీకి అప్పగించడం ప్రారంభమైంది. ఇది కొనసాగి చివరకు 2014 ఎన్నికలలో కేంద్రంలో కూడా అధికారాన్ని కోల్పోయి, నరేంద్ర మోడీ ప్రాభవం ముందు చతికిలపడింది. రాహుల్‌గాంధీకి కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలన్న సోనియమ్మ కల ఆమె ఊగిసలాట వైఖరితో అపహాస్యం పాలైంది. తన ముందున్న కర్తవ్యాన్ని గుర్తించడంలో రాహుల్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. నాయకత్వలేమి కారణంగానే 2019 సాధారణ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ మరోమారు అవమానకర ఓటమిని చవిచూసింది.

కేసీఆర్ మోసపూరిత వైఖరి

తెలంగాణ విషయానికి వస్తే, ప్రత్యేక రాష్ట్రం అవతరించడంలో ఉద్యమనేత కేసీఆర్ నిర్వహించిన భూమిక కీలకమైనదే అయినా, అప్పటికి పాలక యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీ పాత్రను తక్కువ చేయలేం. విభజన మూలంగా ఆంధ్రలో పార్టీ మొత్తంగా నాశనమవుతుందని తెలిసి కూడా ఆమె తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సోనియమ్మ చలవే అని వాదన మన దగ్గర బలంగా ఉంది. అలాంటిచోట మొట్టమొదటి ఎన్నికలలోనే ప్రజాదరణ పొందలేకపోవడం నిజంగా విషాదమే. ఉమ్మడి రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్మాదపూరిత వైఖరి, తెలంగాణ కాంగ్రెస్ నేతల అవకాశవాద రాజకీయాలు, రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్‌ను బేషరతుగా కాంగ్రెస్‌లో కలిపేస్తానని ఆ పైన మాటమార్చిన కేసీఆర్‌ మోసపూరిత వైఖరి, ఉత్తమ్ బలహీన నాయకత్వం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీసారు. ఆ పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను పెద్దయెత్తున తన పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌ను తన మొదటి శత్రువుగా భావించి బహుముఖంగా దాడిచేసారు.

అయినప్పటికీ, 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికలనాటికి కాంగ్రెస్ పరిస్థితి కొంత మెరుగుపడింది. రేవంత్‌రెడ్డిలాంటి యువనేతలు పార్టీలోకి రావడం, టీఆర్ఎస్ పాలనపై ప్రజలలో బాగా వ్యతిరేకత ఏర్పడడం, కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందన్న ప్రచారం.. ఇవన్నీ ఇందుకు కారణాలు. ఒక దశలో ప్రిపోల్ సర్వేలన్నీ టీఆర్ఎస్ ఓటమిని, కాంగ్రెస్ గెలుపును ప్రకటించాయి. అయితే, ఎన్నికల ఎత్తుగడలను రూపొందించడంలో ఇటు రాష్ట్ర నాయకత్వం, అటు అధిష్టానం ఘోరంగా విఫలం చెందాయి. అధికారం తమదేనన్న అతివిశ్వాసంతో ముందుచూపు లేకుండా తెలంగాణ ద్రోహిగా పేరుబడిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇక్కడికి వచ్చి తనదైన శైలిలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పచ్చిగా ప్రచారం చేయడం బెడిసికొట్టింది. దీనికితోడు అవకాశాన్ని అందిపుచ్చుకున్న కేసీఆర్ ''కాంగ్రెస్‌ను గెలిపిస్తే మనల్ని మళ్లీ చంద్రబాబే పాలిస్తాడ''ని నినదించడంతో ప్రజలు పునరాలోచనలో పడ్డారు. చివరకు, అనేక అనుమానాలున్నా ఇప్పటికీ కేసీఆరే తెలంగాణను అభివృద్ధి చేయగలరని నమ్మి ఆయనకే ఓటేసారు. ఫలితంగా టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ ఓడింది. ఈ పరిణామాల అనంతరం కాంగ్రెస్-టీడీపీ పొత్తును ప్రతిపాదించడం ద్వారా ఉత్తమ్‌ కేసీఆర్‌కు కోవర్ట్ గా వ్యవహరించారన్న ప్రచారం రాష్ట్రంలో జోరందుకుంది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది.

బీజేపీయే ప్రత్యామ్నాయమా?

రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ బలహీనతలను సొమ్ము చేసుకుంటూ బీజేపీ క్రమంగా బలపడుతోంది. దుబ్బాకలో గెలిచి, జీహెచ్ఎంసీలో ప్రధాన పార్టీగా నిలవడం ద్వారా టీఆర్ఎస్‌కు తానే ప్రత్యామ్నాయమన్న సంకేతాలను ప్రజలకు ఆ పార్టీ పంపిస్తున్నది. అయితే, సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోడీతో ఉన్న మైత్రీబంధం బీజేపీ రాష్ట్ర నేతలను ఇరుకున పడేస్తున్నది. టీఆర్ఎస్ పాలనపై, కేసీఆర్ కుటుంబం అవినీతి బాగోతంపై తామెంత తీవ్రస్థాయిలో విరుచుకుపడినా ప్రజలలో విశ్వాసం కలిగించలేకపోతున్నామని వాళ్లు మథనపడుతున్నారు. ఈటల సహా ఎంత మంది నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినా సరే ఆ పార్టీ పాలక పక్షానికి ప్రత్యామ్నాయం కాలేకపోతున్నదనే టాక్ పరిశీలకులలో ఉంది. ఈ పరిస్థితులలో గతాన్ని సమీక్షించుకుని లోపాలన్నీ సవరించుకుని ఒక బలమైన నాయకుడి సారథ్యంలో సమైక్యంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకే రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగే చాన్స్ ఎక్కువ ఉంది.

బాధ్యత అధిష్టానానిదే

ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. అంతర్గత కుమ్ములాటలతో, వ్యక్తిగత ఎజెండాలతో, క్రమశిక్షణారాహిత్యంతో కార్యకర్తలను, ప్రజలను మరిచిన రాష్ట్ర యూనిట్‌ను సమూలంగా ప్రక్షాళన చేయాలి. చంద్రబాబును ఓడించడానికి నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అప్పగించిన తరహాలో పూర్తి బరువు బాధ్యతలను అంకితభావం, ప్రజాదరణ, కేసీఆర్‌కు సమఉజ్జీగా నిలబడగలిగిన నేతకు అప్పగించాలి. అసమ్మతి స్వరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ శ్రేణుల, కార్యకర్తల మనోధైర్యాన్ని నిలబెట్టాలి. ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలి. త్వరలో జరగనున్న హుజూరాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరు నేతలూ సమైక్యంగా కలిసి పనిచేసేలా గైడ్ చేయాలి. ఎందుకంటే రేపు హుజూరాబాద్‌లో గెలిచే పార్టీయే రాబోయే శాసనసభ ఎన్నికల అనంతరం అయితే అధికార పక్షంగానో లేదంటే ప్రధాన ప్రతిపక్షంగానో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

-డి మార్కండేయ

Read Disha E-paper

Next Story

Most Viewed