జగన్ ఎత్తుగడ ఫలించేనా?

by Disha edit |
జగన్ ఎత్తుగడ ఫలించేనా?
X

బీసీలకు పెద్దపీట వెయ్యాలంటే తెలంగాణ నుంచి తీసుకురావాలా? ఏం, మేం కూర్చోలేమా పీట మీద' అని లోలోపల రగిలిపోతున్నారంట వైసీపీ బీసీ నేతలు. అగ్గిమీద గుగ్గిలం జల్లినట్టు టీడీపీ శ్రేణులు వారిని రెచ్చగొట్టే పనిలో పడ్డారు. టీడీపీకి ఎసరు పెట్టడమేమో కానీ, కొంపలో కుంపటి పెట్టుకున్నట్టు అయ్యింది వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. నిజానికి ఆర్.కృష్ణయ్య కంటే విశ్వాసంగా తొమ్మిదేళ్లపాటు పదవులు లేకుండా జగన్ వెంటే నడిచిన బీసీ నేతలు ఎందరో ఉన్నారు. వారిని కాదని తెలంగాణవాసికి ఇవ్వడం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినవారికి మింగుడుపడని విషయమే.

పీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ఒక పట్టాన ఎవరికీ అర్థం కావు. ఒక్కోసారి పథకం ఫలించి లాభం చేకూరినా, కొన్ని నిర్ణయాలు మాత్రం సవాల్‌గా మారుతాయి. మొత్తానికి సీఎం జగన్ నిర్ణయాలు సాహసోపేతంగా ఉండటమే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ కనీసం వారం రోజులైనా చర్చించుకునేలా ఉంటాయి. ఇప్పుడు రాజ్యసభకు అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ ఆయన నిర్ణయం తెలుగు రాష్ట్రాలలో 'టాక్ ఆఫ్ ది పొలిటికల్ టౌన్' అయిపోయింది. రాజకీయ ఉద్దండులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ కూడా అవాక్కయ్యే డెసిషన్ అది. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేతకు టికెట్ ఇవ్వడంపై జగన్ ప్లాన్ ఏంటో తెలియక రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సామాన్యులు కూడా బుర్రలు బద్దలయ్యేలా ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో లాజిక్ చెబుతున్నారు.

ఈ ఈక్వేషన్స్ ఏది విన్నా, నిజమే జగన్ ప్లాన్ ఇదేనేమో, ఓహ్ ఇలా కాబోలు, అలా కాబోలు అనుకునేంత కన్విన్సింగ్‌గా ఉంటున్నాయి. ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడంలో జగన్‌ది 'స్వకార్యం, స్వామి కార్యం' ఐడియా అంటున్నారు విశ్లేషకులు. వైఎస్‌ఆర్ కుటుంబం పట్ల తొలి నుంచి విధేయతతో వ్యవహరించారు కృష్ణయ్య. వైఎస్‌ఆర్ మీద ఎనలేని అభిమానాన్ని చూపేవారు. ఆయన మరణానంతరం వారి కుటుంబానికి మద్దతుగా నిలిచారు. జగన్‌ని సీఎం చేయాలంటూ బలంగా డిమాండ్ చేశారు. జైలులో ఉన్నప్పుడు కూడా జగన్‌ని పలుమార్లు కలిశారు, కూతురి పెళ్లికి ఆహ్వానించారు. పాదయాత్రలో ఆయనతో కలిసి కొన్ని అడుగులు వేసి, బీసీ సంఘం నేతగా మద్దతు ప్రకటించారు. ఇవి చాలు కృష్ణయ్యకు వైఎస్ జగన్ అంటే ఎంత అభిమానమో చెప్పడానికి. మరి జగన్ ఆ అభిమానానికి బహుమానం ఇవ్వకుండా ఉండగలరా? సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఋణం తీర్చుకోవాల్సిందే. అందుకే రాజ్యసభ సీటు రూపంలో 'స్వకార్యం' కానిచ్చేశారు.

ఇది మరోకోణం

ఇక కృష్ణయ్య బీసీ నేత కావడంతో బీసీల పార్టీగా పేరున్న టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడం మరో ఎత్తుగడ. జగన్ ఎంపిక చేసిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరు బీసీలే. దీంతో పార్టీని ఆ వర్గాల ప్రజలలోకి బలంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. దీంతో 'స్వామి కార్యం' కానిచ్చేసినట్టే అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది. 'బీసీలకు పెద్ద పీట వెయ్యాలంటే తెలంగాణ నుంచి తీసుకురావాలా? ఏం, మేం కూర్చోలేమా పీట మీద' అని లోలోపల రగిలిపోతున్నారంట వైసీపీ బీసీ నేతలు.

అగ్గిమీద గుగ్గిలం జల్లినట్టు టీడీపీ శ్రేణులు వారిని రెచ్చగొట్టే పనిలో పడ్డారు. టీడీపీకి ఎసరు పెట్టడమేమో కానీ, కొంపలో కుంపటి పెట్టుకున్నట్టు అయ్యింది వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం. నిజానికి ఆర్.కృష్ణయ్య కంటే విశ్వాసంగా తొమ్మిదేళ్లపాటు పదవులు లేకుండా జగన్ వెంటే నడిచిన బీసీ నేతలు ఎందరో ఉన్నారు. వారిని కాదని తెలంగాణవాసికి ఇవ్వడం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినవారికి మింగుడుపడని విషయమే.

వెల్లువలా అసంతృప్తి

ఆర్.కృష్ణయ్య ఒక్కరే కాదు, మరో అభ్యర్థి జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తే కావడం గమనార్హం. ఈ ఇద్దరి ఎంపికతో ఏపీ ప్రజలలో పనిగట్టుకుని ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొట్టినట్టయింది. ఇప్పటికే ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు 'గో బ్యాక్ ఆర్.కృష్ణయ్య, గో బ్యాక్ నిరంజన్ రెడ్డి' అంటూ ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మరో ఇద్దరు అభ్యర్థులు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు నెల్లూరు జిల్లాకి చెందినవారే కావడం ఇతర జిల్లా నాయకులలో అసంతృప్తిని రగులుస్తోంది. మొత్తానికి సామాజిక సమన్యాయం స్లోగన్ తో ముందుకెళ్తున్న జగన్ ఈక్వేషన్ ఆ నలుగురిలో ఇద్దరు బీసీలు, ఇద్దరు రెడ్లు, అందులోనూ ఇద్దరు తెలంగాణ, ఇద్దరు ఏపీ వాస్తవ్యులు కావడంతో 'అన్ ఈక్వల్ ఈక్వేషన్' అయిందని చెప్పొచ్చు. టీడీపీకి నష్టం సంగతి పక్కన పెడితే, వైసీపీపై వ్యతిరేకత పెంచడానికి వారికి మరొక బలమైన అస్త్రం అందించినట్టైంది ఏపీ సీఎం జగన్ నిర్ణయం.

వనజ మోర్ల

90590 42536


Next Story

Most Viewed