ఉపాధ్యాయుల పై ఉక్కుపాదం

by Ravi |
ఉపాధ్యాయుల పై ఉక్కుపాదం
X

ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పని దినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది అనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై వున్న గౌరవం. ఉద్యోగులను ఎంతగా ఆదరించారో చెప్పనలవి కాదు. 1956 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు అగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా స్వామిభక్తితో పని చేసారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవచూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజలనాడిని, ప్రజా సమస్యలను పత్రికల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాల శాఖ ఉండేది. పత్రికలలో మూడు సెంటీ మీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి.

ఆంధ్రప్రదేశ్‌లో కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధుల వేతనాలు ఠంచనుగా ఒకటో తేదీన బ్యాంకు అకౌంట్లకు చేరిపోతున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు అందుతోంది. ఉద్యోగులకు మాత్రం సకాలంలో జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉండడం దురదృష్టకరం. కొన్ని శాఖల ఉద్యోగులపై ఒకటో తేదీనే అభిమానం చిలకరించారు. రాష్ట్రమంతా ఒక యూనిట్‌గా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల మధ్య కనిపించని విభజన రేఖను గీశారు. చెప్పకనే సగటు ఉపాధ్యాయులపై అవిశ్వాసం ప్రకటించిందీ ప్రభుత్వం. విచిత్రంగా ఉపాధ్యాయులకు నవంబర్ జీతాలు ఇప్పటికీ (డిసెంబర్ 9) కొన్ని జిల్లాలలో జమ కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వేలాది కుటుంబాలలో ఆర్థిక దిగ్బంధనం ఏర్పడింది. కేవలం జీతాలపైనే జీవితాలను వెళ్లదీస్తున్న కుటుంబాల పొయ్యిలో నుంచి పిల్లి బయటకు రాని స్థితి కూడా ఉంది.

ఇటీవలి కాలంలో ఒకటో తేదీ అంటేనే ఉద్యోగులు హడలిపోతున్నారు. కారణం కూటికి, గుడ్డకు సంబంధించిన అంశమే కాదు. అప్పులు, వడ్డీలు సకాలంలో చెల్లించకపోతే పరువు సమస్య. ఇల్లు గడవాలంటే జీతమే ఆధారం కావడం. ఉద్యోగులపై ఒకరికి నలుగురు ఆధారపడి ఉండడం. ప్రభుత్వోద్యోగి అంటే ఒకప్పుడు సమాజంలో మర్యాద, మన్నన ఉండేవి. ఇప్పుడా పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వోద్యోగులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఒక చులకన భావం అందరి చుట్టూ ఆవర్తనంలా ఆవరించింది. కొన్ని సందర్భాలలో అవసరాలు తీరక కుటుంబాలు నవ్వుల పాలవుతున్నాయి. గతంలో ఇలాంటి విపత్కర పరిస్థితి ఎన్నడూ లేదు. 0-10 హెడ్ లేనప్పుడు కూడా ఒక్క మార్చి నెల జీతం తప్ప. ఏప్రిల్ జీతాన్ని 24నే (పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మరుసటి రోజు) చెల్లించేవారు. అంటే, ఏప్రిల్ నెలలో 20 రోజుల తేడాతో రెండు జీతాలు అందుకునేవారు. ముందస్తు ఆడిట్ ఉన్న మునిసిపల్, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు మాత్రమే వేతనాల చెల్లింపులో కొద్దిగా జాప్యం జరిగేది.

నాటి గౌరవమేది?

ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చివరి పని దినం రోజున వారికి రావలసిన సమస్త ప్రయోజనాలను అందజేసి, చివరకు పెన్షన్ పేపర్లు సైతం చేతిలో పెట్టి సాదరంగా ఇంటికి పంపే ఆనవాయితీ ఉండేది. అదొక మర్యాద. అది అనాడున్న రాజనీతి. ఆనాడు పాలకులకు ఉద్యోగులపై వున్న గౌరవం. ఉద్యోగులను ఎంతగా ఆదరించారో చెప్పనలవి కాదు. 1956 నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉద్యోగస్వామ్యానికి పాలకులు అగ్రాసనం వేశారు. తదనుగుణంగానే ఉద్యోగులు స్వేచ్ఛగా స్వామిభక్తితో పని చేసారు. ప్రజలకు సేవలను కొనసాగించారు. వృత్తిరీత్యా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి నేరుగా చొరవచూపేవారు. సంఘాల నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రజలనాడిని, ప్రజా సమస్యలను పత్రికల ద్వారా కూడా స్వీకరించేవారు. అందుకోసం సమాచార, పౌర సంబంధాల శాఖ ఉండేది. పత్రికలలో మూడు సెంటీ మీటర్ల సింగిల్ కాలమ్ వార్త వచ్చినా విచారణ జరిపించే సంస్కృతి ఉండేది. బాధ్యులపై తక్షణ చర్యలుండేవి. బాధితులకు సత్వర న్యాయం జరిపించేవారు. మధ్యవర్తులు, సలహాదారుల పెత్తనం అసలుండేది కాదు. సంఘాల నేతలే అనుసంధానకర్తలుగా స్తబ్దతను తొలగించేవారు.

