తెలంగాణలో చరిత్ర గుర్తించని గుహాలయాలు

by Disha edit |
తెలంగాణలో చరిత్ర గుర్తించని గుహాలయాలు
X

చిత్రాలున్న రాతి భాగం నాణ్యమైనది కాకపోవడం వలన, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలుల ప్రభావం వల్ల ఈ చిత్రాలు క్రమేణా వాటి రూపును, నాణ్యతను కోల్పోతున్నాయి. ఈ వర్ణచిత్రాలు భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి సమీపంలోని పాండవులగుట్ట గుహలలోని వర్ణ చిత్రాలకంటే ప్రాచీనమైనవి. వీటి రంగుల గాఢత, చిత్రించిన శైలి అజంతా చిత్రాలను పోలి ఉంది. కార్బనేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ చిత్రాల వయస్సును తెలుసుకోవచ్చు. వీటి వయస్సును గురించి తప్పక పరిశోధించవలసి వుంది. 2018 లో శివరాత్రి వేడుకలు సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. ఆలయానికి వెళ్లేందుకు అడవి మధ్య నుండి నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులకు చరిత్రాత్మక సంపదపై అవగాహన లేకపోవడంతో ఆధునికీకరణ పేరుతో గుహలకు సున్నం వేశారు. దీని వలన గుహలపై భాగంలో ఉన్న రాతి చిత్రాలు, శాసనాలు పాడవ్వడమేకాక వాటి చారిత్రక ప్రాధాన్యం దెబ్బతింది. ఇంతటి శతాబ్దాల విశిష్ట చారిత్రక ఆధారాలు వున్న నైనా గుళ్లను పరిరక్షించి బయటి ప్రపంచానికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పురావస్తు శాఖ పైన ఉన్నది.

ఒక వైపు ప్రకృతి సోయగం, పక్కనే అలలారే మానేరు నదీ తీరం. దట్టమైన అడవి మధ్యలో నుంచి ప్రవహించే మానేరు నదికి ఎదురుగా ఉన్న ఒక పెద్దకొండను తొలిచి గుహాలయాలుగా మలిచారు. ఇక్కడ మొత్తం నాలుగు గుహాలయాలున్నాయి. ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చెదరని సాక్ష్యాలుగా ఉన్న ఈ గుహాలయాలు గత కొన్ని శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి. తెలుగు నేలపై రాక్షస బల్లుల (డైనోసార్) జాడ దొరికిన ప్రాంతంగా విలక్షణ జీవ వైవిధ్యానికి పుట్టినిల్లుగా మానేరు నది తీరానికి పేరున్నది. అలాంటి చోట వందల సంవత్సరాల చరిత్ర కలిగి, ఎక్కడో విసిరివేయబడ్డట్టు ఉన్న గుహలయాలే 'నైనా గుళ్లు' తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొయ్యూరు అటవీ సమీపంలో దట్టమైన అడవిలో సోమనపల్లి కొండపై ఉన్న రాతి గుహలు తెలంగాణలోని మొదటి పురాతన కట్టడాలకు చెందనవి.

అవి మొదట జైన గుహలు. శివలింగం ప్రతిష్టాపన తర్వాత శివాలయంగా మారాయని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. వీటి నిర్మాణ శైలి ఆంధ్రప్రదేశ్ విజయవాడ పట్టణానికి సమీపంలో విష్ణుకుండినుల కాలంలో నిర్మించబడిన ఉండవల్లి గుహాలయాలను పోలి ఉంది. అక్కడున్నట్టుగానే ఇక్కడి గుహాలయాలలో కూడా గర్భగుడి, దాని ముందు భాగంలో మండపం ఉన్నాయి. శివలింగం, గణపతి, మహిషాసురమర్దిని విగ్రహాలు శిథిల రూపాలలో ఉన్నాయి. వీటిని పూర్వం జ్వాలాముఖులుగానీ, పాశుపతులు గానీ ఆరాధించి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

