కములుతున్న కమలం

by Disha edit |
కములుతున్న కమలం
X

సంతృప్తులంతా.. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ వైపే చూస్తున్నారు. రెండు పార్టీలోలనూ చేరికలు జోరుగా సాగుతున్నాయ్. అయితే అటు, లేక‌పోతే ఇటు అన్నట్టుగానే జంపింగ్‌లు కనిపిస్తున్నాయ్. ఎవ‌రూ కూడా ఈ రెండు పార్టీల‌ను దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. దీంతో బీజేపీ ప్రస్తుతం చిక్కుల్లో ఉంది. తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కమలదళం కలవరపడుతోంది. టికెట్ దక్కలేదనే ఆగ్రహంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నారు. ఓ వైపు ఒకరిద్దరు పార్టీలో చేరుతుంటే.. మరోవైపు అంతకు రెట్టింపు నాయకులు పార్టీని వీడుతున్నారు. బండి సంజయ్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీజేపీలో చేరారు. ప్రస్తుతం వారంతా తమకు పార్టీలో సరైన ప్రాధాన్యం లభించడం లేదనే నెపంతో ఒకరి తర్వాత ఒకరు పార్టీని వదులుతున్నారు. వారి బాటలోనే మరికొందరు నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పలువురు సీనియర్‌ నేతలు అసెంబ్లీ బరిలో నిలిచేందుకు వెనక్కు తగ్గారు. తాము లోక్‌సభ బరిలో నిలుస్తామని వీరంతా చెబుతున్నప్పటికీ ఓటమి భయమే అసలు కారణంగా తెలుస్తోంది. పార్టీకి చెందిన సీనియర్‌ నాయకురాలు డీకే అరుణ తాను అసెంబ్లీ బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు.

బీజేపీ ఎలా డౌన్ అయింది?

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అనే స్థాయిలో బీజేపీ ఇదివరకు ఉండేది. బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది బీజేపీ రాష్ట్ర కమిటీ. కానీ ఈ దరఖాస్తుల్లో కీలకమైన నేతలు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడం ఓ రాజకీయ ప్రహసనం. కానీ దీనివల్ల నష్టపోయింది బీజేపీ. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అలాగే ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది. దీంతో విజయశాంతి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. పైగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరం ఉండటంతో ఈ ప్రచారం ఇంకా బలపడింది. ఇటీవల బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆమె బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే ఈ చేరికలు కాంగ్రెస్‌కు కలిసివచ్చినా రాకపోయినా బీజేపీకి తీవ్ర నిరాశను కలిగించే విషయం. రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో బీజేపీపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి!

అలాగే మరో సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కాంగ్రెస్‌లో వెళుతున్నారన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, అగ్రనేత రాహుల్ గాంధీతోనూ విశ్వేశ్వర్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనా ముందస్తు నిర్ణయాలు తీసుకోవడంలో కమలదళం వైఫల్యం చెందింది. వర్గపోరుకు తోడుగా, సీనియర్లకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఇక్కడ వున్న నాయకులు విఫలం అయ్యారనే చెప్పాలి. జనసేనతో పొత్తు వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. బీజేపీ తరఫున ఢిల్లీ నుంచి వచ్చిన కీలక నేతల చర్విత చర్వణ ప్రసంగాలు జనాన్ని అకట్టుకోలేదనే చెప్పాలి. పసుపు బోర్డు, తదితర నిర్ణయాలు రాష్ట్రమంతా పెద్దగా ఫలితాన్ని చూపలేవు. ఆ ప్రాంత ఫలితాలపై మాత్రమే ప్రభావాన్ని చూపుతాయి. బీసీ ముఖ్యమంత్రి పాచిక కొంతవరకు మేలు చేయవచ్చు. కర్ణాటక ఫలితాల ముందు వరకు వికసించి, పరిమళించిన కమలం నేడు స్వీయ కష్టాల సెగతో కమిలిపోతోంది. ఇప్పటికైనా అధిష్టానం చొరవ తీసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టి గౌరవప్రదమైన స్థానాలు కైవసం చేసుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఆశించవచ్చు. జాతీయ స్దాయి విధానాలు జాతీయ ప్రగతి ఎజెండాతో ప్రాంతీయంగా ముందుకు సాగలేరు. ప్రాంతీయ సమస్యలపై దృష్టి సారించి రాష్ట్రాభివృద్ధికై వారు ఏ విధంగా తోడ్పాటు అందిస్తూ సంక్షేమాన్ని, అభివృద్ధిని చేస్తారో వివరించి ప్రజాదరణ చూరగొన్న నాడే రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించగలదు.

శ్రీధర్ వాడవల్లి

99898 55445



Next Story

Most Viewed