పీఆర్సీ చర్చలకు సైతం కాలయాపన ఉండేది కాదు. పాతికో పరకో ఎంతో కొంత తేల్చి ఉత్తర్వులను ఒకేసారి జారీచేసేవారు. ఇప్పుడు కాలం తలకిందులైంది. ప్రతి విషయాన్ని సమస్యగా చూపుతున్నారు. సున్నిత అంశాలనూ వివాదాస్పదం చేస్తున్నారు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలపై వాయిదాల పర్వము కొనసాగుతున్న అవాంఛనీయ పరిస్థితి ఏర్పడింది. చివరకు బాండ్లు ఇచ్చే సంస్కృతి ఆరంభమైంది. నిధులు లేక ఉద్యోగ విరమణ వయసును సైతం పెంచుకొంటూపోవడం ఇటీవలి కాలపు పాలకులకు అనవాయితీ అయిపోయింది. సమస్యలను ప్రస్తావించడానికి కూడా అవకాశం లేదు. ఆందోళనలు చేస్తే ఇంటిదగ్గరే అరెస్టు చేస్తారు. పని చేస్తున్న చోటనే అదుపులోకి తీసుకొంటున్నారు. కనీసం స్వాతంత్య్రం సాధించుకున్న మార్గంలో ఒక ధర్నా చేసే వీలు లేని పాశవిక విధానాలకు పాలకులు అంకురార్పణ చేశారు.

గతమెంతో ఘనం అయినా

ఒకసారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. లక్ష కోట్ల బడ్జెట్ ఉన్న అవిభక్త రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి చవిచూసిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ విడిపోయిన తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,56,256 కోట్లకు చేరింది. (బహిరంగ బుుణాలు, ఋణ వసూలు, రెవెన్యూ వసూలు) ఉద్యోగుల జీతాలు బడ్జెట్ కేటాయింపుల ఫరిధిలోనివే. ఏ రంగానికి సంబంధించిన ఆదాయాన్ని ఆ రంగం కోసం కాకుండా, వచ్చిన ప్రతి రూపాయినీ తాము నిర్దేశించుకున్న పథకాలకు చేరవేస్తుండడంతో ప్రతీ నెలా అప్పులకు అర్రులు చాచక తప్పడం లేదు. విద్యారంగానికి రూ.30 వేల కోట్లు కేటాయించారు. ఆ మొత్తం మూలధనంగా ఉండడం లేదు. అంటే, బడ్జెట్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ప్రాధాన్యతా రంగాలు అట్టడుగున చేరాయి. ఉత్పాదక రంగం కుదేలయింది. వ్యవస్థలు కుప్పకూలాయి.అభివృద్ధి, సంక్షేమం అనే ప్రత్యామ్నాయాలు తెరపైకి వచ్చాయి. సంక్షేమం కాస్తా నగదు బదిలీగా రూపాంతరం చెందింది.

ప్రభుత్వం ఒక్క ఉద్యోగుల విషయంలో మాత్రమే బీద అరుపులు అరుస్తోంది. బడ్జెట్‌లో సగానికి పైగా 1,32,126 కోట్ల రూపాయలు వివిధ రకాల పథకాల కింద లబ్ధిదారులకు చేరుతోంది. ఇది నగదు పంపిణీకి దోహదపడుతుంది కానీ, ఉత్పాదనకు ప్రోత్సాహకం కావడం లేదు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవ రాబడిని గుర్తించకుండా కేంద్రం నుంచి, ఇతర రూపాల నుంచి వచ్చే నిధులనే ఆదాయంగా భావిస్తున్నది. తెస్తున్న అప్పులు, సెక్యూరిటీల వేలం ద్వారా సమకూర్చుకున్న మొత్తాలను సైతం అప్పుల చెల్లింపులు, వడ్డీలకు మళ్లిస్తుండడం చూస్తున్నాం. ద్రవ్యలోటు పై నియంత్రణ లేదు. గణాంకాలలో తలసరి ఆదాయం కనిపించినా, వాస్తవ పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు.

'Money is a terrible monster but an excellent servant. Rulers should keep in mind while expending every rupee.' ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. రేపటి రోజున మరిన్ని కష్టాలు ఎదురుకానున్నాయి. ఒక సమీకృత ఆర్థిక విధానం అవలంబిస్తే తప్ప రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రమాద ఘంటికల నుంచి మనలను రక్షించలేవు. ద్రవ్యోల్బణం కొత్తపుంతలు తొక్కే ప్రమాదం ఉంది. పౌరులు కూడా ఇబ్బడిముబ్బడిగా వస్తున్న పథకాలను గురించి ఆలోచించకుండా రాష్ట్ర భవిష్యత్తు ప్రామాణికంగా ముందుకు సాగాలి. అప్పుల విషయంలో కేంద్రం కూడా రాష్ట్రాల స్వీయ నిర్ణయం మీద పున సమీక్ష చేయాల్సిన అవసరం వుంది. దేశంలోని పౌరులను ఋణగ్రస్థులుగా మార్చే విధానాలను కట్టడి చేసుకోవాలి. లేకుంటే భవిష్యత్తు అగమ్య గోచరమౌతుంది.

ఇక్కడ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఈ సందర్భంగా ఉటంకించక తప్పడంలేదు. 'కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్వకర్మణి' ఉద్యోగులుగా అంకితభావంతో పనిచేసుకుంటూ పోవడమే ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఫలితాలు భవిష్యత్తులో అవిష్కృతమౌతాయి. 'A dream doesn't become reality through magic; it takes sweat, determination and hard work' కేవలం జీతాల సమస్యగానే చూడలేం. ఇదొక విపత్కర పరిస్థితి. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజలలో విస్తృత చర్చ జరగాలి. మేధోమథనం జరగాలి. దుబారా ఆర్థిక విధానాలతో ఎన్నటికీ సత్ఫలితాలను పొందలేమని గుర్తించాలి.


మోహన్‌దాస్

ఏపీటీఎఫ్, రాష్ట్ర కౌన్సిలర్

94908 09909

Next Story

Most Viewed