బొల్లి మచ్చలంటే భయం వద్దు

by Disha edit |
బొల్లి మచ్చలంటే భయం వద్దు
X

బొల్లి మచ్చలు కనపడగానే ఒక భయం, బాధ, వైరాగ్యం కలుగుతాయి. ఎందుకంటే బొల్లి మచ్చలు తగ్గవనే ప్రచారం ఉండడమే దానికి కారణం. కానీ, అది అపోహ మాత్రమే. అన్ని చర్మ వ్యాధులతో పోలిస్తే బొల్లి మచ్చలు రోగిని శారీరకంగానే కాకుండా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్రంగా కుంగదీస్తాయి. ఈ సమస్య మీద అటు ప్రభుత్వం, ఇటు బీమా సంస్థలకు కూడా ఒక చిన్నచూపు ఉంది. ఈ వ్యాధి ఆటో ఇమ్యూనిటీ, వంశపారంపర్యత, విటమిన్-డి లోపం వలన వస్తుంది. మంచి చికిత్స తీసుకుంటే దీనిని తప్పకుండా తగ్గించవచ్చు.

శరీరంపై తెల్ల మచ్చలు కనపడగానే బెదిరిపోకుండా, పరీక్షలు చేయించుకోవాలి. తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఎక్కువగా తీసుకోవాలి. సన్ స్క్రీన్ లోషన్ తప్పకుండా వాడాలి. మచ్చలపైన కలబంద జెల్ రాయాలి. ఇలా చేయడం వలన వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఎలా అయినా వ్యాధిని తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో కొందరు భయానక పత్యంతో చెట్ల మందులు వాడుతుంటారు. దీంతో వ్యాధి ఇంకా తీవ్రం కావడమే కాకుండా, మరో కొత్త జబ్బును కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. వీలైనంత త్వరలో చర్మవ్యాధి నిపుణులను సంప్రదిస్తే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని గమనించండి.

అందుబాటులో ఆధునిక చికిత్స

లేజర్, ఎన్‌డీయూబీ కిరణాలు, అయింట్‌మెంట్ ద్వారా ఈ జబ్బు తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ సైతం అందుబాటులో ఉంది. ఇందులో 90 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటు ఉంది. కాబట్టి భయపడాల్సిన పని లేదు. మొండి మచ్చలు, విటిలిగో సర్జరీ ద్వారా ఈ వ్యాధిని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

బొల్లి మచ్చలు తీవ్రమైన, హానికరమైన జబ్బు కానప్పటికీ, సమాజంలో దీని పట్ల వ్యతిరేకత ఉంది. దీంతో వ్యాధిగ్రస్తులు మానసికంగా ఎంతో కుంగిపోతున్నారు. భయపడకండి ఆధునిక, సాంకేతిక విధానాల ద్వారా ఈ వ్యాధికి చరమగీతం పాడండి. బొల్లి మచ్చల తీవ్రతను ఆధునిక సాంకేతిక పద్ధతులతో తగ్గించవచ్చు. విటిలిగోతో మీరిక మానసికంగా కుంగిపోనవసరం లేదు. వైరాగ్యం చెందకండి. చక్కని చికిత్స అందుబాటులో ఉంది.

(నేడు బొల్లి మచ్చల నివారణ దినోత్సవం)

డా. ఎమ్‌ఎన్ రావు

చర్మవ్యాధి, విటిలిగో నిపుణులు

88856 25515

Next Story

Most Viewed