ఉన్నది ఉన్నట్టు:కలవరపెడుతున్న పవర్ కట్

by Viswanth |
ఉన్నది ఉన్నట్టు:కలవరపెడుతున్న పవర్ కట్
X

విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖల వాదనలన్నీ పరిశీలిస్తే ఒక ప్లాన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించారన్న అనుమానం కలుగుతున్నది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లేవనెత్తిన నాన్-బీజేపీ రాష్ట్రాల బకాయిలే కరెంటు సంక్షోభానికి కారణమైతే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలోనూ ఎందుకు పవర్ కట్‌లు ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆయా రంగాలు సమర్ధవంతమైన ఫలితాలు సాధించాలన్నా, అంతిమంగా ఆర్థిక పరిపుష్టి జరగాలన్నా, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా విద్యుత్ సరఫరా కీలకమని సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తొలి రోజులలోనే గ్రహించారు. ఆరు నెలల వ్యవధిలోనే నిరంతరాయ విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశించినట్లుగానే చాలా రాష్ట్రాల కంటే భిన్నంగా ఎకానమీ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది. దేశమంతా కరెంటు కోతలతో సతమతమవుతున్నా తెలంగాణలో మాత్రం 24 గంటలూ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

తంలో ఎన్నడూ లేనంతటి తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొన్నది. ప్రతీ ఏటా వేసవికాలంలో విద్యుత్ వినియోగం పెరిగి భారీ డిమాండ్ ఏర్పడడం సహజం. ప్రభుత్వాలు ముందుగానే ఇందుకోసం తగిన ప్రణాళికను రూపొందించుకుంటాయి. దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయి. కానీ, ఈసారి అది కొరవడిందనడానికి పలు రాష్ట్రాలలోని అంధకారం, కరెంటు కోతలే నిదర్శనం. కేంద్ర హోం శాఖ పరిధిలోని డీఓపీటీ అధికారులు ఇటీవల కొన్ని రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్సు జరిపే సమయంలో కరెంటు కోతల కారణంగా అర్థంతరంగా ఆ మీటింగ్ నిలిచిపోయింది. ముందుచూపుతో వ్యవహరించిన తెలంగాణ ఇందుకు మినహాయింపు.

మొబైల్ చార్జింగ్ మొదలు రైళ్ల వరకు విద్యుత్ ఒక తప్పనిసరి అవసరం. ఆన్‌లైన్ వ్యవస్థ మునుపెన్నటికంటే విస్తృతంగా వాడుతున్నాం. కరెంటు లేకపోతే అన్నీ కుప్పకూలుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్నా కేంద్రం విఫలం కావడం గమనార్హం. దాదాపు 16 రాష్ట్రాలలో విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. సగం దేశం అంధకారంలో మునిగిపోయింది. చివరకు ఉత్పత్తి రంగంపైనా, ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం పడింది. కేంద్ర ప్రభుత్వ ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యానికి కరెంటు కోతల రూపంలో తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ప్రొడక్షన్ లింక్ డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌తో పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చినా విద్యుత్ కొరత ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నది.

నిర్లక్ష్యమే కారణం

కేంద్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యమే విద్యుత్ సంక్షోభానికి కారణం. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం మరో కారణం. బొగ్గు లేని కారణంగానే విద్యుత్ ఉత్పత్తి కుంటుపడిందని ప్రభుత్వ, ప్రైవేటు థర్మల్ ప్లాంట్ల వాదన. కోల్ ఇండియా మాత్రం పుష్కలంగా బొగ్గు ఉన్నదని చెప్తున్నది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు తీసుకెళ్లడం లేదని వాదిస్తున్నది. తగినంత సంఖ్యలో గూడ్సు వ్యాగన్లు లేని కారణంగా రవాణా సాధ్యం కావడం లేదని కోల్ ఇండియా, పవర్ జనరేటర్లు చెప్తున్నారు. ఇంకోవైపు ఉత్పత్తి సంస్థలకు జెన్‌కోలు బకాయిలు పడినందునే సరఫరా చేయడం లేదని కేంద్ర విద్యుత్ మంత్రి చెప్తున్నారు.

