మరో గ'ఘ'న విజయం

by Disha edit |
మరో గఘన విజయం
X

ర్రటి బాణం ఆకాశానికి గురిపెట్టి ఉంటుంది. అది ఆ సంస్థ చిహ్నం. అచ్చు ఆ బాణంలాగే లక్ష్యం మీదే దృష్టి కేంద్రీకరించి వారి రాకెట్ నిలబడి ఉంటుంది. అది ఎక్కుపెట్టిన బాణం. శ్రీహరికోట లోని లాంచ్‌ప్యాడే గాండీవం. ధనుర్విముక్త శరం లాగా నభోమండలాన్ని చీల్చుకుంటూ అది దూసుకుపోతుంటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మంత్రించిన బ్రహ్మాస్త్రం అది. చెప్పిన పనిని చెప్పినట్టుగా, చెప్పిన సమయానికి, ఏమాత్రం గురి తప్పకుండా పూర్తి చేసేస్తుంది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగ మంత్రం ప్రయోక్తకు బాగా తెలుసు. ఆ ప్రయోక్తే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం, మేధ అంతరిక్ష స్థాయిలో ఉన్నా కాళ్ళు స్థిరంగా భూమ్మీదే ఉండటం బహుశా ఆ సంస్థకు సహజంగా అబ్బిన భారతీయ సంస్కృతి వలన కావచ్చు.

రాకెట్లూ, ఉపగ్రహాలూ వద్దా?

పేదరికంతో అల్లాడిపోతున్న దేశానికి ఈ రాకెట్లూ, ఉపగ్రహాలూ ఎందుకు అని అన్నవారికి ఇస్రో రూపశిల్పి విక్రమ్ సారాభాయ్ దార్శనికతే సమాధానం. సారాభాయ్ ఇలా అన్నారు "జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలి." ఆ ఎవరికీ తీసిపోకుండా ఉండటమే ఇస్రో విజయాలకు మూల మంత్రం. స్వతంత్ర భారతదేశం సాధించిన విజయాలలో శాస్త్ర సాంకేతిక రంగం ప్రధానమైనది. ఈ రంగంలో పేరెన్నిక గన్న విజయగాథ ఇస్రో. హాలివుడ్ చిత్ర నిర్మాణ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో ఖచ్చితత్వంతో కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్ట గలిగే స్థాయికి ఇస్రో చేరుకుంది.

ఇది అకుంఠిత దీక్షతో మేధో మధనంతో సాగిన సుదీర్ఘ ప్రస్థానం. బుడి బుడి అడుగులతో చిన్న చర్చిలో మొదలు పెట్టి 1962లో తుంబా రాకెట్ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రయోగాలకు అంతరిక్ష విజ్ఞాన కార్యకలాపాల రూపకల్పనతో అడుగుపెట్టిన భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) కార్యక్రమాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అభివృద్ధి చెందుతూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, శాస్త్రీయ ప్రయోజనాలకు రోదసిని సద్వినియోగం చేసుకుంటూ, కమ్యూనికేషన్లు, టెలివిజన్ ప్రసారాలు, వాతావరణ పరిశోధన, ఆహారోత్పత్తి, విద్య, పారిశ్రామిక ప్రగతి, సహజ వనరుల వినియోగం, పర్యావరణ నిఘా, నౌకా చోదన, రవాణా, వైద్యం, రక్షణ తదితర రంగాల్లో మన కార్యక్రమాలకు ఊతమిస్తున్నది. సొంతంగా తయారు చేసిన ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టగలిగే ఆరు దేశాల్లో ఒకటిగా తలమానికమై నిలుస్తోంది.

చరిత్ర సృష్టించిన చిన్న బృందం

శ్రీహరికోటలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో మొన్ననే మరో అద్భుతమైన ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. మూడు ప్రయోగాత్మక శాటిలైట్లను మోసుకెళ్లే చిన్న తరహా వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ డీ2ను నింగిలోకి ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం SSLV D ఇస్రో ప్రయోగించింది. అభివృద్ధి చెందుతున్న చిన్న, సూక్ష్మ వాణిజ్య శాటిలైట్ మార్కెట్‌ను అందిపుచ్చుకునే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టారు. సాధారణంగా ఇస్రో ఓ పీఎస్ఎల్వీ వాహక నౌకను అంతరిక్షంలోకి ప్రయోగించాలంటే కనీసం 600 మంది శాస్త్రవేత్తలు పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ చిన్న వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ-డీ2ను ఓ చిన్న బృందం అతి తక్కువ సమయంలోనే రూపొందించింది. వారు ప్రయోగించిన అంతరిక్ష వాహన నౌక ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడానికి ద్రవ-ఇంధన-ఆధారిత వెలాసిటీ ట్రిమ్మింగ్ మాడ్యూల్ ను, తర్వాత మూడు ఘన దశలను ఉపయోగిస్తుంది.

అమెరికానే అబ్బురపరిచాం

కోవిడ్ కారణంగా పలుమార్లు ఆలస్యమైనా గత ఆగస్టులో ప్రయోగించిన ఈ నౌక ఉపగ్రహాలను ఖచ్చితమైన కక్ష్యలోకి పంపడంలో విఫలమైంది. రెండవ దశ విభజన సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పలు మార్పులు చేసి మరోసారి నిన్న ప్రయోగించారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఆత్మ నిర్బరంతో ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలకే పరిమితం కాకుండా వాణిజ్య విపణిలో సైతం ప్రవేశించి విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. గగనంలో ఘనంగా భారత కీర్తిని ప్రకాశింపజేస్తోంది. అమెరికా చంద్రుడి మీదకు మనిషిని పంపించామని చెప్పుకున్ననాటికి ఇస్రో ఇంకా రూపే దాల్చలేదు. భారత అంతరిక్ష విజ్ఞానం ఆనాడు సౌండింగ్ రాకెట్లతో ప్రయోగాలు చేస్తోంది - నాలుగు దశాబ్దాలు గడిచాక, ఇవ్వాళ, ఇస్రో తలపెట్టిన ప్రయోగాలలో మేమూ పాలుపంచుకుంటాం అని ఆ అమెరికాయే ముందుకొస్తోంది. అదీ ఇస్రో ఘనత!

- శ్రీ దిశ,

హైదరాబాద్

7382083094

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story