కామన్ మ్యాన్ డైరీ: ఊపిరి తీసిన ఎడారి బతుకు

by Disha edit |
కామన్ మ్యాన్ డైరీ: ఊపిరి తీసిన ఎడారి బతుకు
X

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గంగాధర్ వృత్తి రీత్యా టైలర్. దర్జీ పని సాగకపోవడంతో నిర్మల్‌కు వలసొచ్చాడు. ఓ షోరూంలో ఆల్ట్రేషన్ వర్క్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ ప్యాంట్ ఆల్ట్రేషన్ చేస్తే 30 రూపాయలు ఇస్తారు. రోజూ పది ప్యాంట్లు వస్తే 300 రూపాయలు వస్తాయి. అన్ సీజన్‌లో వంద రూపాయలు రావడం కూడా కష్టంగా మారింది. భార్య పద్మ బీడీలు చుట్టేది. ఆమె రోజూ వెయ్యి బీడీలు చేసేది. మూడు వేల రూపాయల వరకు వచ్చేవి. కిరాయిలు కడుతూ, పిల్లలను చదివిస్తూ బతుకుబండి లాక్కురావడం కష్టంగా మారింది. సర్కారు బడికి పంపినా పుస్తకాలు, నోటు బుక్కులు, పెన్నులు, బట్టలు వీటికి తోడు ఇల్లు గడిచేందుకు ఖర్చులు తడిసి మోపెవడవుతుండడంతో చిన్నగా అప్పులు చేస్తూ వస్తున్నారు.

చేబదుళ్ల స్థాయి దాటిపోయింది. పెద్ద ఖర్చులేవైనా వస్తే ఫైనాన్స్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఊళ్లో ఉన్న పొలం అమ్మేసి దుబాయ్ వెళ్లానుకున్నాడు గంగాధర్. విషయాన్ని భార్యతో చెప్పాడు. ఆమె మొదట వద్దన్నా అప్పుల భయంతో సరేనంది. ఊళ్లో ఉన్న మెట్ట భూమిని ఎకరా లక్ష రూపాయల చొప్పున ఆమ్మేశారు. రెండెకరాలు అమ్మగా రూ. రెండు లక్షలు వచ్చాయి. అప్పులు పోను 1.80 మిగలడంతో రూ.50 వేలు ఖర్చుల కోసం భార్య పేరిట బ్యాంకులో వేశాడు. నిజామాబాద్‌లో ఉన్న ఏజెంటను సంప్రదించారు. లక్ష రూపాయలు తీసుకొని దుబాయ్ వీసా ఇప్పించాడు. రూ. 30 వేలు ఖర్చులకు తీసుకొని ఎడారి దేశం బాట పట్టాడు గంగాధర్.

*

సూపర్ మార్కెట్‌లో వర్క్ అని చెప్పాడు ఏజెంటు. బంధువులు, భార్య, పిల్లలు శంషాబాద్ వరకు వచ్చి గంగాధర్ ను దుబాయ్ సాగనంపారు. దుబాయ్‌లో దిగిన గంగాధర్‌ను రిసీవ్ చేసుకొనేందుకు ఓ అరబ్బు వ్యక్తి వచ్చాడు. కార్లో కూర్చోమన్నాడు. కారు ఊరు దాటింది. ఎటు తీసుకుపోతున్నాడో అర్థం కాలేదు గంగాధర్‌కు. చివరకు ఓ నిర్జన ప్రాంతానికి తీసుకొచ్చాడు. దూరంగా ఓ చిన్న షెడ్డు కనిపిస్తోంది. వందల సంఖ్యలో గొర్రెలున్నాయి. అక్కడ కారు ఆగిపోయింది. దిగు అన్నట్టుగా సైగ చేశాడు. అరబ్ షేక్. గంగాధర్‌కు భయం వేస్తోంది. ఏం చేస్తాడోనని, దేశం కానీ దేశం. అర్థం కాని భాష. ఏమని అడగాలి. విషయం ఎలా చెప్పాలో తెలియడం లేదు. టెన్షన్ పడుతూనే కారు దిగాడు. కొంచెం దూరంలో ఉన్న షెడ్డును చూపాడు.

