అలుపెరుగని వందరోజుల బాటసారి..

by Disha edit |
అలుపెరుగని వందరోజుల బాటసారి..
X

ప్రజలతో నిత్యం మమేకమై వారి అభ్యున్నతి కోసం నిరంతరం తపించే వ్యక్తికి ప్రజల అభిమానం నుంచే పాజిటివ్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యలు తెలుసుకొని పరిష్కారం దిశగా పనిచేయడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 400 రోజులు, 4000 కిలో మీటర్లు యువగళం పేరుతో పాదయాత్ర నవతరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి. చిత్తూరు జిల్లా కుప్పంలో జనవరి 27న ప్రారంభించిన యాత్ర నిన్నటితో వంద రోజులు పూర్తిచేసుకున్నది. ఈ యాత్ర మొత్తం పూర్తయితే ఇప్పటివరకు రాజకీయ నాయకులు చేసిన పాదయాత్రల్లో అందరికంటే ఎక్కువ దూరం పాదయాత్ర చేసిన నాయకుడిగా నారా లోకేశ్ రికార్డు సృష్టిస్తారు. కాలంలోనూ, దూరంలోనూ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చరిత్ర ఆయనదే.

మింగుడు పడని యువగళం..

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పధంలో దూసుకెళుతున్న రాష్ట్రాన్ని దిక్కుతోచని స్థితికి నెట్టడం. నవ్యాంధ్రను అసమర్థ, అసంబద్ద, నియంతృత్వ, కక్ష సాధింపు చర్యలు ద్వారా నవ్యాంధ్రను నాశనం చేసి శిఖరం నుండి శిధిలావస్థకు చేర్చడం, అన్యాయాలను, కుట్రలను, సాగిస్తున్న దమనకాండని రాష్ట్రవ్యాప్తంగా ఎలుగెత్తి చాటుతున్నారు లోకేష్. వందరోజులుగా చిత్తూర్, అనంతపురం జిల్లాలలో పాదయాత్ర పూర్తిచేసుకొని ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది యాత్ర. ఈ వంద రోజులకు 1270 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రతి వంద కిలోమీటర్లకు ఒక శిలాఫలకం వేస్తున్నారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తనను కలిసేందుకు వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారిని అక్కున చేర్చుకుంటూ ఆత్మీయత పంచుతూ, వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ అధికారంలోకి వస్తే పరిష్కారానికి హామీ ఇస్తున్నారు. అలాగే జగన్ రెడ్డి దుష్పరిపాలనను కళ్ళకు కట్టినట్లు వివరిస్తున్నారు. అనేక విషయాలపై సమగ్రమైన అవగాహనతో సమర్ధవంతంగా మాట్లాడుతున్నారు. పల్లెపల్లెలో పార్టీ బలోపేతానికి తనకర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని తన నాయకత్వ లక్షణాలు నిరూపించుకొంటున్నారు. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుండి జగన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు పెట్టినా లోకేష్ బెదరకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు.

లోకేష్‌ను వైసీపీ నాయకులు అనేకమైన వెక్కిరింతలతో, వెటకారాలతో హేళన చేస్తూ, పప్పు వంటి పదాలతో గేలి చేశారు. కానీ నేడు నిప్పుగా నిరూపించుకొన్నారు..జనంతో అత్యంత సన్నిహితంగా మెలిగే పాదయాత్ర లోకేష్ చేపట్టడంతో ఇప్పటికే ప్రతిష్ఠ దిగజారిన అధికారపక్షానికి తమకున్న జనామోదం మరింత క్షీణిస్తుందన్న కలవరం మొదలు అయింది. అందుకే లోకేష్ పాదయాత్ర అధికార పక్షానికి మింగుడు పడటం లేదు. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశముందని గుండెల్లో గుబులు మొదలయింది వైసీపీ నాయకులకు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేష్ పాదయాత్ర ప్రభావం చూపింది. లోకేష్ పాదయాత్ర, ప్రసంగాలు ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు, పార్టీ కార్యకర్తల్లో భరోసా నింపేందుకు యువగళం పాదయాత్ర ఎంతో ఉపకరిస్తుంది.

నాయకులు సద్వినియోగం చేసుకోవాలి..

నాలుగేళ్లుగా ప్రజలు పడుతున్న బాధను వర్ణిస్తూ లోకేష్ తెలుగుదేశం పాలనను, వైసీపీ పరిపాలనను పోల్చి చెబుతూ ప్రజలను ఆలోచించమని ప్రజలను కోరుతున్నారు. వైసీపీ పాలనలో బాధలు వర్ణనాతీతం. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అదుపులేదు. పన్నులు భారంతో పేదలు సామాన్యులు, మధ్యతరగతి వారు బతకలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పాదయాత్రలో రైతు సమస్యలు తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తూనే, చేతి వృత్తుల వారిని, బీసీలను, రైతులను, మహిళలను, విద్యార్థులు, నిరుద్యోగులు వీరందరి సమస్యల పరిష్కారానికి, స్వావలంబనకు వివిధ వర్గాల అభ్యున్నతి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, తెలుగుదేశం పార్టీని తిరిగి గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. పాదయాత్ర ద్వారా ఆయన జనంలోకి వెళ్లడంతో వైసీపీ నాయకులు వణికి పోతున్నారంటే, తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎంత సానుకూల పరిస్థితి ఉన్నదో అర్ధం అవుతున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం నాయకులందరిపై వుంది. పాదయాత్రలో ప్రభుత్వానికి లోకేష్ విసురుతున్న సవాళ్లకు, సెల్ఫీ ఛాలెంజ్‌లకు ప్రభుత్వం వద్ద సమాధానం రావడం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ విసిరిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించలేదు.

