ఆపదలో ఆడపడుచులు

by Disha edit |
ఆపదలో ఆడపడుచులు
X

తల్లిదండ్రులు సంపాదన పైన ధ్యాస పెట్టి పిల్లలను పట్టించుకోకపోవడంతో వారు అదుపు తప్పి ప్రవర్తించడం జరుగుతుంది. కొన్ని సహస్రాబ్దాలుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలం నుండి నేటి కాలం వరకు మహిళలు ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించినా సాధికారత సాధ్యం కావడం లేదు, లైంగిక హింసను నిరోధించడంలో ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. కఠిన చట్టాలు. పేదోడికి ఒక రకంగా, అంగ బలం. అధికార బలం ఉన్నోడికి మరో రకంగా పనిచేస్తున్నాయి, నిర్భయ. దిశ. పొక్సో చట్టాలు ఉన్నప్పటికీ మహిళా మణుల రక్షణ నేటికీ అగమ్యగోచరంగా ఉన్నది.

నేటి ఆధునిక యుగంలో సృష్టికి ప్రతిరూపంగా భావించే మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా, ఉద్యోగపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు మాత్రమే అంతరిక్షయానం దాకా ఎదుగుతున్నారు. ఎక్కువ శాతం మంది వంటింటిలోనే మగ్గుతున్నారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, గృహహింస రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఒకప్పుడు లక్ష్మీ దేవతగా పూజించబడిన మహిళ నేడు అంగడిలో సరుకుగా మారిపోతున్న దుస్థితి. ఆత్మనూన్యతతో వారు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు. ఆడపిల్లలు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి రాలేని భయానక పరిస్థితి నేడు దేశంలో నెలకొంది.

చర్యలు ప్రభావం చూపడం లేదు

ప్రతి గంటకు ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురి కావడం దేశంలో నెలకొన్న పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి 26 నిమిషాలకు ఒక మహిళ వేధింపులకు గురవుతోంది. ప్రతి 34 నిమిషాలకు అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిమిషాలకు లైంగిక వేధింపులకు, ప్రతి 99 నిమిషాలకు వరకట్నం వేధింపులకు ఒకరు బలి అవుతున్నారు. యేటా మహిళలపై నేరాల సంఖ్య క్రమంగా పెరిగి వారికి రక్షణ లేకుండా పోతోంది. గ్రామాలలో సైతం విచక్షణరహితంగా సభ్యసమాజం తలదించుకునేలా వయసుతో నిమిత్తం లేకుండా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వం వాటిని నివారించడానికి తీసుకుంటున్న చర్యలు మాత్రం పెద్దగా ప్రభావం చూపడం లేదన్నది వాస్తవం.

రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాలుగా అత్యాచారాల సంఖ్య ఏడు రెట్లు పెరిగింది. అత్యాచార కేసులలో 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలే ఎక్కువగా ఉన్నారని పోలీసు లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది పోక్సో చట్టం కింద 2,356 కేసులు నమోదు అయ్యాయి. ఇక పరువు కోసం ఆలోచించి పోలీసుల ముందుకు రాని కేసుల సంఖ్య పది శాతం దాకా ఉండవచ్చు. రాష్ట్ర రాజధానిలో దేశంలో ఎక్కడా లేని విధంగా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రపంచస్థాయి రక్షణ ఉందని, చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుందని చెప్పిన మాటలు నిజం కాదని తేలిపోయింది. అత్యాచార కేసులలో 98 శాతానికి పైగా నిందితులు బాధితులకు తెలిసినవారే.

తల్లిదండ్రుల బాధ్యత కీలకం

రాష్ట్రంలో 90 శాతం నేరాలు మద్యం, మత్తు పదార్థాలతోనే జరిగాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అడ్డూ అదుపు లేని పబ్ కల్చర్, వీకెండ్ ఈవెంట్స్, బర్త్ డే పార్టీలలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం, డ్రగ్స్ వలన యువత చెడు మార్గంలో నడుస్తున్నారు. సోషల్ మీడియా విచ్చలవిడి వాడకంతో అమాయక బాలికలను ట్రాప్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం కోసం ఎన్నో మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో నేరాలు ఎక్కువయ్యాయి. మైనర్‌ల విషయంలో పోలీసుల కంటే తల్లిదండ్రుల బాధ్యత కీలకం. లింగ వివక్ష పట్ల తల్లిదండ్రుల వ్యవహారశైలి మగ పిల్లాడికి అలుసుగా మారే అవకాశం ఉంటున్నది. ఫలితంగా మగాడు తనను గొప్పగా ఊహించుకొని సమాజంలో అసభ్యకరంగా ప్రవర్తించుతున్నాడు.

కొందరు తల్లిదండ్రులు సంపాదన పైన ధ్యాస పెట్టి పిల్లలను పట్టించుకోకపోవడంతో వారు అదుపు తప్పి ప్రవర్తించడం జరుగుతుంది. కొన్ని సహస్రాబ్దాలుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది. ప్రాచీన కాలం నుండి నేటి కాలం వరకు మహిళలు ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించినా సాధికారత సాధ్యం కావడం లేదు, లైంగిక హింసను నిరోధించడంలో ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయి. కఠిన చట్టాలు. పేదోడికి ఒక రకంగా, అంగ బలం. అధికార బలం ఉన్నోడికి మరో రకంగా పనిచేస్తున్నాయి, నిర్భయ. దిశ. పొక్సో చట్టాలు ఉన్నప్పటికీ మహిళా మణుల రక్షణ నేటికీ అగమ్యగోచరంగా ఉన్నది.

డా. బి.కేశవులు, ఎండీ

చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం

85010 61659



Next Story

Most Viewed