టీఆర్ఎస్ పేరు మార్పు విఫల ప్రయోగమేనా!?

by Disha edit |
టీఆర్ఎస్ పేరు మార్పు విఫల ప్రయోగమేనా!?
X

దేశంలో అనేక రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోతున్నామని ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాయి. అలాంటి కోవలోకే తెలంగాణ పోరాటం వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో కూడిన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ ఉద్యమంలో అనేకమంది ఉద్యమకారులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. కానీ కొన్ని కారణాల వల్ల రాష్ట్రం ఏర్పడకుండానే ఉద్యమం బలహీన పడిపోయింది. ఈ ఉద్యమం కొనసాగింపుగానే నీళ్లు, నిధులు నియామకాలను ఆంధ్ర పాలకులు దోచుకుంటున్నారనే నినాదంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి రాష్ట్రంలో అప్పట్లో వచ్చిన ఉప ఎన్నికలు, ఎన్నికలలో పోటీ చేసి కొన్ని గెలిచి కొన్ని ఓడిపోయారు. కానీ 2009 నుండి 2014 మధ్య ఉద్యమం ఉధృతంగా సాగి 1500 మంది ఉద్యమకారులు ఆత్మార్పణ చేసుకున్నారు. వేలాది మంది విద్యార్థులు పోరాడారు. అటు రాజకీయ పార్టీలు జేఏసీగా ఏర్పడి ఉద్యమించారు. ఈ ఉద్యమానికి జడిసిపోయిన కేంద్ర ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్లో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ సంవత్సరంలోనే ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించి గెలిపించారు. అలాగే రెండోసారి అంతే జరిగింది. గత తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికార దాహంతో దుర్బుద్ధి పుట్టి దేశ ప్రధానమంత్రి కావాలని కలలు కని, ఈ అత్యాశతోనే తెలంగాణ ప్రజలు కన్న తల్లిలా భావించిన టిఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చారు.

రెండింటికి చెడ్డ రేవడిలా..

అయితే ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపి విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితి గా మార్చడం అంటే అది దేశ చరిత్రలో విఫల ప్రయోగంగా మిగలక తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ ఐదు రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించి 50 నుండి 60 పార్లమెంటు స్థానాలను గెలుచుకొని ఏదో ఒక జాతీయ పార్టీ లేదా వివిధ ప్రాంతీయ పార్టీల మద్దతుతో దేశ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ రాష్ట్రంలో తన పుత్ర రత్నాన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఊహల్లో తేలిపోతున్న కేసీఆర్ చివరికి రెండిటికి చెడ్డ రేవడిలా మిగలక తప్పదంటున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా అవతరించాలంటే దేశంలో కనీసం నాలుగు రాష్ట్రాలలో ఆరు శాతం ఓట్లు సాధించి నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలవాలి, లోక్‌సభ ఎన్నికల్లో కనీసం రెండు శాతం సీట్లు మూడు రాష్ట్రాల్లో గెలవాలి, ప్రాంతీయ పార్టీగా నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. మరి ఈ అర్హతలు బీఆర్ఎస్ కి వచ్చేనా అన్నది అనుమానమే. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ పార్టీ హోదా పొందే అవకాశం లేదు. పేరు మార్చి, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇతర రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడితే, ఉద్యమ వీరులైన తెలంగాణ ప్రజలు చూస్తూ ఉండే పరిస్థితి లేదని కేసీఆర్ తెలుసుకోకపోతే దేశ ప్రధాని కాదు కదా రాష్ట్రంలో కూడా అధికారాన్ని కోల్పోక తప్పదని గ్రహించాలి.

రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు..

కేసీఆర్ ఆశలు పెట్టుకున్న ఐదు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, అసలు 2019 ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోనే 16 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పూర్తి స్థానాలు గెలవలేదు. కేవలం 9 స్థానాలు మాత్రమే గెలిచింది. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో బలపడటంతో వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు గెలుచుకోవడం కష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్‌ను నమ్మే పరిస్థితి ఉందా!? ఉద్యమ సమయంలో పరుష పదజాలంతో దూషించిన వ్యక్తిని అక్కడ గెలిపిస్తారా!? అక్కడ ఇప్పటికే ఉన్న పార్టీల బలంగా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కడం కష్టమే!

