వ్యవస్థల ఘర్షణ – కోర్టుల జోక్యం

by Disha edit |
వ్యవస్థల ఘర్షణ – కోర్టుల జోక్యం
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనదేనని గొప్పగా చెప్పుకుంటాం. అదే సమయంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మంట గలిసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పుడంతా నియంతృత్వ పరిపాలనేనంటూ తూర్పారపడుతున్నది. రాజ్యాంగ విలువలు అటకెక్కాయని వాపోతున్నాయి. ఏ వాదన ఎలా ఉన్నా ఈ వ్యవస్థకు కీలకమైన విభాగాల మధ్య ఘర్షణ ఒక వాస్తవం. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, రాజ్‌భవన్.. ఇలాంటివన్నీ ఒకదానిపై మరొకటి విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. వాటివాటి విధులు సక్రమంగా నిర్వర్తించడంలేదని పరస్పరం నిందించుకుంటున్నాయి. చివరకు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకెళ్తున్నాయి.

ఒకవైపు కోర్టులపై భారం ఎక్కువవుతున్నదంటూ న్యాయమూర్తులు మొత్తుకుంటున్నారు. పెండింగ్ కేసుల్లో సగం ప్రభుత్వానికి చెందినవేనని వేర్వేరు సందర్భాల్లో దేశ ప్రధాన న్యాయమూర్తులు వాపోయారు. రాజ్యాంగ వ్యవస్థలు వాటి ‘లక్ష్మణ రేఖ’ పరిధిలో పనిచేస్తే ఏ సమస్యలూ రావని, వాటికి బదులుగా ‘ఇగో’లకు పోవడంతోనే చిక్కులు వస్తున్నాయన్నది వారి భావన. జ్యుడీషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ విభాగాలకు రాజ్యాంగబద్ధమైన విధులే ఉన్నప్పటికీ వాటి మధ్య సమన్వయం కొరవడడంతో కోర్టుల జోక్యం అనివార్యమవుతున్నది. ఫలితంగా రోజువారీ బాధ్యతల నిర్వహణలో చిక్కులు ఎదుర్కొంటున్నాయి. ఆ ప్రభావం పాలనపైనా, ప్రజలకు అందే సేవలపైనా పడుతున్నది.

రాజ్‌భవన్ వర్సెస్ రాష్ట్ర ప్రభుత్వాలు

రాజ్‌భవన్ వ్యవస్థ మీద రాష్ట్ర ప్రభుత్వాలకు నమ్మకం లేదు. దీర్ఘకాలంగా నెలకొన్న వ్యతిరేకత ఇప్పటికీ కొనసాగుతున్నది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి తరచూ ఫిర్యాదులు వెళ్తున్నాయి. సగానికిపైగా రాష్ట్రాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. రాజ్‌భవన్‌లు, రాజ్‌నివాస్‌లు రాజకీయ కేంద్రాలుగా మారాయన్నది రాష్ట్రాల ఆరోపణ. గవర్నర్ వ్యవస్థకు, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలకు వాటికంటూ ప్రత్యేకమైన విధులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఉటంకిస్తున్నట్లుగా ‘లక్ష్మణరేఖ’లు ఉన్నాయి. కానీ ఆ పరిధి దాటిపోయాయన్నది రాజ్‌భవన్‌లపై రాష్ట్రాల విమర్శ. నిబంధనల ప్రకారం ప్రభుత్వాలు నడుచుకోవడం లేదన్నది గవర్నర్ల ఆరోపణ.

వ్యక్తులుగా గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు రెండు వ్యవస్థల మధ్య పోరుగా తయారైంది. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలను చూస్తే ఈ పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. తమిళనాడులో ఏకంగా గవర్నర్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసి వెళ్ళిపోవడం దీనికి పరాకాష్ట. తెలంగాణలో గవర్నర్‌కు అసెంబ్లీలో ప్రసంగించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు పిలవలేదనే అంశం చివరకు కోర్టుదాకా వెళ్ళింది. న్యాయస్థానం ఆదేశంతో గవర్నర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించక తప్పలేదు.

