ఓట్ల కోసం.. పోటా పోటీ పథకాలు!

by Disha edit |
ఓట్ల కోసం.. పోటా పోటీ పథకాలు!
X

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందుగానే రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల్ని ప్రకటించడం, గెలుపు కోసం అడ్డదారులు తొక్కడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో అన్ని రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అధికార పార్టీకి చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ పెన్షన్ డబ్బుల్ని 4 వేలకు పెంచుతామనగానే, దివ్యాంగుల పెన్షన్ 4 వేల పదహారుకు పెంచుతున్నట్టు కేసీఆర్ ప్రకటించడం, ఆ వెంటనే అమలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. తాజాగా దళితబంధు సాయాన్ని కాంగ్రెస్ 12లక్షలు అనగానే 15 లక్షలకు మేము రెడీ అన్నట్టుగా బీఆర్ఎస్ ఆలోచనలు గుప్పుమన్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించడమంటే కులాల మధ్య చిచ్చు పెట్టడమే అవుతుంది. కేవలం ఓట్లకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి తప్ప, వాటిని ఆచరణలో ఏ విధంగా అమలు చేస్తారో చెప్పడం లేదు.

ఇప్పటికే గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా, రైతు బంధు పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీసిన విషయం తెలియనిది కాదు. పైగా ప్రతీ సంక్షేమ పథకంలో అర్హుల కన్నా అనర్హులే అధికంగా ఉన్న విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ తిరిగి అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పులు చేస్తూ మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల కోసం ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాల్ని, రిజర్వేషన్లను ప్రకటించడం జుగుప్స కలిగిస్తోంది. ప్రజలు కూడా సంక్షేమ పథకాలకు బానిస కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారమే లక్ష్యంగా కాకుండా సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల నుండి బయటకి తీసే మార్గాల్ని వెతకాలి. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కబంధ హస్తాల నుండి నేడు కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-పసునూరి శ్రీనివాస్,

88018 00222


Next Story

Most Viewed