మరోకోణం: ఖమ్మం సభ సందేశం ఇదేనా!

by D.Markandeya |
మరోకోణం: ఖమ్మం సభ సందేశం ఇదేనా!
X

భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఐదు లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు లక్షల్లోపే జనం హాజరయ్యారని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఈ సభకు ముఖ్య ఆకర్షణగా నిలిచారు. బీజేపీపై కేసీఆర్ ఆరంభించిన పోరాటానికి వాళ్లందరూ తమ మద్దతును ప్రకటించారు. దేశం మతం, విద్వేష రాజకీయాల్లో కూరుకుపోతోందని, కమలదళాన్ని గద్దె నుంచి దించడమే అందుకు పరిష్కార మార్గమని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ప్రసంగ సారాంశం కూడా దాదాపుగా ఇలాగే ఉన్నా, ఈసారి ఆయన స్పీచ్‌లో ఎలాంటి పంచ్‌ డైలాగులు, వాడి, వేడి కనిపించలేదు. రొటీన్‌కు భిన్నంగా చాలా పేలవంగా సాగింది.

ఖమ్మం సభను కేసీఆర్ ప్లాన్ చేయడానికి రెండు కారణాలున్నాయి. జనవరి 19న వందే భారత్ రైలును ప్రారంభించడానికి వచ్చే ప్రధాని మోడీతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీసభ నిర్వహించాలని బీజేపీ తలపెట్టడం మొదటిది. వారి సభను తలదన్నే తీరులో ముందే తాము బలప్రదర్శన చేయాలని ఆయన భావించారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎలాగూ ఒక భారీసభ నిర్వహించాలనుకున్నారు కనుక అది ఇప్పుడే చేయ నిశ్చయించడం రెండవది. అయితే, ఊహించని విధంగా మోడీ ప్రోగ్రాం రద్దు కావడంతో గులాబీ బాస్‌తో పాటు బీఆర్ఎస్ నేతల్లో, శ్రేణుల్లో ఉత్సాహం, ఆసక్తి సన్నగిల్లింది. ఖమ్మం చుట్టూ ఉన్న 18 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 25వేల చొప్పున ప్రజలను తరలించాలని అనుకున్నా ఆచరణలో అది ఫలించలేదు. కొన్ని చోట్ల నుంచి వందల్లో కూడా జనం రాలేదని ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. స్థానికంగా ఖమ్మం నుంచి, సత్తుపల్లి, ఆంధ్రా సరిహద్దుల నుంచే ఎక్కువ మంది వచ్చారంటున్నారు.

మోడీని ఓడిద్దాం. అందరిదీ అదే మాటే

బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా భావిస్తున్న ఖమ్మం సభ ఏం సాధించింది? ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చింది? కేసీఆర్ ఏం మాట్లాడారు? అతిథులుగా వచ్చిన ప్రతిపక్షాల నేతలు, సీఎంలు ఏం మాట్లాడారు? బీజేపీని గద్దె దించడానికి వాళ్లు సూచించిందేమిటి అన్న విషయాలను పరిశీలిద్దాం. మొట్టమొదట ప్రసంగించిన విజయన్ కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో పాలన జరుగుతున్న తీరును మెచ్చుకున్నారు. బీజేపీని తరిమికొట్టే పోరు తెలంగాణ నుంచే ఆరంభం కావాలని అఖిలేశ్ యాదవ్ ఆకాంక్షించారు. తనను ఆహ్వానించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. తమ రాష్ట్రంలోనూ ఇక్కడి పథకాలను ప్రవేశపెడతామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. కమలదళాన్ని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని డి రాజా ఉద్బోధించారు.

చివరగా మాట్లాడిన సీఎం కేసీఆర్ దేశంలో రాబోయేది విపక్షాల ప్రభుత్వమేనని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మోడీ ఇంటికి, తాము ఢిల్లీకి వెళ్లడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు లక్ష్యాన్ని వివరించారు. దేశాన్ని ఎన్నో ఏళ్ల పాటు పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. జపాన్, సింగపూర్, మలేషియా, దక్షిణకొరియా వంటి చిన్న దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. అసమర్థ, మూర్ఖపు పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికే బీఆర్ఎస్ పుట్టిందని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ ఊసే లేని పోరు సాధ్యమేనా

గుర్తించాల్సిన విషయమేమంటే, బీజేపీ వ్యతిరేక పోరులో కలిసి రావాల్సిన, కీలకపాత్ర వహించాల్సిన జాతీయపార్టీ కాంగ్రెస్ గురించి సీపీఐ, సీపీఎం నేతలు సహా వక్తలెవరూ ప్రస్తావించనేలేదు. కేసీఆర్ ఒకసారి ప్రస్తావించినా దేశం ఇంత అధ్వాన్న పరిస్థితిలో ఉండడానికి ఆ పార్టీ కూడా కారణమేనని నిందించారు. గతంలో కూడా ఆయన ఎన్నోసార్లు తను పెట్టబోయే కొత్త పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరంలో ఉంటుందని స్పష్టం చేశారు. ఏ సందర్భంలోనూ కాషాయదళానికి వ్యతిరేకంగా చేసే యుద్ధంలో అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కలుపుకుపోతామని చెప్పలేదు. నిజానికి తెలంగాణలో ఆ పార్టీని బలహీనపర్చడానికి గత ఎనిమిదేళ్లలో ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ రోజున ఇక్కడ బీజేపీ బలపడిందంటే అది కేసీఆర్ చలవ వల్లనే అనేవాళ్లు రాష్ట్రంలో కోకొల్లలు. కర్ణాటకలో తమ పార్టీని ఓడించడానికి ఒక నేతకు కేసీఆర్ రూ. 500 కోట్లు ఆశ చూపారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మొన్ననే ఆరోపించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాలి.

