తల్లిపాలు ఎంతో ఆరోగ్యం!

by Ravi |
తల్లిపాలు ఎంతో ఆరోగ్యం!
X

ల్లికి మించిన దైవం లేదు. అమ్మ పాలకు మించిన అమృతం లేదు. నవమాసాలు గర్భంలో ఉండి అమ్మ నుండి అందుకొన్న తొలి వరం కమ్మనైన క్షీరం. మన దేశంలో ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం థీమ్ ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు తల్లిపాలు కొనసాగేందుకు సహకరిద్దాం. పిల్లలు ఆరోగ్యవంతులుగా పెరిగి అభివృద్ధి చెందడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ , యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల వారు సరి అయిన పోషణ విధానంగా తల్లిపాలను సిఫార్సు చేస్తున్నారు.

బిడ్డ ఆరోగ్యం తల్లి పాల నుంచే...

బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లి పాలు ప్రారంభించాలి. మొదట ఆరు నెలల వయస్సు వరకు తల్లి పాలు మాత్రమే ఇప్పించడం, ఆరు నెలల మీదట అనువైన కుటుంబ ఆహారం అదనంగా ప్రారంభించడం, తల్లిపాలు రెండు సంవత్సరాల వయస్సు వరకు లేదా వీలైనంత కాలం ఇప్పించడం చేయాలి. ఆరోగ్యంగా ఉంటే అడివిలోనైనా ఆనందంగా బతికేయవచ్చు. తల్లి పాలు తాగడం నుండే బిడ్డ ఆరోగ్యం ఆరంభం అవుతుంది. ఇవి శిశువుకు ప్రకృతి ఇచ్చే సహజ సిద్ధమైన టీకా. ఇవి సహజమైన పునరుత్పాదకమే కాకుండా, వ్యర్థాలు, కాలుష్యం లేని వనరు. బిడ్డకు ఈ పాలు ఎంతో శ్రేష్ఠమే కాక పౌష్టికాహారం కూడా. శిశువుకు తల్లి పాలకు మించిన ఆహారం లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఇవి ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, పొటాషియం, ఖనిజాలు, సూక్ష్మపోషకాలు, అవసరమైన మేరకు పుష్కలంగా ఉండడం వలన పిల్లలు తగినంత బరువు పెరుగుతారు. వీటిలో శక్తివంతమైన ప్రతిరోధకాలు ఉన్న కారణంగా అంటువ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, ఆస్తమా, చెవి సంబంధిత వ్యాధులు సెప్సిస్, న్యుమోనియా, డయేరియాల నుండి శిశువును కాపాడుతాయి. వీటిలో ఫ్యాటీ ఆసిడ్స్ బిడ్డ మెదడు పెరుగుదలకు దోహదం చేయడం వలన తెలివితేటలూ పెరుగుతాయి.

ప్రసవం అయిన వెంటనే మొదటి అరగంట నుండి ఒక గంట వ్యవధిలో తల్లి పాలలో కోలాస్ట్రం ఉంటుంది. ఈ పాలు ఎంత తొందరగా తాగించడం మొదలుపెడితే అంత మంచిది. బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంతో పాటు ఇంతకు ముందు చెప్పుకున్న లాభాలన్నీ పొందవచ్చు. శిశువు జీవితంలోని మొదటి నెలలకు అవసరమైన శక్తిని, పోషకాలను తల్లి పాలు అందిస్తాయి. బిడ్డకు ఆరు నెలలు పూర్తయ్యేవరకూ తల్లి పాలు మాత్రమే పట్టాలి. ఈ ఆరు నెలలు చాలా కీలకం. తల్లి పాలల్లో ఎనభై శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. తల్లి తన బిడ్డకు దాహం వేస్తున్నట్లు అనిపించినప్పుడల్లా పాలివ్వవచ్చు. వేడి వాతావరణంలో కూడా ఆరు నెలల వయస్సు లోపు పిల్లలకు నీరు అవసరం లేదు. ఆరు నెలల తరువాత తల్లి పాలతో పాటు పరిపూర్ణమైన ఆహారాన్ని అందించడం మొదలు పెట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. అదనపు ఆహారంతో పాటు కనీసం రెండేళ్లు తల్లి పాలు పట్టాలి. తల్లికి , పాలు తాగే బిడ్డకు ఎలాంటి సమస్య రానంత వరకూ, తల్లి మరల గర్భంతో ఉన్నా కూడా బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. ఆ తరువాత తల్లీ బిడ్డలకు ఇష్ఠమైనంతవరకూ తల్లి పాలు పెట్టవచ్చు.

అన్ని అపోహలకు దూరంగా..