తగినంత స్టాక్ ఉంటే ఎన్ని వ్యాగన్లను నడపడానికైనా సిద్ధమంటూ రైల్వే శాఖ ప్రకటిస్తున్నది. కోల్ ఇండియా, విద్యుత్ మంత్రిత్వశాఖ, రైల్వే శాఖలు పరస్పరం భిన్న వాదనలను తెరపైకి తెచ్చాయి. అన్ని శాఖలను సమన్వయించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ముందుచూపు లేని కారణంగా సగం దేశం అంధకారంలోకి వెళ్లిపోయింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని తెలిసినా తగిన ఏర్పాట్లు చేయలేదు.కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బొగ్గు ధరలు పెరగడంతో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి తగ్గిపోయిందని సమర్ధించుకుంటున్నది. చివరకు ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపుతున్నది. గతేడాది సెప్టెంబరులో విదేశీ బొగ్గు ధరలు పెరిగితే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.

రోజురోజుకు తగ్గిపోతున్న స్టాక్

దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌లో సుమారు 80 శాతం బొగ్గు మీద ఆధారపడి థర్మల్ ప్లాంట్లు తయారుచేస్తున్నవే. ప్లాంట్ల దగ్గర నెల రోజులకు సరిపడే నిల్వలు రెడీగా ఉండాలి. కానీ, సగటున తొమ్మిది రోజుల స్టాక్ మాత్రమే ఉంటున్నది. మొత్తం 173 థర్మల్ ప్లాంట్లలో ఎనిమిది మూతపడ్డాయి. సుమారు 125 ప్లాంట్లలో 'క్రిటికల్ స్టాక్స్'(21 శాతం కంటే తక్కువ) మాత్రమే ఉన్నట్లు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్తున్నది. గతేడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 16 శాతం పెరిగినట్లు అంచనా వేసింది. పారిశ్రామిక రంగం వృద్ధి పైన ఫోకస్ పెట్టినప్పుడు సహజంగానే వినియోగం పెరుగుతుంది.దానికి తగినట్లుగా ఉత్పత్తిమీద కూడా ఫోకస్ పెట్టలేకపోయింది.

వాస్తవం బైటకు రాకుండా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్‌ మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అమ్మోనియం నైట్రేట్ సరఫరా ఆగిపోయింది. ఇది లేకుండా ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్‌లో బ్లాస్టింగ్‌ సాధ్యం కాదు. దీంతో ఇతర రాష్ట్రాలలో బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. తవ్వి తీసినదాన్ని రవాణా చేయడానికి తగిన వ్యాగన్లు లేవు. చివరకు విద్యుత్ మంత్రిత్వశాఖ రంగంలోకి దిగి బ్లాకులకు దగ్గర్లో ఉన్న థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయాల్సిందిగా తాత్కాలిక సర్దుబాటు చేయాల్సి వచ్చింది. విద్యుత్ డిమాండ్‌కు తగినంత సప్లై లేకపోవడంతో ఇండ్లు, పరిశ్రమలు, వ్యవసాయం దెబ్బతింటున్నాయి. జూన్ రెండో వారం వరకూ విద్యుత్ సంక్షోభం తప్పేలా లేదు.

జాతీయ సంక్షోభమేనా?

ప్రస్తుతం నెలకొన్న పవర్ క్రైసిస్‌ను కొన్ని నాన్-బీజేపీ రాష్ట్రాలు జాతీయ సంక్షోభంగా వ్యాఖ్యానించాయి. కరెంటును పొదుపుగా వాడుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. పవర్ ఎక్స్చేంజిలో ఒక్కో యూనిట్‌ను రూ. 12 పెట్టి కొందామన్నా దొరకడంలేదు. అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే ఎక్ఛేంజి మాత్రం రెండు వేల మెగావాట్లను సమకూర్చగలుగుతున్నది. బొగ్గు లేకపోవడమే ఇందుకు కారణం. విదేశీ బొగ్గు ధరలు పెరిగినందున వివిధ రాష్ట్రాల జెన్‌కోలు బకాయిలను వెంటవెంటనే చెల్లిస్తే దిగుమతి చేసుకోడానికి వెసులుబాటు లభిస్తుందంటూ ప్రైవేటు థర్మల్ ప్లాంట్లు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చాయి. బకాయిల వసూలుకు కొత్త ఉపాయాన్ని కనిపెట్టాయి.