ఇక 2024 ఎన్నికల్లో కమలదళాన్ని ఓడించాలని పిలుపునిచ్చిన ఆప్ అధినేత కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుసరిస్తున్న వైఖరి చూస్తే అనేక అనుమానాలు కలుగుతాయి. వాస్తవానికి ఏర్పడిన నాటి నుంచీ ఆయన పార్టీ బీజేపీకి బీ టీం అన్న రీతిలోనే వ్యవహరిస్తున్నది. ఢిల్లీలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవడానికి, పంజాబ్ హస్తం చేజారడానికి, గుజరాత్‌లో అనూహ్య ఓటమిని చవి చూడడానికి ఆప్ కారణమన్న విషయం జగద్విదితమే. ఆప్ ఎక్కడ పోటీ చేసినా ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక ఏర్పడి అధికార బీజేపీకే లాభిస్తున్నది. కాంగ్రెస్ నష్టపోతున్నది. బీజేపీతో పాటు కాంగ్రెస్‌నూ ఘాటుగా విమర్శించే కేజ్రీవాల్ పార్టీ రేపటి ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేసినా ఇదే జరగక తప్పదు.

సభకు హాజరైన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ అందరం కలిసి బీజేపీని తరిమికొడదామన్నారు. అయితే, గత ఏడాదిలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చేసిందేమిటి? పొత్తు కోసం చర్చలకు వచ్చిన కాంగ్రెస్‌, బీఎస్పీలను దూరం పెట్టారు. కొన్ని చిన్నపార్టీలనే చేరదీశారు. ఫలితంగా ఓడిపోతుందనుకున్న బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. సీఎం సీటు తనదేనని ప్రకటించిన ఆయన ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు. బీఎస్పీ, కాంగ్రెస్ రెండూ అడ్రస్ లేకుండా పోయాయి.

పాపం వామపక్షాలు...!

బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని ప్రకటించిన వామపక్షాల వైఖరిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటికే తెలంగాణలో అవి తోకపార్టీలుగా మారిపోయాయి. జాతీయస్థాయిలో కూడా అలాంటి పాత్రే పోషించడానికి ఉవ్విళ్లూరుతున్నాయని విజయన్, రాజా ప్రసంగాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ లేని ప్రత్యామ్నాయం వృథా ప్రయాసేనని కనీసం వాళ్లన్నా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సభలో స్పష్టం చేయకపోవడం అవకాశవాదానికి పరాకాష్టగా చెప్పకతప్పదు. 1990ల నుంచీ ఆ పార్టీలు బీజేపీ మతోన్మాదం గురించి గొంతు చించుకుని అరుస్తూనే వున్నాయి. కాని ఇప్పటి వరకూ జాతీయస్థాయిలో భావసారూప్యత కలిగిన అన్ని పార్టీలను ఒక్కటి చేయడానికి చేసిన కృషి ఏమిటి? ఇప్పటికి ఇంకా జాతీయపార్టీ గుర్తింపే రాని, తెలంగాణ తప్ప ఎక్కడా ఉనికిలోనే లేని బీఆర్ఎస్ కాషాయదళాన్ని ఢీకొనగలదని ఎలా ఆశిస్తారు?

ఇప్పటికైనా కేసీఆర్ సహా ఖమ్మం సభలో పాల్గొన్న అన్ని పార్టీల నేతలు కాంగ్రెస్ పట్ల తమ వైఖరిని స్పష్టంగా ప్రకటించాలి. బీజేపీ వ్యతిరేక ఐక్యసంఘటనకు ఎవరు నాయకత్వం వహించాలో, ఎవరు చొరవ చూపాలో ఒక అవగాహనకు రావాలి. 137 ఏళ్ల చరిత్ర కలిగి, యాభై ఏళ్లకు పైగా దేశాన్ని పాలించి, అన్ని రకాల ఎన్నికల్లోనూ ప్రస్తుతం మరే పార్టీ పొందనన్ని ఓట్లను, సీట్లను సాధిస్తున్న పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ లేకుండా కూటమి అంటే నేతృత్వం ఎవరు వహించాలి? రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉండి, ఇటీవలే జాతీయపార్టీ గుర్తింపు పొంది, పలు రాష్ట్రాల్లో అడుగుపెడుతున్న ఆమ్ ఆద్మీయా? బెంగాల్‌ తప్ప మరోచోట ఉనికిని నిరూపించుకోని, గతంలో ఒకసారి బీజేపీ సర్కారులో చేరిన తృణమూల్ మమతాబెనర్జీయా? సొంత అస్తిత్వాన్ని ఏనాడూ చూపించని వామపక్షాలా? ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేని ఎన్సీపీ, బీఎస్పీలా?

ఆ పార్టీలేవీ కాదు.. బీఆర్ఎస్‌కు మాత్రమే బీజేపీని ఓడించగల, ప్రత్యామ్నాయ కూటమికి నాయకత్వం వహించగల సత్తా ఉంది.. కేసీఆర్ ఇక్కడ సుపరిపాలన చేస్తున్నారు.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చారు.. దేశాన్ని కూడా మార్చగలరు.. అందుకే ఖమ్మం సభకు వచ్చాం.. ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించాం.. అంటే మాత్రం ఆ విషయాన్ని సూటిగా, స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.

-డి.మార్కండేయ

editor@dishadaily.com

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Next Story

Most Viewed