యువగళం పాదయాత్ర సాగనీకుండా అధికార పార్టీ వైసీపీ అడుగడుగునా అడ్డంకులు కల్పించినా, ఒక సెక్షన్ అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అడుగడుగునా అడ్డుకోవాలని చూసినా, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, బీసీ, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలంతా సంఘటితమై యువగళం పాదయాత్రకు రక్షణగా నిలిచి ముందుకు నడిపిస్తున్నారు. కేసులు పెట్టినా, సభలు జరగకుండా అడ్డుకున్నా, చివరికి ఎత్తు స్టూల్ కూడా లాక్కుని, ప్రజలను కలవనీయకుండా, వారిని పలకరించనీయకుండా, ప్రసంగించనీయకుండా అడ్డుకున్నా మొక్కవోని ధైర్యంతో చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో లోకేశ్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని చేతపట్టుకుని, పాదయాత్ర తన హక్కంటూ, సమావేశమయ్యే హక్కు బాబాసాహెబ్ తనకిచ్చారని చెబుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ను అనర్గళంగా వల్లెవేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. సాగనిస్తే పాదయాత్ర లేకుంటే దండయాత్ర అంటూ ప్రభుత్వాన్నిహెచ్చరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రజల్లో నమ్మకం కల్పిస్తూ..

పాదయాత్రలో ప్రతిరోజూ ఎక్కడికక్కడ రైతులతో భేటీలు, వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకోవడం, పరిష్కారాల అన్వేషణ, మేనిఫెస్టోలో వాటినెలా పొందుపర్చాలో సూచనలు చేస్తూ రైతాంగంలో భరోసా పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు లోకేష్. అన్ని వృత్తుల వారితో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ చేతివృత్తులన్నింటినీ ప్రస్తుత వైసీపీ నిర్వీర్యం చేసిందో తెలియజేస్తూ, గతంలో టీడీపీ తెచ్చిన స్కీములు ఎలా రద్దు చేశారో వివరిస్తూ, మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే వారికి చేసే మేళ్లని వివరిస్తున్నారు. బీసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామంటూ భవిష్యత్‌పై విశ్వాసం పెంచుతున్నారు. అణగారిన వర్గాలపై వైసీపీ దమనకాండపై ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్యాక్రాంతమైన భూములన్నీ తిరిగి ఇప్పిస్తామని, నిందితులపై కఠిన చర్యలు చేపడతామని, అక్రమ కేసులు ఎత్తేస్తామని హామీలిస్తూ వారిలో నమ్మకం కలిగిస్తున్నారు. అసైన్డ్ భూములు, ఆర్మీ భూములు, దేవాదాయ భూములన్నింటినీ విడిపిస్తామని, విలువైన ప్రభుత్వభూములను కాపాడతామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ముందుకెళ్తున్నారు. వైసీపీ శాండ్-ల్యాండ్ మాఫియా, వైన్-మైన్ మాఫియా భరతం పడతామని లోకేశ్ హెచ్చరికలు చేస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడే వైసీపీ గుండాల అంతు చూస్తాననే వార్నింగులతో ఆడబిడ్డలకు అభయం ఇస్తున్నారు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబు అయితే, విధ్వంసానికి బ్రాండ్ జగన్ రెడ్డిని, లోకేశ్ చేస్తున్న ప్రసంగాలు అన్నివర్గాల ప్రజలను ఆలోచింపచేసేవిగా వున్నాయి. నారా లోకేష్ ఏ గ్రామం ఎక్కడ ప్రసంగిస్తున్నా జనంలో నూతనోత్సాహం ఉరకలు వేస్తోంది. లోకేష్ యువగళం ప్రజల్లో తమ భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచుతోంది. 400 రోజులు, 4 వేల కిమీ యాత్ర లక్ష్యానికి చేరువయ్యేందుకు రాకెట్ స్పీడ్‌తో యువగళం సవాళ్ల మధ్య సవారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కి మళ్లీ మంచిరోజులు రాబోతున్నాయనే విశ్వాసం యువగళం పాదయాత్ర కల్పిస్తుంది. తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మండుటెండలో కాళ్ళు బొబ్బలెక్కినా పట్టించుకోకుండా పాదయాత్ర చేసి లోకేష్ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు ప్రజాపీడన విముక్తికి అంకుశం కాగలదు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Next Story

Most Viewed