కోర్టు చెప్తే తప్ప వినరా?

రిపబ్లిక్ దినోత్సవ నిర్వహణ విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ వ్యవస్థల మధ్య వివాదం చోటుచేసుకున్నది. అధికారికంగా జరిపించాల్సిన ప్రోగ్రామ్‌ ప్రగతి భవన్‌ (ముఖ్యమంత్రి అధికారిక నివాసం)కు మాత్రమే పరిమితమైందన్న విమర్శలు వచ్చాయి. చివరికి ఇది కూడా హైకోర్టుకు వెళ్ళింది. కచ్చితంగా అధికారిక లాంఛనాలతో జరపాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు వ్యవస్థలూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసే అంగాలే. కానీ పరస్పరం కొట్టుకుంటున్నాయి. ఒకదాని నీడను మరొకటి భరించలేకపోతున్నాయి. ‘మై గవర్నమెంట్’ అని సంబోధించే గవర్నర్ తన సొంత ప్రభుత్వాన్నే నమ్మడం లేదు. ‘బై ఆర్డర్ ఆఫ్ ది గవర్నర్’ అని జీవోలలో రాసుకునే రాష్ట్ర ప్రభుత్వమూ గవర్నర్ వ్యవస్థపై గౌరవం చూపడంలేదు.

రెండు వ్యవస్థలు సమన్వయంతో, సహకారంతో, స్నేహ సంబంధాలతో వ్యవహరిస్తే సమస్యలను పరిష్కరించుకోవడం వాటికి కష్టమేమీ కాదు. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు దాదాపు ఐదేళ్ళ పాటు కళ్లారా చూసిందే. కానీ ఇప్పుడా స్ఫూర్తి కొరవడింది. ఇరువైపుల నుంచీ సమస్యలను మొగ్గ దశలోనే పరిష్కరించుకునే ప్రయత్నాలు లేవు. కోర్టు చెప్తే తప్ప వినని, పాటించని వాతావరణం నెలకొన్నది. ఒక దశలో గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాతనే రాజ్‌భవన్ మూడు బిల్లులకు ఆమోదం తెలపాల్సి వచ్చింది. ఈ పనిని మొదట్లోనే చేసి ఉంటే అపవాదును ఎదుర్కొనే అవసరమే ఉత్పన్నమయ్యేది కాదు.

దర్యాప్తు నిలుపుదలకూ కోర్టులే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకదానిని మరొకటి విశ్వసించడంలేదు. పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. రాజకీయంగా వైరుధ్యం ఉన్న పార్టీలు అధికారంలో ఉన్నచోట ఇవి తలెత్తుతున్నాయి. పార్టీల మధ్య ఉన్న రాజకీయ ఘర్షణ ప్రభుత్వాలపైనా పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలపై కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు మంచి అభిప్రాయం లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై రాష్ట్రాల్లో పవర్‌లో ఉన్న పార్టీలకు సదాభిప్రాయం లేదు. తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఏడాది కాలంగా కొనసాగుతున్న విమర్శల పర్వాన్ని చూస్తుంటే ఇది తేటతెల్లమవుతుంది. ‘సిట్’ దర్యాప్తులపై బీజేపీకి నమ్మకం లేదు. సీబీఐ, ఈడీ లాంటివి బీజేపీకి జేబు సంస్థలనేది బీఆర్ఎస్ భావన.

