'దిశ' దినపత్రికపై విష ప్రచారం..

by Disha Web Desk |
దిశ దినపత్రికపై విష ప్రచారం..
X

ప్రారంభమైన రెండున్నరేళ్లలోనే అశేష ప్రజాదరణ పొందిన దిశ దినపత్రికపై కొన్ని అవాంఛనీయ శక్తులు తప్పుడు ప్రచారానికి పూనుకుంటున్నాయి. దిశను బీజేపీ టేకోవర్ చేసిందని, బండి సంజయ్ కనుసన్నల్లో ఆ పేపర్ నడుస్తోందని సోషల్ మీడియాలో కొందరు గిట్టనివాళ్లు ట్రోల్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిని రూ. కోటి, ఈటల రాజేందర్‌ను రూ. 50లక్షలు అడిగామని, ఇవ్వకపోవడంతో వాళ్లిద్దరిపై వ్యతిరేక వార్తలు రాస్తున్నామని కారుకూతలు కూస్తున్నారు. పేరు లేని, అనధికారిక యూట్యూబ్ చానెళ్లలోనూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి దుష్ర్పచారాన్ని దిశ యాజమాన్యం, సంపాదకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నది. దిశ ఎవరికీ అమ్ముడుపోలేదని, పోబోదని, ప్రజల పత్రికగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.

పార్టీకో పేపర్, కులానికో న్యూస్ చానెల్ అన్న పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడి, పాఠకుల్లో విశ్వసనీయత కోల్పోయిన వాతావరణంలోనే 2020 మార్చ్ 7న దిశ డిజిటల్ మీడియా ప్రజల ముందుకు వచ్చింది. ఏ పార్టీకీ, ఏ వర్గానికీ కొమ్ము కాయకుండా సత్యం వైపే గమనం.. గమ్యం.. లక్ష్యంగా పురోగమిస్తోంది. ఈ 33 నెలల్లో మేం ప్రచురించిన వార్తలు, కథనాలు పరిశీలిస్తే ఈ విషయం ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవాలపై ఆధారపడి మాత్రమే ఆయా పార్టీలకు, వర్గాలకు సంబంధించిన కథనాలను, విశ్లేషణలను మేం ప్రచురిస్తున్నాం. ప్రభుత్వ విధానాల, కార్యకలాపాల, పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తున్నాం. వాటి అమలులో దొర్లుతున్న లోపాలను సమాజం దృష్టికి తీసుకువస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజల తరఫున ప్రతిపక్షంగా పని చేయాలని పెద్దలు చెప్పిన మాటను వందకు వంద శాతం పాటించడానికి ప్రయత్నిస్తున్నాం.

ఈ క్రమంలోనే మేం ప్రచురిస్తున్న వార్తలు, కథనాలు కొన్నిసార్లు ప్రభుత్వ పెద్దలకు, మరికొన్ని వర్గాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఇది అన్ని పార్టీల వారికీ జరుగుతుండవచ్చు. అలాంటివాళ్లు గుర్తించాల్సిన విషయమేమంటే ఆ రోజుకి జరుగుతున్న పరిణామాలను మాత్రమే మేం పాఠకుల ముందుంచుతున్నాం. అంతేకాని, అందులో మా స్వప్రయోజనం ఏమీ లేదు. పాజిటివ్ వార్తలు వచ్చినప్పుడు పట్టించుకోకుండా, బలహీనతలు, లోపాలపై కథనాలు వచ్చినప్పుడే స్పందించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు.

ఇక, కొందరు నేతలను మేం డబ్బులు అడిగామంటూ ప్రచారం చేస్తున్నారు. అన్ని పత్రికలూ, చానెళ్లలాగే మా పత్రికకు కూడా స్పష్టమైన అడ్వర్టయిజ్మెంట్స్ పాలసీ ఉంది. యాడ్స్ నుంచి వచ్చే ఆదాయం ఏ మీడియా నడవడానికైనా కీలకమే. యాడ్స్ రూపంలో దిశకు సపోర్ట్ చేయాలని అందరిలాగే మా ప్రకటనల విభాగం, విలేకరుల యంత్రాంగం ప్రభుత్వ విభాగాలను, పార్టీలను, నేతలను, సంఘాలను, వ్యాపారసంస్థలను సంప్రదించడం సాధారణంగా జరుగుతుంది. ఇవ్వడం, ఇవ్వకపోవడం అనేది వారి ఇష్టం. ఇవ్వలేదని వ్యతిరేక వార్తలు రాయడం మా పత్రిక పాలసీ కానే కాదు. అలా చేస్తే, ప్రజల్లో విశ్వసనీయత దెబ్బ తింటుందని, దిశకు ఇంత ప్రజాదరణ రావడానికి ఆ విశ్వసనీయతే కారణమని మాకు బాగా తెలుసు.

దిశ మీడియాను ఇకముందు కూడా నిష్పక్షపాతంగా, నిర్భయంగా, ప్రజాస్వామ్యస్ఫూర్తితో నడుపుతామని ప్రజలకు మరోమారు హామీ ఇస్తున్నాం. ఎప్పటిలాగే మమ్మల్ని ఆదరించాలని, ఆదుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం..

సత్యం వైపే నిత్యం మా గమనం.. గమ్యం..

T. మోహన్‌రావు, మేనేజింగ్ డైరెక్టర్

D. మార్కండేయ, ఎడిటర్



Next Story

Most Viewed