గ్రూప్-1 పరీక్ష.. తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?

by Disha edit |
గ్రూప్-1 పరీక్ష.. తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?
X

మ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలనే తమ కలలను ఆంధ్ర పాలకులు కల్లలుగా మార్చినారంటూ.. ప్రత్యేక రాష్ట్ర మేర్పడితే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఉద్యమ నేత చెప్పిన మాటలను తెలంగాణ యువత వంద శాతం విశ్వసించారు. స్వరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా తమ కుటుంబం ఆర్థిక పరిపుష్ఠిని సాధించగలుగుతుందని ఆశపడ్డారు. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రమేర్పడిన తక్షణమే తమ కలలను సాకారం చేసుకోవడం కోసం లక్షలాది మంది నిరుద్యోగులు పోటీ పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవాలని కలలుగన్న మాట అక్షర సత్యం.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సదరు పోటీ పరీక్షల బాధ్యతను నిర్వహించడం కోసం ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్’ ఏర్పాటు జరిగింది. సామాజిక సేవా తత్పరులు, పోటీ పరీక్షల నిర్వహణలో రాటుదేలిన నిపుణులైన అధికారుల కలబోతగా కమిషన్ నిర్మించబడి కొనసాగుతుందని విశ్వసించారు. కానీ ఆ సంస్థలోని సభ్యుల కూర్పు ఆ సంస్థ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తడం రాష్ట్ర ప్రజలను ఒకింత ఆందోళనకు గురిచేసిన మాట నిజం. పరీక్షల నిర్వహణకు ఓ సమగ్ర జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నోటిఫికేషన్ల జారీలో నత్తనడక, పరీక్షల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను మళ్ళీ మళ్ళీ మార్చడం, పరీక్షలను వాయిదా వేయడం, తప్పుల తడక ప్రశ్న పత్రాలతో కోర్టులతో మొట్టికాయలు, రకరకాల తప్పిదాలతో పాటు ప్రశ్న పత్రాల లీకేజీ జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ఇతర పోటీ పరీక్షలతో పాటు గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను ప్రభుత్వమే రద్దు చేసింది.

అయితే ఈ లీకేజీలకు కారణమంటూ.. బోర్డు సభ్యులలోని కొందరిని తప్పించి బోర్డును ప్రక్షాళనచేసి లీకేజీలపై సిట్‌‌ను ఏర్పరచి దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది. అలాగే రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఇతర లీకేజీ అయిన మిగతా పరీక్షలను అత్యంత పకడ్బందీగా మళ్ళీ ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని టీ‌ఎస్‌పీఎస్సీకి స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

కోటి రూపాయలు కేటాయించలేరా?

అయితే ఓ వైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే, టీఎస్‌పీఎస్సీ రద్దయిన గ్రూప్-1 పరీక్షను రెండవసారి నిర్వహించింది. లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. అయితే ఈ పరీక్షను నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్దంగా ఉందని రద్దు చేసింది హైకోర్టు. దీంతో టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగ అభ్యర్థులు మండిపడుతున్నారు. గత అనుభవాన్ని గుర్తుపెట్టుకొని ఈ సారి జాగ్రత్తగా నిర్వహించకుండా, సైబర్ సెక్యూరిటీని గాలికొదిలి పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుండి బయోమెట్రిక్ అటెండెన్స్ లాంటి కనీస భద్రతా నిబంధనలను కూడా కొన్ని పరీక్ష కేంద్రాలలో పాటించలేదు. పైగా కొన్ని ఓ.ఎం.ఆర్ షీట్లపై హాల్ టికెట్ నెంబర్లే వేయలేదు. పైగా పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య కన్నా ఎక్కువ ఓ.ఎం.ఆర్ షీట్లను జతచేయడం లాంటి కమిషన్ చర్యలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. దీనిపై అభ్యర్థులు కోర్టు మెట్లు ఎక్కగా టీఎస్‌పీఎస్సీ ఖర్చు తగ్గించుకోవడానికి బయోమెట్రిక్ తీసుకోకుండా పరీక్ష నిర్వహించామని కోర్టుకు సమాధానమిచ్చింది. దీంతో పరీక్ష నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ బాధ్యతగా వ్యవహరించలేదని ఈ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం ప్రచార కార్యక్రమాల కోసం వందల కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేస్తున్న పాలకులకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ కోసం కేవలం ఒక కోటి రూపాయలను కేటాయించలేదా?