ఇప్పుడు నెలకొన్న విద్యుత్ సంక్షోభం ఉద్దేశపూర్వకంగా సృష్టించిందేననే ఆరోపణలూ లేకపోలేదు. దేశం మొత్తానికి బొగ్గు దిగుమతి చేసుకునే ఒక బడా సంస్థకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రూపంలో సహకారం ఇస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా విద్యుత్ సంక్షోభాన్ని నివారించాలనుకుంటే అన్ని శాఖల సమన్వయంతో ఎమర్జెన్సీ ఏర్పాట్లతో అధిగమించడం అసాధ్యమేమీ కాదు. దేశమంతా విద్యుత్ సంక్షోభం ఉన్నా తెలంగాణ మాత్రం వెలిగిపోతున్నది. సింగరేణిలో పుష్కలమైన బొగ్గు నిల్వలు ఉండడం ఒక కారణం కావచ్చు. కానీ, గతేడాది సెప్టెంబరులో విదేశీ బొగ్గు ధరలు పెరిగినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నది.

బకాయిల మీద నెపం

విదేశీ బొగ్గు వాడి విద్యుత్ సప్లై చేయడం కష్టమేమీ కాదని, కానీ నాన్-బీజేపీ రాష్ట్రాల్లోని జెన్‌కోలు బకాయిలు చెల్లిస్తేనే ఇది సాధ్యమని కేంద్ర విద్యుత్ మంత్రి వాదిస్తున్నారు. విద్యుత్ సంక్షోభానికి రాజకీయ రంగు చేర్చారు. ఏ రాష్ట్రానికి చెందిన జెన్‌కో సంస్థలు ఎంత బకాయిలు ఉన్నాయో ఏకరువు పెట్టారు. దీని ద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరికొత్త ఘర్షణను సృష్టించారు. ఒకవైపు ఆర్థిక సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై పెత్తనం చేసే విధానాన్ని అమలు చేస్తూనే ఇప్పుడు బకాయిల వసూలుకు సరికొత్త లాజిక్ ప్రయోగిస్తున్నారు. విద్యుత్, బొగ్గు, రైల్వే మంత్రిత్వశాఖల వాదనలన్నీ పరిశీలిస్తే ఒక ప్లాన్ ప్రకారం ఉద్దేశపూర్వకంగానే విద్యుత్ సంక్షోభాన్ని సృష్టించారన్న అనుమానం కలుగుతున్నది.

కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ లేవనెత్తిన నాన్-బీజేపీ రాష్ట్రాల బకాయిలే కరెంటు సంక్షోభానికి కారణమైతే గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలోనూ ఎందుకు పవర్ కట్‌లు ఉన్నాయనే ప్రశ్నలకు సమాధానం లేదు. ఆయా రంగాలు సమర్ధవంతమైన ఫలితాలు సాధించాలన్నా, అంతిమంగా ఆర్థిక పరిపుష్టి జరగాలన్నా, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా విద్యుత్ సరఫరా కీలకమని సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తొలి రోజులలోనే గ్రహించారు. ఆరు నెలల వ్యవధిలోనే నిరంతరాయ విద్యుత్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆశించినట్లుగానే చాలా రాష్ట్రాలకంటే భిన్నంగా ఎకానమీ వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నది. దేశమంతా కరెంటు కోతలతో సతమతమవుతున్నా తెలంగాణలో మాత్రం 24 గంటలూ వెలుగులు విరజిమ్ముతున్నాయి.

అందుకే కేంద్రం వెనుకడుగు

ఈ కారణంగానే తెలంగాణను విద్యుత్ రంగంలో కేంద్రం విమర్శించే సాహసం చేయలేకపోతున్నది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో పవర్ పాలిటిక్స్ నడుస్తున్న సమయంలో సందర్భం కోసం రెండు పార్టీలూ ఎదురుచూస్తున్నాయి. కేంద్రాన్ని నిరంతరం విమర్శించడంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కేటీఆర్ ట్వీట్‌లన్నీ ఇటీవల కేంద్రాన్ని తిట్టడంపైనే ఉంటున్నాయి. ఇప్పుడు వాటికి విద్యుత్ సంక్షోభం తోడైంది. బీజేపీని కార్నర్ చేయడానికి కేసీఆర్‌ రానున్న కాలంలో దీన్ని బలమైన అస్త్రంగా ఉపయోగించనున్నారు.

ఎన్. విశ్వనాథ్

99714 82403


Next Story

Most Viewed