జలజగడంలో వింత వాదన

by Disha edit |
జలజగడంలో వింత వాదన
X

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పాత్రపై తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణకు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోంది. దాదాపుగా పోస్ట్‌మెన్ జాబ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అక్రమాల గురించి దాదాపుగా పది లేఖలు రాసినప్పటికీ ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వము విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టులన్నింటినీ నదీజలాల బోర్డులకు అప్పచెబుతూ 2021 జూన్ 15న ఒక గెజిట్ తీసుకువచ్చింది, దీనివల్ల చట్టంలో లేని అధికారాలు కూడా నదీ జలాల పంపిణీ బోర్డులకు దక్కుతాయి. గెజిట్ ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులను మూసి వేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే మేలుకో లేకపోతే భారీ నష్టం జరుగుతుంది.

భారతదేశంలోని అత్యంత పొడవైన నదులలో కృష్ణా నది మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది. నీటి ప్రవాహం సెకనుకు 2213 మీ. నీటి ప్రవాహంపరంగా దేశంలో నాలుగవ పెద్ద నది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల గుండా 1,400 కి. మీ. ప్రయాణించి హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. మొత్తం పరీవాహక ప్రాంతం 2,56,000 చ.కి.మీ. ఇందులో నాలుగు పరీవాహక రాష్ట్రాల వాటా మహారాష్ట్ర: 26.8%, కర్ణాటక: 43.8%, తెలంగాణ : 20.0%,ఆంధ్రప్రదేశ్ : 9.4%.గా ఉంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కూడ కృష్ణా, గోదావరి జలాల పంపిణీపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఇందులో ప్రధానంగా కృష్ణా నదీ జలాల వివాదాలు ఇప్పటికీ కూడ ఒక కొలిక్కి రాలేకపోగా, మరింతగా ముదురుతున్నాయి, మొదటి నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తూనే ఉంది. వాటిని అడ్డుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రిత్వ శాఖకు పది సార్లు ఫిర్యాదు చేసింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెఖవత్‌ను కలిసినప్పటికీ ఫలితము లేదు, బోర్డులు, నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన తప్ప తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు.

సమస్యలకు అసలు కారణం అదేనా?

అంతర్జాతీయ నదీ నియమాలలోని ఒక సూత్రం ప్రకారం ముందు నుంచి వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలి. దాన్నే 'ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్' అంటారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా నీళ్లు కర్ణాటక కంటే ఎక్కువగానే వచ్చాయి. సహజ నదీ సూత్రాల ప్రకారం, కృష్ణా నది, దాని ఉప నదులు ఎక్కువగా ప్రవహించే కర్ణాటకకే సహజంగా ఎక్కువ నీటి కేటాయింపులు జరగాలి. కానీ 'ఫస్ట్ ఇన్ యూజ్...' సూత్రం ప్రకారం తమకు పూర్తి కేటాయింపులు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ వాదించి సాధించుకుంది, ఈ రకమైన తతంగం మొదటి నుంచి నేటి వరకు జరుగుతూనే ఉంది. ఇది సహజ సూత్రాలకు విరుద్ధమని తెలంగాణ వాదిస్తున్నది.

సహజ జల సూత్రాలలో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే కోస్తాకు, రాయలసీమకు భారీ మేలు జరుగుతోంది. కాబట్టి బేసిన్ రూల్ కోసం ఇటూ తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం అటు ఆంధ్రప్రదేశ్ పోటాపోటీగా పట్టుబడుతున్నాయి. దీనికి కర్ణాటక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. విడిపోయిన రెండు రాష్ట్రాలూ వాటి మధ్య పంపకాల సంగతి చూసుకోవాలి తప్ప, మొత్తం నది నీళ్లు తిరిగి పంపకాలు చేయడం కుదరదంటున్నాయి. ఇదే విషయాన్ని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందుకు కూడా తీసుకెళ్లాయి.

జల దోపిడికి సాక్ష్యాలూ

మొదటి నుంచి అసలే కృష్ణా బేసిన్‌లో ఏ మాత్రంలేని కృష్ణా డెల్టా ఆయకట్టు, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టు, కేసీ కెనాల్ ఆయకట్టు ప్రాంతాలకు నీటిని వినియోగిస్తున్నారు, ఈ నీటి కేటాయింపులు జరగడంలో ఔచిత్యం ఏమిటో అర్థం కావడం లేదు. పైగా కృష్ణా బేసిన్‌లో ఉండే తెలంగాణ ప్రాంతాలు ఎండుతుండగా, కృష్ణా బేసిన్‌లో లేని రాయలసీమకు నీరు ఇవ్వడం కోసం పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు సరికాదని తెలంగాణ వాదన. ఇక తెలుగుగంగ చెన్నయికి నీరు ఇచ్చేదే అయినప్పటికీ ఆ కాలువ ఆధారంగా వెలిగోడు, కండలేరు, సోమశిల వంటి రిజర్వాయర్లు నిర్మించి వాటిని అక్రమంగా నింపి రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది.