ఇక తమిళనాడులో, ఈ రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ప్రాంతేతర వ్యక్తుల జోక్యాన్ని సహించరు. పైగా అక్కడి ప్రాంతీయ పార్టీల మధ్యే పోరు ఉధృతంగా ఉంటుంది. ఇక అక్కడ గెలిచినా స్థాలిన్ సైతం కాంగ్రెస్‌కు మద్ధతిచ్చే అవకాశం ఎక్కువ మరి. అక్కడ బీఆర్ఎస్ ఉనికిని చాటేనా ఆలోచించుకోవాలి. మహారాష్ట్రలో సైతం బీజేపీ, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన చీలిక పార్టీ కూడా బలంగా ఉన్నాయి. వీటి మధ్యే ప్రధాన పోటీ ఉంటుంది కానీ అక్కడ వేరే పార్టీకి అవకాశం లేదు. ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీలో మహారాష్ట్ర నుంచి చేరికలు జరుగుతున్నా అవి కేవలం తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలోనే అని గ్రహించాలి.

కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ బలంగా ఉన్నాయి. ఇటీవల ఎన్నికలలోనూ అక్కడి ప్రజలు కాంగ్రెస్ అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నారు. ఇక అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చోటుంది. పైగా ఈ కర్ణాటక ఎన్నికలు దేశ రాజకీయాలనే ప్రభావితం చేశాయి. ఈ ఫలితాల తర్వాత మమతా బెనర్జీ, స్టాలిన్, నితీష్ కుమార్ , కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్ , తేజస్వి యాదవ్, శరద్ పవార్ మొదలైన అనేకమంది ప్రాంతీయ పార్టీల నాయకులు 2024 పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని నమ్మి బహిరంగంగా ప్రకటన చేస్తున్నారు. ఈ పరిస్థితులలో దేశంలో కేసీఆర్ స్థానం ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకోవాలి. పైగా సరిహద్దు రాష్ట్రాలలో ఇప్పటికి నదీ జలాల సమస్యలు అలానే ఉన్నాయి. ఈ రకంగా కేసీఆర్ ఏవైతే ఐదు రాష్ట్రాలలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించాలని లక్ష్యం పెట్టుకున్నాడో, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలొ తొక్కి అధికార వాంఛతో భారత రాష్ట్ర సమితిగా అవతరించి పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తూ క్షమించరని రాజకీయంగా తనను పతనం చేస్తారని గుర్తిస్తే బాగుంటుంది.

సిద్ధాంతం లేకపోతే ఎలా!?

దేశంలో ఇప్పుడే కాదు, గతంలో కూడా జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఫ్రంటులు పుట్టుకొచ్చాయి. కానీ అవి కూటమిగా ఉండలేకపోయాయి. మరి అలాంటప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పరిస్తే ఆయనను ప్రజలు నమ్ముతారా ఆలోచించుకోవాలి. గతంలో దేశంలో ఏర్పడిన ఫ్రంట్‌ల అనుభవాలను అధ్యయనం చేయకుండా, మేధో మధనం జరుపకుండా తొందరపాటుగా టీఆర్ఎస్‌ను రద్దుచేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేయడం తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నట్టుగా ఉంది. పార్టీని రద్దు చేయకుండా గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు లాగా మూడవ ఫ్రంటు ఏర్పాటుచేసి తనే కన్వీనర్‌గా ఎన్నికయ్యేలా చూసుకొని దేశ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తే బాగుండు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసినా ప్రజలు సమర్థిస్తారు గానీ, స్వార్థపూరితంగా, అధికారదాహంతో టీఆర్ఎస్ రద్దుచేసి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఇతర రాష్ట్రాలకు తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజల గొంతు కోస్తే ఇక్కడి ప్రజలు వ్యతిరేకతతో పాటు దేశంలోనూ వ్యతిరేకత తప్పదు. పైగా జాతీయ పార్టీలుగా అవతరించాలంటే ఏదో ఒక సిద్ధాంతం ఉండాలి. మరి ఏ సిద్ధాంతం లేని భారత రాష్ట్ర సమితి ఏ వర్గ ప్రయోజనాల కోసం ఏర్పడిందో తెలీదు. మరి ఈ పార్టీ జాతీయ పార్టీగా ఎలా అవతరించుకోగలుగుతుంది అనే విషయం ఆలోచించుకోవాలి.

డా.సంకినేని వెంకట్,

రాజనీతిశాస్త్ర అధ్యాపకులు, కేయూ

98662 06620


Next Story