చివరకు ఈ దర్యాప్తు సంస్థల ఇన్వెస్టిగేషన్ విషయంలోనూ కోర్టులకు ఎక్కక తప్పలేదు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంలో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాలు చేసింది. సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్‌లో ఛాలెంజ్ చేసింది. అక్కడి తీర్పును సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. చివరకు అది సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. దర్యాప్తు సంస్థలపై రూలింగ్ పార్టీ ప్రభావం ఉంటుందనేది ఈ పార్టీల ఆరోపణ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలోనూ ఈడీ దర్యాప్తుపై బీఆర్ఎస్ నేతల రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా ఆ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తాజాగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ జోక్యం చేసుకోక తప్పలేదు.

ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం

ఒకవైపు కేంద్రాన్ని అసమర్థ ప్రభుత్వమంటూనే దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని, సహకారాన్ని కోరుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయమైందని ఆరోపిస్తూనే దానిపై చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నది. రెండూ బాధ్యతా రాహిత్యమైన ప్రకటనలకు పాల్పడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం పొలిటికల్ గేమ్ ఆడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసమర్ధమైనదైనప్పుడు ఆశించాల్సిన అవసరమేముంది రాష్ట్ర ప్రభుత్వం అవినీతిమయం అయినప్పుడు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండడం ఆ నేరంలో భాగస్వామ్యం కావడం కాదా? నిజంగా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటి కామెంట్లు రావు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పరస్పరం పార్టీలుగా అవి విమర్శించుకుంటున్నాయి.

అధికారిక కార్యక్రమాలు సైతం రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయి. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోడీ రాష్ట్ర ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలకు వరకు పరిమితమైతే అభ్యంతరం ఉండేది కాదు. కానీ రాజకీయాలకు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి సైతం అసెంబ్లీ సమావేశాలను కూడా కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్ళగక్కడానికి వాడుకున్నారు. ప్రభుత్వం, అధికార పార్టీల మధ్య విభజన చెరిగిపోయింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ సైతం రాజకీయ విమర్శలు, ప్రకటనలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది.

ప్రభుత్వాలే ప్రతివాదులు

లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థల్లో జోక్యం చేసుకోడానికి న్యాయస్థానాలు సూత్రరీత్యా దూరంగా ఉంటాయి. కానీ అనివార్య పరిస్థితుల్లో వేలు పెట్టాల్సి వస్తున్నది. ‘లక్ష్మణరేఖ’ దాటటం మంచిది కాదని ఆ రెండు వ్యవస్థలనూ సుప్రీంకోర్టు తరచూ సున్నితంగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థల మధ్య ఘర్షణ ఏర్పడడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదని చెప్తూ ఉంటుంది. చట్టబద్ధ పాలనలో జోక్యం చేసుకోడానికి న్యాయ వ్యవస్థ సంకోచిస్తున్నా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో అనివార్యంగా మారింది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వైఫల్యాలే ఇందుకు కారణం. ధరణి, దళితబంధు, ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, బదిలీలు, పదోన్నతులు.. ఇలాంటివాటికి సంబంధించిన ఉత్తర్వులు వివాదాల్లో ఇరుక్కున్నాయి.

న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో దాదాపు సగం ప్రభుత్వాలకు, వాటి విధానాలకు సంబంధించినవే. ఇందులో కోర్టు ధిక్కరణ కేసులూ ఉన్నాయి. ప్రభుత్వమే అతి పెద్ద లిటిగేటర్ అని గతంలో ఒక సందర్భంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించిన విషయం ఇక్కడ గమనార్హం. ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తే ఇవి కోర్టు కేసులుగా మారే అవకాశమే ఉండేది కాదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే కోర్టుని ఆశ్రయిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చే తీర్పులను ఆ ప్రభుత్వాలే అమలు చేయకుండా ధిక్కరణకు పాల్పడుతున్నాయి. ఏ ప్రజాస్వామ్యాన్ని రాజకీయ నాయకులు, అధికారంలో మంత్రుల హోదాల్లో ఉన్నవారు గొప్పగా చెప్పుకుంటున్నారో ఆ విలువలకు, స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు.

ఎన్. విశ్వనాథ్

99714 82403

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672


Next Story