కథా సంవేదన: మనిషి

by Disha edit |
కథా సంవేదన: మనిషి
X

ఇందిరా పార్క్‌లో ఉదయం నడక తరువాత చాలా విషయాల మీద మా మిత్రులతో చర్చలు జరిగేవి. తెలంగాణా విషయంతో పాటూ చాలా విషయాల మీద చర్చలు కొనసాగేవి . మా కజిన్ రాజేందర్ తక్కువ మాట్లాడేవాడు. కానీ తెలంగాణ విషయంలో ఆసక్తి చూపించే వాడు. మనిషి మనిషిగా మారడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందన్న చర్చ జరిగింది. రాజేందర్ కూడా ఆ చర్చలో పాల్గొన్నాడు.

నిజమే ! ఎంత కాలం పడుతుంది. .

రాజేందర్ నేనూ బాల్య స్నేహితులం. నా పేరూ అతని పేరూ ఒక్కటే. నా కన్నా కొన్ని మాసాలు పెద్ద. మా ఇంట్లోనే వున్న ఒక పోర్షన్‌లో వాళ్లు ఉండేవాళ్లు. కలిసి చదువుకున్నాం. ఆడుకున్నాం. ఎండాకాలం మా బాదం చెట్టు పక్కన ఖాళీ స్థలంలో అందరమూ మంచాలు వేసుకుని పడుకునేవాళ్లం. ఎన్నో కథలని చెప్పుకునే వాళ్లం.

తొమ్మిదవ తరగతి మధ్యలో నేను మా రఘుపతన్న వెంబడి ధర్మపురి వెళ్లిపోయాను. అట్లా మా మధ్య దూరం ఏర్పడినా సెలవుల్లో వేములవాడలో కలిసేవాళ్ళం. మా బంగ్లా మీద దాబాలో పడుకునే వాళ్లం. ఆడుకునేవాళ్లం. డిగ్రీ చదువుకోవడానికి వాడు హైదరాబాద్ వెళ్లాడు. నేను కరీంనగర్ వెళ్లాను. ఇద్దరమూ చదివింది ఒకటే చదువు. అదే సైన్సు చదువు. అది మా ఇద్దరికీ అచ్చిరాలేదు. సప్లిమెంటరీ రాయాల్సి వచ్చింది. ఆ విధంగా ఇద్దరమూ వేములవాడలో ఉండాల్సి వచ్చింది.

మా యింటి పోర్షన్‌లో వాళ్లు ఉండేవాళ్లు కానీ మా అందరి మకాం మా బంగ్లా మీదే. మేమిద్దరమే కాదు మా మిత్రులందరూ రాత్రి కాగానే బంగ్లా మీదికి చేరుకునేవాళ్లం. ప్లేయింగ్ కార్డ్స్‌తో బీట్. సాట్ అన్న ఆటని తరచూ ఆడేవాళ్లం. నేను చదరంగం కూడా ఆడేవాన్ని. రోజులు క్షణాల్లా గడిచిపోయేవి.

చిన్నప్పుడు కూడా ఇద్దరమూ కలిసి తిరిగేవాళ్లం. సినిమాలకేతైనేమి, జాతరకైతేనేమీ, సిరిసిల్ల రథం పున్నమ పండుగ కైతేనేమి ఇట్లా ఎన్నవో జ్ఞాపకాలు. ఎవరితోనూ ఘర్షణపడని మనస్తత్వం రాజేందర్‌ది. లా చదవడానికి నేనూ ఉస్మానియాకి వచ్చాను. లైబ్రరీ సైన్స్ చదవడానికి రాజేందర్ జబల్‌పూర్ వెళ్లాడు.

నా లా చదువు తర్వాత నేను న్యాయవాదిగా మారిపోయాను. రాజేందర్ జూనియర్ కాలేజీలో లైబ్రేరియన్‌గా చేరిపోయాడు. కాలచక్రం గిర్రున తిరిగింది. నేను న్యాయమూర్తిగా మారిపోయి హైదరాబాద్‌కి వచ్చాను. రాజేందర్ భార్యా పిల్లల కోసం హైదరాబాద్‌కి మారినాడు. కానీ అతని ఉద్యోగం జగిత్యాల, గోదావరిఖని డిగ్రీ కాలేజీలో ఉండేది. సెలవుల్లో హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పక వచ్చి కలిసేవాడు. అలా మా సాన్నిహిత్యం కొనసాగుతూ వచ్చింది.

తెలంగాణ ఏర్పడడానికి కొద్దిరోజుల ముందు రాజేందర్ పదవీ విరమణ చేశాడు. ఆ తర్వాత రోజూ ఉదయం ఇందిరాపార్క్‌లో కలిసి వాకింగ్ చేసేవాళ్లం. సాహిత్యం చదివేవాడు కానీ అభినివేశం కాలేదు. రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడేవాడు. తెలంగాణ ఏర్పడాలని బాగా కోరుకున్న వ్యక్తి రాజేందర్.

ఓ ఆరు సంవత్సరాల క్రితం నేను హిమాయత్ నగర్ నుంచి సన్ సిటీకి మారిపోయాను. ఇందిరా పార్క్‌లో వాకింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నెలకి ఒకసారి కలుసుకునేవాళ్ళం. అలా ఓ ఐదారు సంవత్సరాలు గడిచాయి.

రాజేందర్‌కి ఆరోగ్యం బాగాలేదన్న విషయం తెలిసింది. రెండు స్టెంట్లు వేసారు. అతన్ని కలిశాను. గుండె సంగతితో బాటూ కిడ్నీ సమస్య గురించి చెప్పాడు. డయాలసిస్ అవసరం ఏర్పడింది. ఇలా ఉండగానే రెండవ కుమారుడి పెళ్లి చేశాడు. పాత స్నేహితులం అందరమూ కలిశాం.