లగేజీ తీసుకొని అందులోకి వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. ఇండియన్‌లాగే ఉన్నాడు. బ్యాగు అక్కడ పెట్టాడు. ఫోన్ చేద్దామంటే చార్జింగ్ అయిపోయింది. తనను తీసుకొచ్చిన అరబ్ షేక్ గొర్రెల షెడ్డులోకి వెళ్లాడు. వాటిని లెక్కేసుకున్నాడు. తర్వాత పడుకున్న వ్యక్తిని నిద్ర లేపాడు. అరబ్బీలో ఏదేదో చెప్పి వెళ్లిపోయాడు.. "ఆప్ కహాసే ఆయా?' అడిగాడు గంగాధర్. తనది రాజస్థాన్ అని, పేరు హనుమాన్ అన్నాడు. 'హమ్మయ్య.. విషయం చెప్పొచ్చు' అనుకున్నాడు.

*

'సూపర్ మార్కెట్‌లో పని అని ఏజెంటు చెప్పాడు. ఇక్కడికి తీసుకొచ్చారు. నాకు గొర్రెల గురించి ఏ మాత్రం అవగాహన లేదన్నాడు' గంగాధర్. 'ఈ షేక్‌కు సూపర్ మార్కెట్ కూడా ఉంది. అది సిటీలో ఉంటుంది. షీప్ ఫామ్ కూడా మెయింటేన్ చేస్తున్నాడు. నన్నూ అలాగే తీసుకొచ్చారు. అడిగితే ఇక్కడే పనిచేయాలని చెబుతున్నారు. అక్కడ ఎవరైనా మానేస్తే అవకాశం ఇస్తామంటున్నారు. నేను వచ్చి రెండేళ్లైంది. ఇంత వరకు ఎవరూ మానేయలేదు. నాకు సూపర్ మార్కెట్ లో పనిచేసే అవకాశం రాలేదు. నీకూ వస్తుందన్న గ్యారెంటీ లేదు' అన్నాడు హనుమాన్.

గంగాధర్ కు నోటమాటరాలేదు. ఉన్న భూమి అమ్మేసుకున్నాడు. తిరిగి తిరిగి పరిగి కంపలో పడిపోయాననే బాధతో కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. ఇప్పుడేమీ చేయలేని అచేతన స్థితి ఆయనది. కఫిల్ (అరబ్ షేక్@యజమాని) దయతలిస్తేనే ఇండియాకు. లేదంటే దుబాయ్ జైలులో మగ్గాల్సిందే! దేవుడా, ఇదేం అగ్ని పరీక్ష అనుకుంటూ ఫోన్ చార్జింగ్ పెట్టుకున్నాడు. ప్రయాణంలో అలసిపోవడంతో ఆ రోజు డ్యూటీ చేయలేదు. మరుసటి రోజు మేకలు కాసే ఉద్యోగం. హనుమాన్‌తో కలిసి ఓ రోజు డ్యూటీ చేశాడు. తినేందుకు అన్నం లేదు. రొట్టెలే! రాజస్థాన్ నుంచి వచ్చిన హనుమాన్ రొట్టెలే తింటాడు కాబట్టి సిటీ నుంచి గోధుమ పిండి, ఆలుగడ్డ, మిర్చి తదితర కూరగాయలే పంపారు.

*

మళ్లీ మార్కెట్ నుంచి సామగ్రి వచ్చేటపుడు చెబితే మరుసటి వారం బియ్యం, పప్పులు రావచ్చు. చపాతీతోనే కాలం వెళ్లదీస్తున్నాడు. భార్యకు కాల్ చేశాడు. 'సూపర్ మార్కెట్‌లో పనిచేస్తున్నానని, పెద్దగా పని ఉండదని, మార్కెట్ అంతా ఏసీ హాల్ అని, ఎవరి బిల్లులు వారే కట్టేసుకొని వెళ్లిపోతారని, నిగ్రాన్ మాత్రమే చూడాల్సి ఉంటుందని చెప్పడంతో' పద్మ సంతోషపడింది. ప్రతి శుక్రవారం ఫోన్ చేస్తున్నాడు. నెల రోజులు గడిచింది. జీతం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐదో తేదీ కూడా దాటింది. జీతం రాలేదు.