ఫలితంగా వేల రూపాయల అప్పులు తెచ్చి ఊరికి దూరంగా నగరాలలో హస్టళ్ళలో నివసిస్తూ కోచింగ్ సెంటర్లలో సంవత్సరాల తరబడి శిక్షణ తీసుకొని పరీక్షలు రాసిన అభ్యర్థులు పరీక్ష రద్దవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు! పైగా ప్రస్తుతం ప్రిపేరవుతున్న అభ్యర్థులు సైతం ఏ పరీక్ష ఫలితం వస్తుందో, ఏ పరీక్ష రద్దౌవుతుందో తెలీక మానసిక ఒత్తిళ్ళకు లోనవుతున్నారు వారిని కాపాడే బాధ్యత ఎవరిది? లీకేజీలతో కమిషన్‌ అప్రతిష్ట పాలైనా, పాలకులు అవినీతికి పాల్పడిన ఒకరిద్దరు ఉద్యోగులపై ఓ కంటి తుడుపు విచారణతో కాలం వెళ్లబుచ్చినారే తప్ప ఇంత అవినీతికి కారణమైన కమిషన్ సభ్యులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కమిషన్‌లో జరుగుతున్న అవినీతితో, నిర్వహణా లోపాలతో ఒకటి తర్వాత మరొక పోటీ పరీక్ష రద్దౌతుంటే ఇంకెన్ని సార్లు పరీక్షలు రాయాలనే ఆవేదనతో బాధిత అభ్యర్థులూ, వారి తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తే ప్రభుత్వం వారిపై దాడికి పాల్పడుతున్న వైనం బాధాకరం.

అసలేం చేయాల్సి ఉంది?

స్వరాష్ట్రంలో లక్షలాది మంది విద్యావంతులైన యువతీ, యువకులు తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్‌గా పేరుగాంచిన గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణతను సాధించి ఆ హోదాతో పాటు తమ కుటుంబాలకు పేరుతెచ్చే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు అత్యున్నత స్థాయి పౌర సేవలను అందించాలని కలలు కంటున్నారు. వారి కలలు నెరవేరాలంటే నిష్ణాతులు, నిజాయితీపరులైన సభ్యుల చేర్పుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిందే. ప్రస్తుతం నిరుద్యోగ అభ్యర్థులు ఆ కమిషన్‌ను విశ్వసించడం లేదు. అందుకే ముందుగా పేపర్ల లీకేజీ మూలలను శోధించి నేరస్థులు ఏ స్థాయి వారైనా శిక్షించాలి. అప్పుడే నిరుద్యోగుల్లో ఎంతో కొంత విశ్వసనీయత ఏర్పడుతుంది. ఓ రాజ్యాంగ సంస్థగా పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి గలిగిన సదరు కమిషన్ యూపీఎస్సీ ప్రేరణగా ఓ విస్పష్టమైన జాబ్ క్యాలెండర్‌ని తయారు చేసి సదరు క్యాలెండర్‌ని త్రికరణ శుద్ధిగా పాటిస్తూ నిజాయితీతో, నిష్పక్షపాతంగా, ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పూర్తి పారదర్శకతతో పరీక్షలను నిర్వహించడంతో పాటు శాస్త్రీయమైన మూల్యాంకనంతో ప్రభుత్వ మార్గదర్శకాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సమర్థులైన అభ్యర్థులనే ఎంపిక చేయాలి. ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కృత్రిమ మేధస్సుని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటే ఆశించిన ఫలితాలను అందుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ సంస్థ నిర్వహణపై రాజకీయ క్రీనీడ పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరమెంతైనా వుంది. అలా జరిగినప్పుడే సంస్థ చేసే ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరిగి కమిషన్ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. అర్హులైన అభ్యర్థులే ప్రభుత్వ ఉద్యోగులుగా ఎంపికై అత్యున్నత ప్రభుత్వ సేవలను రాష్ట్ర ప్రజలకు అందించగలుగుతారు.

డా. నీలం సంపత్

సామాజిక కార్యకర్త

98667 67471

Next Story

Most Viewed