వార్తా చానల్స్‌పై.. పెరుగుతున్న అపనమ్మకం!

by Disha edit |
వార్తా చానల్స్‌పై.. పెరుగుతున్న అపనమ్మకం!
X

ఇటీవల ఇండియా కూటమి దేశంలో అతి పెద్ద చానల్స్‌కు చెందిన 14 మంది యాంకర్ల డిబేట్లను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. వారు పిలిచే ఏ డిబేట్‌లోనూ పాల్గొనవద్దని నిర్ణయించాయి. వీరిలో సుధీర్ చౌదరి, అర్ణబ్ గోస్వామి లాంటి వారు ఉన్నారు. వీరు అంతా సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే ఎజెండాతో డిబేట్లు నిర్వహించడం, అధికార బీజేపీకి ప్రతినిధుల మాదిరి వ్యవహరించడం వల్లే వీరి ప్రోగ్రాంలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా కూటమి ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే బీజేపీ ఇప్పుడు ఆ 14 మంది యాంకర్స్‌కు మద్దతుగా రంగంలోకి దిగింది. కానీ వారి వాదనలో పసలేకపోవడంతో జనం పెద్దగా వారిని పట్టించుకునే పరిస్థితి లేదు.

సమాజ హితం కనిపించడం లేదు!

భారతదేశంలో 350కి పైగా టీవీ ఛానళ్ళు ఉన్నాయి. ఇందులో న్యూస్‌ను 24 గంటలు నడిపే టీవీ ఛానళ్లు 100కు పైగా ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం, వారిలో సమన్వయం, సంవేదనశీలత్వం తీసుకురావడంతో పాటు నాగరిక సమాజం ఏర్పాటు లక్ష్యంగా సమాజానికి దిశ, దశను సూచిస్తూ, పవిత్రమైన ఆశయం కోసం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యతలను మెజార్టీ ఛానళ్ళు పూర్తిగా విస్మరించాయని పేర్కొనవచ్చు. ప్రతీ చానల్లోనూ వారి రాజనీతి, అధికార పక్షం అనుకూల ముచ్చట వాసన ఇటీవల కాలంలో అధికంగా కనిపిస్తోంది. 1990 దశకంలో ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. సమాజం కోసం, సమాజ హితం కోసం అసమానతలను నిర్మూలించే విధంగా సమసమాజ నిర్మాణం కోసం పనిచేసే వారి సక్సెస్ స్టోరీలు తక్కువైపోయాయి. పెయిడ్ సక్సెస్ స్టోరీలు పెరిగిపోయాయి. ప్రజలను తప్పుదారి పట్టించే ఛానళ్లు ఎక్కువైపోయాయి. దీనికి సమంగా మరోవైపు సోషల్ మీడియా లొల్లి కనిపిస్తోంది.

నిజానికి అతి తక్కువ కాలంలో 72 లక్షల మంది సబ్స్క్రయిబర్లతో ముందున్న రవిష్ కుమార్ లాంటి నిస్వార్ధ జర్నలిస్టు నేతృత్వంలో యూట్యూబ్ చానల్ ప్రజల మన్ననలు పొందుతున్నది. అభిసార్ శర్మ, అజిత్ అంజుమ్, అర్ఫా ఖానం, సాక్షి జోషి, ప్రగ్యా, పుణ్య ప్రసూన్ లాంటి సీనియర్ జర్నలిస్టులు, మరో 10 నుంచి 18 యూట్యూబ్ ఛానళ్లను నడుపుతున్న, న్యూస్ క్లిక్, ది వైర్ లాంటి వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులు, నిజాన్ని నిర్భయంగా చూపడం, చెప్పడం వల్ల కాస్తో కూస్తో జర్నలిజం విలువలు బతికి ఉంటున్నాయి. ఇక కోకొల్లలు‌గా పుట్టిన యూట్యూబ్ చానల్స్ కూడా ఉన్నాయి. సమాజంలో ఇవి విద్వేషాల వ్యాప్తి కోసం పని చేస్తుంటే, ఎక్కువ శాతం ఛానళ్ళలో వారికి వచ్చే సమాచారాన్ని చీల్చి, చింపి, ట్రస్ట్ బెన్ఫిట్‌ని పెంచుతుంటాయి.

సొంత సిద్ధాంతాలని రుద్దుతూ..

ఒక విషయాన్ని, ఒక సబ్జెక్టును తీసుకొని ముందే డిసైడ్ అయిపోయి మేజర్ స్పాట్ లైట్ చానల్స్, ఆ టీవీకి సంబంధించిన యాంకర్ కొంత మందిని డిబేట్లో కూర్చుండబెడతారు. ఆ డిబేట్లో కొందరు యాంకర్‌ల ఆగ్రహం, ఉత్తేజం, డ్రామా, యాక్షన్ అన్ని లైవ్‌లో కనిపిస్తాయి. పాల్గొనే వారికి ఒక్కోసారి ఈ డిబెట్‌కి మేము ఎందుకు వచ్చామా అనే ఫీలింగ్ వస్తుంది. ఇది మా ప్రాణం మీదకు వచ్చే విధంగా ఉందనేలా వ్యవహారం ఉంటుంది. విచ్చలవిడితనం ఇక్కడ డ్రామా యాక్షన్లో కనిపిస్తుంది. సిద్ధాంతాలు, విషయాలు అక్కడ ఉండవు. తమ సొంత సిద్ధాంతాలు, తమ సొంత అభిప్రాయాలు ఉంటాయి. డిబేట్‌లో పాల్గొనే వారిని కొందరైతే భయకంపితులను చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. నో నో, ఎస్ ఎస్ అంటూ భయపెడుతూ చర్చలో కూర్చోబెడతారు. ఇలా పూర్తిగా మెజార్టీ చానల్స్‌లో నమ్మకం, అపనమ్మకం, బ్రేకింగ్ న్యూస్‌లు ఇవన్నీ మనం రోజూ చూస్తూనే ఉన్నాము. గతంలో పట్టణాలకే పరిమితమైన టీవీ వార్తా ఛానళ్ళు ఇప్పుడు 70 శాతం గ్రామాల్లో టీవీలు రావడంతో గ్రామాలలోకి కూడా చేరుకున్నాయి.

