బీసీలంటే బలమైన కులాలు

by Disha edit |
బీసీలంటే బలమైన కులాలు
X

గత 30 సంవత్సరాలుగా విద్యా, ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పిస్తున్నా, వారి ఉద్యోగితా వాటా మాత్రం 15 శాతానికి దాటలేదు. అలాగే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన జ్యుడీషియరీ, లెజిస్లేచర్‌, ఎగ్జిక్యూటివ్, మీడియాలోకి బీసీలు రాకుండా అడ్డుకున్న వైనం‌, శతాబ్దకాలంగా (1931) కుల గణన చేయకపోవడం, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సరిగా అమలు కాకపోవడం, క్రిమిలేయర్ విధాన ఆర్థిక పరిమితి ఇలా అనేక అంశాలలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కోవడానికి వారిని ఒక్క తాటిపైకి తెచ్చి బలంగా కూడగడుతున్నాయి.

స్వాతంత్ర్యం వచ్చిన కాలం నుండి దేశంలో ఏర్పాటైన బీసీ కమిషన్‌లూ, అమలు కాని వాటి నివేదికలూ బీసీలకు మొదటి గుణపాఠాలు. కాలేల్కర్ లాంటి కమిషన్‌ ఏర్పాటు చేసి అసలు మూలమైన కులాలను గుర్తించడంలోనే అది విఫలమైందని కొట్టిపడేయడం వెనుక కుట్రలను బీసీలు అర్థం చేసుకుంటున్నారు, బీసీలకు ప్రాణవాయువు లాంటి మండల్ కమిషన్ నివేదిక 1980లో సమర్పిస్తే 1993 వరకు అమలుకు నోచుకోలేదు, మండల్ కమిషన్ సిఫార్సు చేసిన 41 అంశాల్లో ఇప్పటికి అమలవుతున్నవి మూడు అంశాలు మాత్రమే.

బీసీల బలం ఇదీ!

బీసీలు అంటే బడుగు వర్గాలు, బలహీన కులాలు అని ముద్రలేసిన అగ్రకుల పార్టీలు ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎత్తుకున్న నినాదం బీసీ నినాదమే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దశాబ్ద కాలంగా బీసీలకు ఏం చేసిందో చెప్పుకోలేక కొత్తగా బీసీ సీఎం నినాదం ఎత్తుకుంది. బీసీ ప్రధానిని అని చెప్పుకునే మోదీనే బీసీలను ఏనాడూ పట్టించుకోలేదు‌. అలాంటిది ఆ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అయి తమకు ఏదో చేస్తారని నమ్మగలరా…? మండల్ ఉద్యమాన్ని తొక్కేసిన కమండల్ ఉద్యమాన్ని మరవగలరా...! అంత చిత్తశుద్ధి వారికి బీసీలపై ఉంటే చట్టసభల్లో బీసీల వాటా 33 శాతం స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని‌ రాబోవు లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలి. మహిళలకు చట్ట సభల్లో కలిపించే రిజర్వేషన్లల్లో బీసీల వాటా తేల్చాలి. దేశవ్యాప్తంగా కులగణన వెంటనే చేపట్టాలి. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చెయ్యాలి. కులపర రిజర్వేషన్లకు క్రీమిలేయర్ పరిమితిని తొలగించాలి.

గొర్రెల్ని లెక్కించారు.. బీసీలను వదిలేశారు

దశాబ్దకాలంగా బీసీలను విస్మరించి అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ మహనీయుల విగ్రహాలని తలకెత్తుకుంది, 2014లో సమగ్ర సర్వే పేరిట గొర్రెలు, కోళ్ళ లెక్కలు కూడా తేల్చిన బీఆర్‌ఎస్ బీసీల లెక్కను మాత్రం తేల్చలేకపోయింది, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి ఆ తర్వాత 18 శాతంకి పరిమితం చేసి బీసీలను రాజకీయంగా మొదటి దశలోనే తుంచేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను ధ్వంసం చేసి బీసీలను విద్యలో కూడ మొదట్లోనే తుంచేసింది‌, బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులలో సగం నిధులు కూడా ఖర్చు చేయకుండా విస్మరించి ఆధిక్యాన్ని కోల్పోయిన తరువాత బీసీలు గుర్తొచ్చినట్టు బీసీల బలాన్ని గుర్తించి వారితో అంటకాగాలని చూస్తుంది.

ఇకనైనా బీసీలు తమ బలాన్ని తాము గుర్తించుకోవాలి‌, రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికలతో చర్చ వేగవంతమైనప్పటికీ, జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగ విస్తృతమైన ప్రచారం కల్పించాలి, మొదటి నుండి అన్ని అగ్రకుల రాజకీయ పార్టీలూ బీసీలపై జరిపిన కుట్రలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, బీసీల వాటా ఎవరు తింటున్నారో సామాన్య జనాలకు వివరిస్తూ చైతన్యం దిశగా అడుగులు వేయాలి. బీసీలమంటే బలహీన కులాలం కాదు, బలమైన కులాలం అని నిరూపించాలి. రాబోవు లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తెలంగాణలో తొమ్మిది లోక్‌సభ టికెట్లు బీసీలకే కేటాయించాలి.

మధు యాదవ్ నూకల

ఓయూ స్టూడెంట్

63033 43359

Next Story

Most Viewed