అసలు చెన్నయికి ఇస్తామన్న నీరు కూడా ఇవ్వకుండా ఆ వంకతో రాయలసీమ ప్రాజెక్టులు నింపుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ వాదన. దీంతో అటు పులించింతల, ఇటు పట్టిసీమ వలన కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి భరోసా దక్కింది. రాయలసీమ, తెలంగాణ వివాదం అలానే ఉండిపోయింది.రాయలసీమలో చాలా భాగం పెన్నా బేసిన్‌‌లో ఉంటుంది. కృష్ణా బేసిన్ గల తెలంగాణకు నీరు ఇవ్వకుండా, కృష్ణా బేసిన్ పరిధిలో లేని రాయలసీమకు ముందుగా నీరు ఇవ్వడాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుంది.

నేటికీ అదే తంతు

తెలంగాణ విడిపోక ముందే జరిగిన కృష్ణా జలాల నీటి పంపకం విడిపోయాక కూడా యథాతథంగా కొనసాగించడం న్యాయం ఎలా అవుతుంది? న్యాయబద్ధమైన ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ నీటి వాటా ఇవ్వడమో? లేదా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడమో జరగాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరినా స్పందన లేదు. బచావత్ ట్రిబ్యునల్ ముందు చూపుతో గంపగుత్తగా 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీరు వినియోగానికి అవకాశం ఇచ్చింది.46 ఏండ్ల క్రితం జరిపిన కేటాయింపులనే నేటికీ యథాతథంగా జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం.

బచావత్ ట్రిబ్యునల్స్ ,బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో తెలంగాణ అవసరాలను దాచిపెట్టి, కేవలం కోస్తాంధ్ర, రాయలసీమ అవసరాల గురించి మాత్రమే వాదనలు వినిపించి 100% బేసిన్‌లో ఉండి, కరువుతో సాగునీటికి, తాగునీటికి అవస్థలకు గురవుతున్న మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల కనీస ప్రస్తావన లేనందున తెలంగాణ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులో స్థానం లేకుండా పోయింది.

మొండి వాదనలతో

శ్రీశైలం జలాశయం నీటిని నాగార్జునసాగర్ ఆయకట్టు అవసరాలకు, హైదరాబాద్ తాగునీటికి వదలడానికి ఏపీ ప్రభుత్వం సమ్మతించడం లేదు. మహబూబ్‌నగర్ జిల్లాకి 142 టీఎంసీల నీరు కేటాయించారు.జూరాల, రాజోలిబండ, బీమా ప్రాజెక్టులకు మాత్రమే జలాల కేటాయింపు ఉండగా నెట్టెంపాడు కల్వకుర్తి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేనేలేవు. నల్గొండ జిల్లాకు 135 టీఎంసీల నికర జలాలు ఉన్నప్పటికీ, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు 105, మూసీ ప్రాజెక్టుకు 9.4 టీఎంసీలు మాత్రమే కేటాయించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఏఎన్ఆర్‌పీ, డిండి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేకపోవడం, పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు లకు విభజనకు ముందే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వము ప్రారంభించినప్పటికీ, దానికి కూడా ప్రత్యేక అనుమతులు ఉండాలని ఆంధ్ర ప్రభుత్వం కోరడం మూర్ఖత్వం కాదా? తెలంగాణకు కృష్ణా గోదావరి నదులు తప్ప వేరే ఆధారం లేదు తెలంగాణలో బేసిన్ 68 శాతం ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 32 శాతం మాత్రమే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ 80 శాతానికిపైగా ఇతర నదులపై ఆధారపడి ఉంది. కోస్తాంధ్రలో వర్షపాతం ఎక్కువ. భూగర్భ జలాల లభ్యత కూడా అధికము, వరద జలాల, అదనపు జలాల వినియోగంలో కూడా ఆంధ్రప్రదేశ్ దిగువన ఉండటం కూడా అంశం కలిసొచ్చే అంశం.

కేఆర్ఎంబీ తీరు విచిత్రం

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు పాత్రపై తెలంగాణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణకు సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తోంది. దాదాపుగా పోస్ట్‌మెన్ జాబ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అక్రమాల గురించి దాదాపుగా పది లేఖలు రాసినప్పటికీ ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వము విభజన చట్టానికి విరుద్ధంగా ప్రాజెక్టులన్నింటినీ నదీజలాల బోర్డులకు అప్పచెబుతూ 2021 జూన్ 15న ఒక గెజిట్ తీసుకువచ్చింది, దీనివల్ల చట్టంలో లేని అధికారాలు కూడా నదీ జలాల పంపిణీ బోర్డులకు దక్కుతాయి. గెజిట్ ప్రకారం అనుమతి లేని ప్రాజెక్టులను మూసి వేసే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే మేలుకో లేకపోతే భారీ నష్టం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ రద్దు చేయడానికి వెంటనే పూనుకోవాలి. ఎక్కువ ఏరియా బేసిన్ పరిధిని కొలమానంగా తీసుకొని చట్టబద్దంగా నీటి జలాల పంపిణీకి దేశవ్యాప్తంగా అమలుకు రాజ్యాంగ సవరణలు చేయాలి. శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి, నీటి పంపిణీ చట్టబద్ధ నిర్ణయాలతో జరిగేటట్లు చర్యలు తీసుకోవాలి.

డా. బి. కేశవులు, ఎం.డి

న్యూరో- సైకియాట్రీ

మనస్తత్వ, రాజకీయ నిపుణులు

85010 61659



Next Story