'హన్మాన్ భాయ్ తన్‌ఖా కబ్ మిల్తే' అంటూ ఆరా తీశాడు గంగాధర్. షేక్ మన ఖాతాలో వేస్తాడని, ఎప్పుడు వేస్తాడనేది తెలియదన్నాడు. 15వ తేదీన జీతం పడింది. ఇండియన్ కరెన్సీలో రూ. 20 వేలు మాత్రమే. గుండె ఆగినంత పనైంది గంగాధర్‌కు. రూ. 50 వేల జీతం అని ఏజెంటు చెప్పాడు. ఇందేంటి 20 వేలు అనుకొని హనుమాన్‌ను ఆరా తీశాడు. తనకు మొదట అంతే ఇచ్చారని, ఇప్పుడు రూ. 30 వేలు ఇస్తున్నారన్నాడు హన్మాన్. ఆరు నెలలు గడిచింది. వాతావరణం సరిపడటం లేదు. వేళకు భోజనం ఉండటం లేదు. పూర్తిగా చిక్కిపోయాడు గంగాధర్.

*

ఎడారి ప్రాంతం కావడంతో వేడి ఎక్కువగా ఉంటుంది. రాజస్థాన్ నుంచి వచ్చిన హన్మాన్ ఆ వాతావరణానికి అలవాటు పడినా గంగాధర్ మాత్రం తిప్పలు పడుతున్నాడు. కొత్తగా దగ్గు స్టార్ట్ అయ్యింది. ఏమీ పాలుపోవడం లేదు. విషయాన్ని గమనించిన హన్మాన్ కఫిల్‌కు సమాచారం అందించాడు. ఆయన వచ్చి గంగాధర్ ను తీసుకెళ్లి సిటీలోని ఓ ఆస్పత్రిలో చూపించాడు. వైద్యులు టీబీ సోకినట్టుగా గుర్తించారు. కంగారు పడ్డ గంగాధర్ బోరున ఏడ్చాడు. తనను ఇండియాకు పంపించాలని ప్రాధేయపడ్డాడు. కఫిల్ అంగీకరించాడు. వారం రోజులలో పంపిస్తానన్నాడు.

అకౌంట్ సెటిల్ చేశాడు. 80 వేల రూపాయలు బ్యాంకులో వేశాడు. టికెట్లు బుక్ చేసి ఇండియాకు పంపించాడు. తాను వస్తున్నట్టు ముందునే భార్యకు సమాచారం అందించాడు. ఎందుకు అంటే విషయం చెప్పలేదు. ఎట్టకేలకు ఇండియా చేరుకున్నాడు. ఎవరూ గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయాడు గంగాధర్. ఇరుగు, పొరుగు, బంధువులు విషయం తెలుసుకొని ఇంటికి వచ్చారు. నిజామాబాద్​ ప్రభుత్వ దవాఖానలో చూపించారు. మందులు వాడినా నయం కాలేదు. నడవలేని స్థితికి చేరిన గంగాధర్ కన్నుమూశాడు.

*

పద్మ, ఇద్దరు పిల్లలు దిక్కులు పిక్కటిల్లేలా రోదించారు. చేతిలో చిల్లిగవ్వలేదు. దుబాయ్ నుంచి తెచ్చిన డబ్బులు వైద్యానికే ఖర్చయ్యాయి. అంత్యక్రియలకూ అప్పులు చేయాల్సి వచ్చింది. ఊరెళ్లిపోదామంటే అక్కడ భూమి లేదు. ఉన్న ఇల్లు కూలిపోయింది. ఎక్కడికి వెళ్లాలి. ఎలా బతకాలనే అంధకారంలోనే మగ్గుతోంది ఆ కుటుంబం. గంగాధర్ కొడుకు రోహిత్ పదో తరగతి చదువుతున్నాడు. కూతురు లాస్య ఏడో తరగతి. వాళ్ల చదువులు కంటిన్యూ చేయించాలంటే బీడీలు చుట్టడంతో వచ్చే ఆదాయం చాలదు.

ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్లిపోయింది పద్మ. మకాం నిజామాబాద్‌కు మార్చారు. ఉదయం 10 గంటల వరకు ఇండ్లలో పనులు చేస్తున్నది. మధ్యాహ్నం ఓ సూపర్ మార్కెట్‌లో వర్క్ చేస్తున్నది. నెలకు 18 వేల వరకు వస్తున్నాయి. పిల్లలను చదివిస్తూ బతుకుబండి లాగిస్తున్నది. రోహిత్ బుద్ధిగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తేనే పద్మకు ఉపశమనం.

మరిన్ని కామన్ మ్యాన్ స్టోరీస్ కోసం క్లిక్ చేయండి


ఎంఎస్ఎన్ చారి

79950 47580


Next Story

Most Viewed