Team George: ఎన్నికలను ప్రభావితం చేసే సాఫ్ట్‌వేర్!

by Disha edit |
Team George: ఎన్నికలను ప్రభావితం చేసే సాఫ్ట్‌వేర్!
X

ర్మనీని అన్ని సమస్యల నుంచి గట్టెక్కించగల అవతార పురుషుడు అడాల్ఫ్ హిట్లర్'. జర్మన్ ప్రజలను నమ్మించేందుకు హిట్లర్ అనుచరుడు గోబెల్స్ పౌల్ జోసెఫ్ అప్పట్లో చేసిన ప్రచారమిది. పత్రికలు, రేడియో, నాటకాలు, సాహిత్యం, సంగీతం ఇలా అన్ని రంగాలను వాడుకునే గోబెల్స్ తిమ్మిని బమ్మి చేసేవాడు. తన ప్రచార విధానాలతో అబద్ధాన్ని నిజంగా నమ్మించేవాడు. అయితే ఇప్పుడు అలాంటి పనులు చేసే కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లను ఏర్పాటు చేసుకొని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకొని ప్రజల ఆలోచనా తీరును ప్రభావితం చేస్తున్నాయి. తమకు ఫీజు చెల్లించే రాజకీయ పార్టీలు గెలిచేలా ప్రచారం చేస్తున్నాయి.అలాంటి కంపెనీయే ఇజ్రాయిల్ కేంద్రంగా పని‌చేస్తున్న 'టీమ్ జార్జ్'. ఇప్పుడు ఈ కంపెనీ వ్యవహారం బయటపడడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కంపెనీ వ్యవహారం అంతర్జాతీయ జర్నలిస్టుల కన్సార్టియమ్ సీక్రెట్ ఆపరేషన్‌లో బయటపడింది.

స్పెషల్ సాఫ్ట్ వేర్..

ఈ కంపెనీ సోషల్ మీడియా అకౌంట్లను కంట్రోల్ చేసేలా 'అడ్వాన్స్‌‌డ్‌ ఇంపాక్ట్‌ మీడియా సొల్యూషన్స్‌' (AIMS) స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి దీని ద్వారా ఎన్నికలను ప్రభావితం చేసే తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్ తన క్లయింట్లకు సోషల్ మీడియాలో అనుకూలంగా భారీ సంఖ్యలో ఖాతాలు, పోస్టులు క్రియేట్ చేయగలదు. ఒక పార్టీకి అనుకూలమైన భావజాలాన్ని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా కనిపించేలా చేయగలదు. ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేయగలదు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, టెలిగ్రామ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జీమెయిల్‌, టెలిగ్రామ్‌, లింక్డ్‌ ఇన్‌ ఖాతాల్లోని పోస్టుల సారాంశాన్నీ మార్చేయగలదు. అప్పటికే తమ దగ్గర ఉన్న డాటా బేస్‌‌లోని లక్షలాది సోషల్‌ అకౌంట్లను వాడుకుని, ఆన్‌‌లైన్‌లో లక్షలాది ఫేక్‌ అకౌంట్లను సృష్టించగలదు. అప్పటికే ఉన్న నకిలీ అకౌంట్లను తన నియంత్రణలో తెచ్చుకోగల సామర్థ్యం దీనికి ఉంది. అయితే 2017లో హత్యకు గురైన గౌరిలంకేష్ ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాట స్ఫూర్తితో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలపై పరిశోధించాలని నిర్ణయం తీసుకున్న జర్నలిస్టుల కన్సార్టియమ్ ఒక స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. వీరు తమను తాము క్లయింట్‌గా పరిచయం చేసుకొని టీమ్ జార్జ్ హెడ్ తాల్‌హసన్‌తో చర్చలు జరిపారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ చర్చల్లో తాల్ హసన్ వారి ఎదుటే సోషల్ మీడియాను ఎలా నియంత్రించవచ్చో, సమాచారం సేకరించడం, ప్రత్యర్థి నాయకుల మెయిల్స్ ఎలా హ్యాక్ చేస్తామో, టెలిగ్రామ్ అకౌంట్లను హ్యాక్ చేసి ఒక డెమో చూపించి దాన్ని పూర్తి స్థాయిలో వివరించాడు.

ఆ పార్టీ వినియోగించుకున్నదా?

అయితే ఈ టీమ్ జార్జ్ బృందం మన దేశంతో సహా 30 పైగా దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుందని గార్డియన్ పత్రిక వెల్లడించింది. వీటిలో 27 దేశాల్లో వాళ్ళు విజయం సాధించినట్టు తెలిపింది. అయితే మనదేశంలో ఈ ఇజ్రాయెల్ సాఫ్ట్‌వేర్‌ను వినియోగించిన వారు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. ఎన్నికల్లో గెలిచేందుకు, ప్రజలను ప్రభావితం చేసేందుకు బీజేపీ ఇజ్రాయిల్ ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తూనే ఉంది. దీనిపై బీజేపీ స్పందించడం లేదు. అందుకే టీమ్ జార్జ్ క్లయింట్ బీజేపీననే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఏడాది చివరలో కొన్ని రాష్ట్రాలలో వచ్చే ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సాఫ్ట్‌వేర్ వినియోగించుకున్నది కేవలం జాతీయ పార్టీలేనా? ప్రాంతీయ పార్టీలు వినియోగించుకున్నాయా అనే నిజాన్ని నిగ్గు తేల్చేదెవరు? ఈ వాస్తవాన్ని కనుగొనేందుకు దేశానికి చెందిన జర్నలిస్టులు మరో సీక్రెట్, స్టింగ్ ఆపరేషన్ చేయాల్సిన అవసరముందేమో.

మహమ్మద్ ఆరిఫ్

96184 00190

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read...

స్నాప్-డీ అడిక్షన్ కేంద్రాలు అవసరమేమో!


Next Story

Most Viewed