ఆనందాల రంగుల కేళి

by Disha edit |
ఆనందాల రంగుల కేళి
X

కుల మత లింగ వయో భేదాలు లేకుండా పేద ధనిక మధ్యతరగతి అనే భేద భావం లేకుండా ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ హోలీ. చిగురించే ఆకులు వికసించే పుష్పాలతో వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి అంతా రంగురంగుల పూలతో నయనానందకరంగా ఉంటుంది. అలాగే మనిషి జీవితం కూడా కష్టసుఖాల కలబోత అని అందుకే మనిషి జీవితం రంగుల మయం కావాలని ప్రకృతి ఇచ్చే సంకేతంగా ఈ హోళీ పండుగను చెప్పుకోవచ్చు.

హోలీ అంటే అగ్ని అనీ, అగ్నితో పునీతమైంది అని అర్థం. ఈ హోళీనే కాముని పున్నం, డోలికోత్సవం, రంగుల పండుగ అని పిలుస్తారు. వసంత రుతువుకు స్వాగతం పలుకుతూ చేసుకునే పండుగ కాబట్టి దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.

పురాణ కథలు..

పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశపుని కొడుకు ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడంతో తన శత్రువైన విష్ణుమూర్తిని కొలవడం ఇష్టం లేని హిరణ్యకశిపుడు తన కొడుకుని చంపడానికి ఆయన చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దాంతో తన చెల్లెలు హోళికను పిలిచి ఒక వస్త్రం ఇచ్చి దాన్ని కప్పుకొని ప్రహ్లాదుని తీసుకొని మంటల్లో దూకమన్నాడు.తన అన్న మాటను శిరసావహించి హోళిక వస్రం కప్పుకొని ప్రహ్లాదున్ని మంటల్లో వేయడానికి ప్రయత్నించగా కప్పుకున్న వస్త్రం గాలికి కొట్టుకుపోయింది దాంతో మంటలు అంటుకొని హోలీక మంటల్లో తగలబడిపోయింది‌. శ్రీమహావిష్ణువు అనుగ్రహం వలన ప్రహల్లాదుడు ప్రాణాలతో బయటపడ్డాడు. హోళికా దహనానికి గుర్తుగా మనం హోలీ పండుగను జరుపుకుంటున్నాం.

దక్షయజ్ఞం సమయంలో అగ్నికి ఆహుతి అయిన సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ పరమేశ్వరుడు హిమాలయాల్లో తపోదీక్షలో ఉండగా మన్మధుడు పూల బాణం వేసి దీక్ష భగ్నం చేశాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి (కాముడు) మన్మధుని భస్మం చేశాడు. రతీదేవి కోరిక మేరకు మన్మధుడిని బతికించి ఎవరికీ కనపడకుండా కేవలం రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు అని వరం ఇచ్చాడు. మొదట కామ దహనం చేసిన తర్వాత రోజున హోలీని జరుపుకుంటున్నాం. శ్రీకృష్ణుడిని నల్లని వాడని రాధ హేళన చేయగా తనను ఏడిపించడానికి సరదాగా రంగులు పూస్తూ గోపికలతో పాటు కృష్ణుడు రంగుల పండుగ జరుపుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది.మనలో ఉన్న చెడును దహనం చేసి నిర్మలమైన స్వచ్ఛమైన మనసుతో ఎదుటివారికి ప్రేమను పంచడం వారితో సంతోషాలు పంచుకోవడం ఇందులోని పరమార్థం.

సహజసిద్ధమైన రంగులు వాడదాం..

హోళీ పర్వదినాన ప్రాచీన కాలంలో చెట్ల ఆకులు పూలతో ముఖ్యంగా మోదుగ పువ్వులను ఉడికించి రసం చేసి ఆ ద్రవాలను ఒకరిపై ఒకరు చల్లుకునేవారు. తర్వాత తరం వారు పసుపు కుంకుమ నీళ్లలో కలిపి రంగులు చల్లుకునేవారు. ఇప్పటి తరం వారు ఇంకొక అడుగు ముందుకేసి రసాయనాలతో కలిసిన రంగులు, కోడిగుడ్లు బురద ఇంకా విషపూరితమైన ద్రావణాలతో హోళీని జరుపుకుంటున్నారు. ఒకరోజు సరదా కోసం జరిగే ఈ పండుగ ప్రభావం రెండు మూడు నెలల వరకు ఈ రంగుల ప్రభావం మనపై ఉంటుంది .

ఒక్కో రంగు మనిషి జీవితంలో ఒక్కో అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి సిద్ధమైన రంగుల వలన మానవ శరీరానికి మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. సృష్టిలో ఒక్కోరంగు ఒక్కో ఆకర్షణను కలిగి ఉండి మన ఆలోచనల పైన మన మనసు పైన ఎంతో ప్రభావితం చేస్తుంది. అందుకే మన ఆచార సాంప్రదాయం ప్రకారం సహజసిద్ధమైన రంగులను ఉపయోగించి ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో హోలీ పండుగను జరుపుకుందాం. పర్యావరణ పరిరక్షణకు మన వంతు కృషి చేద్దాం. ఆరోగ్యంగా జీవిద్దాం. భావి తరాలకు బతుకును ఇద్దాం. హోలీ రంగుల ఉత్సవం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ హోళీ శుభాకాంక్షలు.

(రేపు హోలీ సందర్భంగా)

కొమ్మాల సంధ్య,

తెలుగు ఉపన్యాసకులు

9154068272



Next Story

Most Viewed