అతి ప్రాచీన శిల్ప సంపద

పశ్చిమాభి ముఖ ద్వారాలతో ఉన్న ఈ గుహాలయాలలో బౌద్ధ, జైన ఆనవాళ్లేవీ దొరకనప్పటికీ, ఇవి 7, 8వ శతాబ్దాల కన్నా ముందు చెక్కబడి ఉండవచ్చు. మొదటి, రెండవ గుహాలయాల గోడల మీద తెలుగు భాషలో లిఖించబడిన రెండు చిన్న లేబుల్ శాసనాలున్నాయి. మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కటె విమున అనే వ్యక్తి క్రీ.శ. 10వ శతాబ్దంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి, ఆ శివలింగానికి రామేశ్వర దేవుడిగా నామకరణం చేసినట్లు, కెంపెన అనే వ్యక్తి గుహాలయాల నిర్మాణం కోసం రాతిని తొలచినట్లు రాయబడి ఉంది. క్రీ.శ. 110 వ సంవత్సరంలో రామేశ్వరుని ఆలయ ధూప, దీప,నైవేద్యాల కోసం పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూమిని దానం చేసినట్లు రెండో శాసనంలో ఉంది.

గర్భగుడి ఎదురుగా ఉన్న మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాధారణంగా ఉన్నప్పటికీ, మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మండపం పైకప్పు (సీలింగ్‌) సన్నని సున్నపు పొరతో చదును చేయబడినట్లు తెలుస్తుంది. దానిపై అనేక వర్ణ చిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో నృత్యం చేస్తున్న నర్తకి, యుద్ధ దృశ్యాలు, గుర్రపు రథాలు, విల్లు పట్టుకున్న సైనికులు, రాజ భవనాలు ఉన్నాయి. కానీ, ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోవడం వల్ల ప్రస్తుతం నలుపు, ఎరుపు,నీలం, పసుపు పచ్చని రంగులలో ఆయా చిత్రాల అస్పష్టమైన గుర్తులు మాత్రమే మిగిలాయి.

ఆలన లేక శిథిలావస్థకు

చిత్రాలున్న రాతి భాగం నాణ్యమైనది కాకపోవడం వలన, శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలుల ప్రభావం వల్ల ఈ చిత్రాలు క్రమేణా వాటి రూపును, నాణ్యతను కోల్పోతున్నాయి. ఈ వర్ణచిత్రాలు భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి సమీపంలోని పాండవులగుట్ట గుహలలోని వర్ణ చిత్రాలకంటే ప్రాచీనమైనవి. వీటి రంగుల గాఢత, చిత్రించిన శైలి అజంతా చిత్రాలను పోలి ఉంది. కార్బనేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ చిత్రాల వయస్సును తెలుసుకోవచ్చు. వీటి వయస్సును గురించి తప్పక పరిశోధించవలసి వుంది.

2018 లో శివరాత్రి వేడుకలు సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. ఆలయానికి వెళ్లేందుకు అడవి మధ్య నుండి నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులకు చరిత్రాత్మక సంపదపై అవగాహన లేకపోవడంతో ఆధునికీకరణ పేరుతో గుహలకు సున్నం వేశారు. దీని వలన గుహలపై భాగంలో ఉన్నరాతి చిత్రాలు, శాసనాలు పాడవ్వడమేకాక వాటి చారిత్రక ప్రాధాన్యం దెబ్బతింది. ఇంతటి శతాబ్దాల విశిష్ట చారిత్రక ఆధారాలు వున్న నైనా గుళ్లను పరిరక్షించి బయటి ప్రపంచానికి తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పురావస్తు శాఖ పైన ఉన్నది.


జటావత్ హనుము

రీసెర్చ్ స్కాలర్

ఓయూ, హైదరాబాద్

85198 36308

Also Read...

శివారులో జోరందుకున్న ఆ దందా



Next Story

Most Viewed