రైతుల సమస్యలు తీర్చలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత?

by Disha edit |
రైతుల సమస్యలు తీర్చలేని ప్రభుత్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత?
X

అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీసం మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈనెల 13వ తేదీన ఢిల్లీలో తలపెట్టిన 'ఢిల్లీ చలో' మార్చ్‌తో పాటు భారత్ బంద్‌కి కూడా పిలుపునిచ్చాయి.

ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలతో మోహరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా చెప్పుకుంటున్నా ఇంత వరకు చిత్తశుద్ధితో అటు వైపుగా అడుగులు పడలేదు. ఇకనైనా ప్రభుత్వం రైతుల పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలి.

2021లో కనిపించిన దృశ్యాలే…

ఢిల్లీలో రైతులు సకల సంసిద్ధతతో, వేలాది ట్రాక్టర్లతో కదం తొక్కుతూ ముందుకు సాగుతున్నారు. వారిని నిలువరించేందుకు గతంలో భంగపడ్డ బీజేపీ ప్రభుత్వం... సిమెంట్ దిమ్మెలతో,ఇనుప కంచెలతో అనేక చోట్ల బారికేడ్లు నిర్మించింది. వాహనాలు రాకుండా కందకాలు తవ్వింది. ఇనుప చువ్వలు రోడ్డుపై నాటింది. ఇంటర్నెట్‌ను బంద్ చేసింది. 144 సెక్షన్‌ను నెల రోజులపాటు విధించింది. లాఠీ చార్జీలతో, వాటర్ క్యాన్లతో, భాష్ప వాయు గోళాలతో, రబ్బర్ బుల్లెట్లతో, డ్రోన్‌ల టెక్నాలజీతో, అధునాతన సాంకేతిక ఆయుధాలతో ఢిల్లీలోకి వారి ప్రవేశాన్ని అడ్డుకోవడానికి అలుపు లేకుండా శ్రమిస్తున్నాయి. పంజాబ్, హర్యానా నలుమూలల నుంచి రైతులు ఢిల్లీ నగర ప్రవేశానికి తండోపతంతండాలుగా తరలి వస్తున్నారు. ఇప్పటికే అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. 2020-21లో ఢిల్లీలో కనపడిన దృశ్యాలే మళ్ళీ పునరావతమవుతున్నాయి.

రైతుల డిమాండ్లు…

పంటకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు యధాతదంగా అమలు చేయడం, రైతు రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయడం, రైతులకు, వ్యవసాయ కార్మికులకు పింఛను మంజూరు చేయటం. లఖింపూర్ బాధితులకు న్యాయం చేయడం, రైతులపై కేసులు ఉపసంహరణ చేయడం వంటివి రైతుల కనీస న్యాయమైన డిమాండ్లు. కానీ కేంద్రం వీటిని నేరవేర్చకపోగా, రైతులకు సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఏజెంట్లు అన్నారు. చివరకు ఈ ఉద్యమ పోరాటంలో 700 మంది రైతులు చనిపోయారు. దీంతో మోదీ ప్రభుత్వం రైతుల ఉద్యమానికి తల వంచి ఆ 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు భారత ప్రధాని పార్లమెంట్ నిండు సభలో ప్రకటించారు. రైతులకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పారు. రైతు డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఇప్పటికీ నెరవేర్చలేదు. ఇప్పుడు రైతు సంఘాల నాయకులను చర్చకు పిలిచి కేంద్రంలో సీనియర్ మంత్రులు మాట్లాడుతూ ఉండగానే మరోవైపు రైతులపై ఈ దమనకాండ కొనసాగుతూనే ఉంది. రైతు ఓట్లతో గెలిచి వారినే శత్రువుగా చూస్తారా?

నేరస్థులకు రుణమాఫీ

బ్యాంకులను దోచి విదేశాలకు పారిపోయిన గుజరాతీ నేరస్తుల ముఠాకు రుణాలను మాఫీ చేస్తే లేని కష్టం, రైతుల రుణాలకు మాఫీ చేస్తేనే వచ్చిందా? ప్రతి ఏటా రుణ భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు వ్యధలను తీర్చలేరా? కౌలు రైతుల సమస్యలు పరిష్కరించరా? భూసంస్కరణలు, వ్యవసాయ భూమి అమ్మకాన్ని క్రమబద్ధీకరించడం, పొలాలకు నీటి వసతి కల్పించడం, వ్యవసాయ భూమిని కార్పొరేట్లకు అమ్మకుండా నిషేధించడం, పంటల బీమా, గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పించడం. రైతులకు నాలుగు శాతం సరళ వడ్డీతో రైతులకు అందించడం వంటి అనేక సిఫార్సులు కూడా స్వామినాథన్ కమిషన్ చేసింది.

ఉంటే ఎంత… లేకపోతే ఎంత?

వీటిలో ఏ ఒక్కటీ ఈ పదేళ్ళలో మోదీ ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఇక ప్రభుత్వం ఉండి ఎందుకు? ఇంత తిరుగులేని మెజారిటీ ఉండి ఏం సాధించినట్లు? రేపు 400 సీట్లు సాధించి ఇంతకన్నా ఏమి ఉద్ధరిస్తారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతు సమస్యలను శాశ్వితంగా పరిష్కరించాలి. ఈ దేశ ప్రజలు విజ్ఞత గల వారు సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు. దేశంలో ప్రధాన మీడియా కూడా రైతు సమస్యలను గాలికి వదిలేసి మౌనం పాటిస్తున్నాయి. పైగా ప్రభుత్వానికి భజన చేస్తుంది. మిమ్మల్ని భవిష్యత్ చరిత్ర క్షమించదు.

డా. కోలాహలం రామ్ కిశోర్.

98493 28496



Next Story

Most Viewed