నిజమైన స్టోరీలు, ప్రకృతి విధ్వంస స్టోరీలు ఇప్పుడు కనిపించడమే తగ్గిపోయింది. ఒక క్రైమ్‌ను భయోత్పాతంగా చిత్రీకరించి దానిని జనం భయపడే విధంగా ప్రదర్శిస్తున్నారు. దానికి కూడా నకిలీ యాక్టర్లను సిద్ధం చేసి ఎపిసోడ్లను ప్రదర్శిస్తున్నారు. రాజకీయ వాతావరణాన్ని బట్టి అనుకూల, వ్యతిరేక వార్తా కథనాల సృష్టిలో కొన్ని ఛానళ్లు విపరీతంగా వ్యవహరిస్తున్నాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్నికల సందర్భాలలో జనం నమ్మే విధంగా ఆయా ప్రజాప్రతినిధుల కార్యకలాపాలకు సంబంధించిన పెయిడ్ స్టోరీలు జనాన్ని ప్రభావితం చేసే విధంగా ప్రదర్శించడం షరా మామూలైపోయింది. సహజంగా ఎన్నికలలో 14 నుంచి 15 శాతం తటస్తులైన ఓటర్లు ఉంటారు. వారిని మార్చే విధంగా షిఫ్టింగ్ ఓట్లపై వార్తా కథనాలు ప్రభావం చూపుతున్నాయని పేర్కొనవచ్చు. ఆలోచనా, బోధన, వార్తలు, రాజకీయ కమర్షియల్ బజార్లో ప్రజల ఆలోచనా విధానాన్ని తప్పుదారి పట్టే విధంగా కొన్ని ఛానళ్లు ప్రవర్తిస్తున్న తీరు ఎబ్బెట్టుగా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు.

వారు చరిత్రహీనులవుతారు..

భారత సమాజాన్ని, జీవించే శక్తిని సైతం పూర్తిగా దెబ్బతీసే విధంగా ఈ ఛానళ్ళ ప్రయత్నాలుంటున్నాయి. తాము చెప్పిందే నిజమంటూ మొత్తం దేశమంతా తమనే విశ్వసిస్తున్నారనే విధంగా నానా హంగామా సృష్టించడం ఇటీవల కాలంలో కొన్ని ఛానళ్ళలో గమనిస్తున్నాము. కరోనా సమయంలో దేశంలో టీవీ చానళ్ళు ప్రవర్తించిన తీరు చాలా మందిని ఇబ్బంది పాలు చేసింది, ఇంకా ఎవరూ దానిని మర్చి పోలేదు, దేశ ప్రజలు మరీ ముఖ్యంగా కోట్లాది నిరుపేదలు ఎదుర్కొంటున్న సమస్యలను, ఆకలి బాధలను, ఉపాధి ఇబ్బందులను, జీవన విధ్వంసాలను, వాస్తవ పరిస్థితులను ఏమాత్రం వివరించకుండా, చెప్పకుండా తమ మైండ్‌సెట్‌కు అనుకూలంగా, అనుగుణంగా జనాన్ని తయారు చేయడం కోసం కొన్ని టీవీ ఛానళ్ళు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే విశ్వాసం, అవిశ్వాసం మధ్యన వీరు చేస్తున్న మితిమీరిన డ్రామా, యాక్షన్లకు చైతన్యవంతులైన ప్రజలు తప్పనిసరిగా ఎప్పుడో ఒకప్పుడు అపనమ్మకం ఒకేవైపు ఉండే విధంగా నిర్ణయం తీసుకునే రోజు రాకపోదు. ఈరోజుకు సంచలనాత్మక టీఆర్పీల కోసం వార్తా ప్రసారాలను, డిబేట్లను నిర్వహిస్తున్న వారిని నేలకేసి కొట్టే రోజు రాకపోదు. కేవలం తమ వ్యక్తిగత అభిప్రాయాలను, అహంభావాన్ని జనం మీద రుద్ది మంచిని మంచి అనకుండా, చెడును చెడు అని చెప్పకుండా వ్యవహరిస్తున్న ఛానళ్ళ భరతం పట్టక తప్పదు. ఇప్పటికి దేశంలో అధికార పక్షాల సంకలోకి ఎక్కి తాము చెప్పేదే వేదమంటూ అధికారం ఉన్నోళ్ళ వైపు సంగీతం వాయించే వాయిద్యకారులు (యాంకర్లు, టీవీల యజమానులు) తప్పనిసరిగా చరిత్రహీనులుగా మారక తప్పదు. ఇది సామాన్య జనం కోసం నిత్యం తాపత్రయపడే పీపుల్ జర్నలిస్టుల వాయిస్.

ఎండి. మునీర్,

సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు,

99518 65223

Next Story

Most Viewed