తల్లిపాల గురించి సమాజంలో కొన్ని అపోహలు ఉన్నాయి. వీటివలన కొంత మంది శిశువులు తల్లి పాలకు దూరం అవుతున్నారు. అటువంటి తల్లులకు ఈ సందర్భంగా అవగాహన చెయ్యవలసిన అవసరం ఉంది. కొంత మంది పిల్లలు పాలు త్రాగిన వెంటనే వాంతి చేస్తారు. తాగేటప్పుడు నోటితో కొంత గాలిని పీల్చడం వలన ఇలా జరుగుతుంది. ఇది ప్రమాదం కాదు. దీనిని వైద్య భాషలో పోసెట్టింగ్ అంటారు. తల్లిపాలు పెట్టిన వెంటనే నేల లేదా మంచంపై పడుకోబెట్టకుండా, భుజంపై వేసుకొని కొంతసేపు ఉంచాలి. ఎక్కువగా కదల్చరాదు. ఎక్కువ వేడి ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీరు అవసరం లేదు. బిడ్డకు అవసరమైన నీరు తల్లిపాలలో ఉంటాయి. శిశువుకు విరేచనాలు అయితే కొంతమంది తల్లులు పాలు పెట్టరు. డాక్టరు సలహా మేరకు పట్టించడం ఆపాలే తప్ప, సొంతగా అపనవసరం లేదు. తల్లి గర్భవతిగా ఉన్నా కూడా బిడ్డకు పాలివ్వవచ్చు. కొన్ని పరిస్థితులలో ఒకటి రెండు రోజులు బిడ్డకి అందించక పోయినా తరువాత వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. పాలిచ్చే తల్లి అవసరం మేరకు పండ్లు తీసుకోవాలే తప్ప ఎక్కువ పండ్లు తల్లి తీసుకోనవసరం లేదు.మరో పెద్ద అపోహ ఏంటంటే సిజేరియన్ అయిన వెంటనే తల్లి లేవకూడదని పాలు తాగించరు. అలాకాక తల్లి పాలు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే డాక్టర్ సూచన మేరకు నర్సుల సహాయంతో బిడ్డకు పాలు ఇవ్వాలి. శిశువు పుట్టిన తరువాత తల్లి నుండి వచ్చే పాలు సరిపోవని బయట పాలు అందిస్తారు, అలా చేయకుండా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి.

అంతకు మించిన అందం ఉందా?

మన దేశంలో కొంత మంది తల్లులు బిడ్డకు పాలు పెట్టడం వలన తమ అందం పోతుందని పాలివ్వరు. అమ్మతనానికి మించిన అందం ఈ ప్రపంచంలో ఉందా? ప్రకృతిలో ఏ జంతువు ఇలా ఆలోచించదు. బిడ్డకు బయట నుండి డబ్బాపాలు అందిస్తారు. ఇది చాలా తప్పు. ప్రకృతి ప్రసాదించిన గాలినే పీల్చుతాం. ప్రకృతి అందించిన నీటినే త్రాగుతాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకోగలమా అలానే తల్లి పాలకు కూడా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. విదేశాల నుండి తీసుకొచ్చిన పాల పొడులు కూడా అమ్మ పాలకు మించిపోవు. తల్లులందరూ బాగా ఆలోచించాలి. పిల్లలకు పెద్దయిన తరువాత ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవ్వాలనుకుంటారు. కానీ వాటి కంటే పిల్లలకు ఇచ్చే మొదటి ఆస్తి తల్లిపాలనే విషయం గుర్తెరగాలి. పాలివ్వడం వలన అందం మేం తరగదు. ఇంకా పెరుగుతుంది.

బిడ్డకు పాలిస్తే తల్లికి లాభమే

బిడ్డకు పాలివ్వడం వలన తల్లికి కూడా లాభాలున్నాయి. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువ పెరుగుతుంది. పాలివ్వడం వలన బరువు తగ్గుతారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ , రక్తపోటు, టైప్ 2 మధుమేహం వంటి రోగాలు భవిషత్తులో రాకుండా అడ్డుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత తమ శిశువులకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఉండే దేశం క్రొయేషియా. ఇక్కడ 98 శాతం మంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ఇంకా రువాండా, చిలీ, బురుండి వంటి దేశాలలో ఉండే తమ పిల్లలకు పాలిచ్చే తల్లులు 80 శాతం కంటే ఎక్కువ మంది ఉన్నారు. కానీ కొన్ని పరిస్థితులలో అనగా ఉద్యోగరీత్యా, బయట పనులు చేయడం వలన తమ శిశువుకు పాలు అందివ్వలేరు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి ప్రసవానంతర సెలవులు ఇస్తున్నారు. అలానే ప్రైవేటు రంగంలో కూడా కనీసం ఆరు మాసాలు వేతనంతో కూడిన సెలవివ్వాలి. పాలిచ్చే అమ్మ పొలం పనులకు కూలీ పనులకు, ఆ ఆరు మాసాలు వెళ్లకుండా ఇంటిలోని యజమానులు, కుటుంబ సభ్యులు సహకరించాలి. ఈ సంవత్సర లక్ష్యాలు ఆరోగ్య కేంద్రాలు, పని ప్రదేశాలలోని మహిళా ఉద్యోగినులకు మద్దతుకై దేశవ్యాప్తంగా విస్తృత అవగాహన చర్యలు, ప్రసూతి అర్హతలు మరియు ఇతర సహాయ చర్యల సమాచారాన్ని తెలియపరచడం, ఈ దిశగా ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగినులను ప్రోత్సహించే కార్యక్రమాలను బలోపేతం చేయడం.

(ఆగస్టు 01 నుండి 07 వరకు తల్లిపాల వారోత్సవాలు)

డి. జె మోహన రావు

94404 85824

Next Story

Most Viewed