ఆ తరవాత రాజేందర్‌ని మళ్లీ కలిశాను. డయాలసిస్ బాధ నుంచి తప్పించుకోవడానికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి వెళుతున్న విషయం చెప్పాడు. తన భార్య నిర్మల కిడ్నీ తనకు సరిపోతుందని, ఇంకా ఆపరేషన్ తేదీని డాక్టర్లు నిర్ణయించలేదని చెప్పాడు. ఓ పది రోజుల క్రితం రవీంద్ర నా దగ్గరకి వచ్చినప్పుడు రాజేందర్‌కి ఫోన్ చేశాను. కానీ జవాబు లేదు. రెండు మూడు సార్లు ప్రయత్నించి ఊరుకున్నాం. రాజేందర్ ఫ్రీగా ఉంటే కలుద్దామని అనుకున్నాం. కానీ రాజేందర్ దగ్గర నుంచి జవాబు లేకపోవడం వల్ల రాజేందర్‌ని కలవలేకపోయాం.

అదే రోజు సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం రాజేందర్ ఫోన్ చేశాడు. తను డయాలసిస్‌లో ఉండటం వల్ల ఫోన్ రిసీవ్ చేసుకోలేకపోయానని చెప్పాడు. బాధపడినాను. మళ్లీ ఒకరోజు తీరికగా కలుద్దామని చెప్పాను. చాలా విషయాలు మాట్లాడినాడు. కానీ సోమవారం తన ఆపరేషన్ అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో నాకు అర్థం కాలేదు. కానీ సోమవారం ఉదయం 10.10 నిమిషాలకు రాజేందర్ ఫోన్ నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పుడు నేను ఒడిస్సా న్యాయమూర్తుల క్లాస్‌లో ఉన్నాను. నేను కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను.

క్లాస్ అయిపోయిన తర్వాత 1.10 నిమిషాలకు నేను రాజేందర్‌కి ఫోన్ చేశాను. రాజేందర్ దగ్గర నుంచి జవాబు లేదు. డయాలసిస్‌లో ఉన్నాడేమోనని అనుకున్నాను. కానీ అతను ఆపరేషన్ టేబుల్ పైన ఉన్నాడన్న విషయం అప్పుడు తెలియదు. నేను ఎవరికీ ఫోన్ చేయలేదు.

కొత్త ఉద్యోగ బాధ్యతల వల్ల ప్రతి రోజూ బిజీగా గడుస్తోంది. ఆ సోమవారం మరీ బిజీగా ఉన్నాను. తెల్లవారి ఉదయం 7 గంటల ప్రాంతంలో కిషోర్ ఫోన్ చేశాడు.

''రాజేందర్ నిన్న ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ అంత సక్సెస్ అయినట్లు లేదు. పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. బ్లీడింగ్ ఎక్కువగా ఉంది. ఎంత రక్తం ఎక్కించినా కష్టంగానే ఉంది''

నా మనస్సు ఆందోళనకు లోనైంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దేవుడి గదిలో ఉన్న శైలజ విషయం తెలుసుకుని దేవుడికి ప్రార్థనలు చేసింది.

ఆ తర్వాత ఇద్దరమూ కాస్సేపు మాట్లాడుకున్నాం. ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్ కలిగింది. హాస్పిటల్‌కి వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ ఆపరేషన్‌కి ఎందుకు వెళ్లాడు డయాలసిస్ చేయించుకుంటే బాగుండేది కదా! ఈ క్లిష్ట పరిస్థితి వచ్చేది కాదు కదానని అనుకున్నాం. ఆమె ఉండబట్టలేక మహేశ్‌కి ఫోన్ చేసి అలాగే మూగగా సోఫాలో కూర్చుండిపోయింది.

నేను మహేశ్‌కి మళ్లీ ఫోన్ చేశాను.

''అన్నయ్య చనిపోయాడు బాబాయ్. హాస్పిటల్ లోనే బాడీ ఉంది. కాసేపటి తర్వాత మార్చురీకి షిఫ్ట్ చేస్తారు. వదిన పరిస్థితి బాగానే ఉంది.''

ఏమీ ప్రశ్నలు అడగలేదు. మా ఇద్దరి మధ్య ఎన్ని జ్ఞాపకాలు. మా బాల్యం, మా మాటలు, ఆటలు అన్నీ కళ్లముందు గిర్రున తిరిగి కళ్లలో వాడి రక్తం చిమ్మినట్లుగా కన్నీళ్లు చిమ్మినాయి. మనస్సు మొద్దుబారిపోయింది.

మహేశ్ అన్న మాటలు చెవిలో మారుమోగాయి.

మనిషి మనిషిగా మారడానికి సంవత్సరాలు పట్టొచ్చు. కానీ మనిషి బాడీగా మారడానికి క్షణం కన్నా తక్కువ సమయం చాలు.

ఎందుకో ఈ మాటలు స్ఫురించాయి. ఎడ్ల రాజేందర్ ఎన్నడో మనిషిగా మారినాడు. ఇప్పుడు బాడీగా మారినాడు.

మనుషులు మనుషులుగా ఎప్పుడు మారతారో చెప్పలేం. కానీ బాడీగా మాత్రం తప్పక మారుతారు.

హాస్పిటల్‌కి వెళుతూ నా మదిలో తిరగాడిన మాటలు ఇవి.

మంగారి రాజేందర్ జింబో

94404 83001



Next Story

Most Viewed