గుండె బలం గులాబీ జెండానే

by Disha edit |
గుండె బలం గులాబీ జెండానే
X

కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతంగా ముందుకు కదిలిన గులాబీ జెండానే తెలంగాణ సమాజానికి గుండె బలమై నిలుస్తున్నది. చరిత్రాత్మక నిర్ణయాలు, సబ్బండ వర్గాల సంక్షేమమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు కేసీఆర్. ఏడేండ్ల పాలనలోనే ప్రపంచ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చే అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. రైతులకు పెద్దపీట వేసేందుకు రైతుబంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టారు. ఈ పథకాల స్ఫూర్తితోనే కేంద్రం పీఎం కిసాన్ యోజనను అమలులోకి తెచ్చింది. అత్తారింటిలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో ఉండాలని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు అమలు చేశారు. తల్లిదండ్రుల రందిని తీర్చగలిగారు.

'మిషన్ భగీరథ' పేరుతో ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చి నీళ్ల గోస లేకుండా చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సైతం ఈ పథకాన్ని అభినందించడం విశేషం. భూవివాదాలను తగ్గించడానికి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చారు. ధరణితో భూ లావాదేవీలను సులభతరం చేశారు. కులవృత్తులకు అండగా నిలబడి, వారి ఆర్థిక ఎదుగుదలకు బలమైన పునాది వేయగలిగారు. దళితులలో ఆర్థిక స్వేచ్ఛ వచ్చినప్పుడే వారి జీవితాలలో వెలుగులు నిండుతాయన్న అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తికి అద్దం పట్టేలా, దళితబంధుతో ఎటువంటి షరతులు లేకుండా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు పంపిణీ చేసి అద్భుత క్రాంతి జ్యోతిని వెలిగించారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా సంక్షేమ పథకాలకు దారులు వేశారు.

హేళనకు సమాధానంగా

'అడగనిదే అమ్మ కూడా అన్నం పెట్టదు' అటువంటిది, అడగకుండానే తెలంగాణ సమాజంలో ఉన్న వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు చేపడుతున్న నేత కేసీఆర్. తెలంగాణ సాధించడం లక్ష్యం అయితే, సాధించిన తెలంగాణలో ప్రతి ఇల్లు ఆనందమయంగా ఉండాలనేది ఆయన ధ్యేయం. క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధికి శ్రీకారం చుట్టి గొప్ప పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తున్నారు. తెలంగాణ వస్తే ఏమొస్తదంటూ హేళనగా మాట్లాడిన వారికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రములో ప్రజలకు ఆత్మగౌరవాన్ని తీసుకువచ్చారు.

ఏదో ఒక సంక్షేమ పథకం అందని ఇల్లు లేదంటే కేసీఆర్ నిస్వార్థ పాలనను అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్ధలన్నింటినీ ప్రైవేటుకు ధారాదత్తం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి నుంచి ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేస్తూ, తెలంగాణ ప్రజలను కష్టాల నుంచి దూరం చేస్తూ గుండె ధైర్యాన్ని ఇస్తున్న గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అన్న సంగతి యావత్తు తెలంగాణ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది.

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516



Next Story

Most Viewed