తెలంగాణ ప్రతిబింబం బతుకమ్మ

by Disha edit |
తెలంగాణ ప్రతిబింబం బతుకమ్మ
X

తెలంగాణలో ఎంతో విశిష్టతతో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన వేడుకలు అక్టోబర్ మూడు సోమవారం సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా కొలిచే పండుగ ఇది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. 2014 జూన్‌లో తెలంగాణ ఏర్పడిన తర్వాత 'బతుకమ్మ'ను రాష్ట్ర పండుగగా గుర్తించారు. సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో వచ్చే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది.

రంగురంగుల పూలతో తాంబూలంలో బతుకమ్మను పేర్చితే దానికి గుడి గోపురానికి ఉన్నంత ప్రశస్తి ఉంటుంది. అందమైన పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, సద్దుల బతుకమ్మను వరుసగా జరుపుకొంటారు. సద్దుల బతుకమ్మనే పెద్ద బతుకమ్మ అని కూడా అంటారు. బతుకమ్మ పండుగ ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, తెలంగాణలో కొన్ని శతాబ్దాలుగా బతుకమ్మ పండుగ ఉన్నదనేది మాత్రం వాస్తవం.

ఉద్యమంలోనూ పండుగ

ఈ బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళల ప్రాధాన్యాన్ని చాటి చెప్పే ఉత్సవం. దీనిని ఆడపడుచులు ఎలాంటి కుల భేదాలు లేకుండా ఆడిపాడుతూ ఐక్యమత్యానికి ప్రతీకగా నిలుస్తారు. ఈ పండుగ సమయంలో చెరువులు, కుంటలన్నీ బతుకమ్మలతో నిండిపోతాయి. బతుకమ్మలను నిమజ్జనం చేసినప్పుడు హానికర సూక్ష్మజీవులు నశించి నీరంతా శుద్ధి అవుతుంది. బతుకమ్మ పూలకు ఆ శుద్ధి గుణాలు ఉంటాయి. ఈ పండుగ పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి సమతుల్యానికి కారణమవుతుంది. తెలంగాణ పల్లెలలో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అదొక పెద్ద సంబరంగా భావిస్తారు. ఇల్లు శుభ్రపరిచి, చక్కగా అలంకరించుకొని, ఆడపిల్లలని పుట్టింటికి తీసుకువస్తారు.

కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకైతే అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు.ఈ పండుగ కోసం ఆడపిల్లలు ఎంతో ఎదురుచూస్తారు. బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించాయి. సమ్మెలో బతుకమ్మ ఆడుతూ రాష్ట్ర ప్రత్యేకతను తెలియజేశారు. బతుకమ్మలో వాడే తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా ప్రకటించారు. ఈ పండుగ ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడంలో తెలంగాణ జాగృతి సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన బతుకమ్మ పండుగను ఇప్పుడు స్వరాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తోంది. రానున్న రోజులలో బతుకమ్మ ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రజాదరణ, ప్రశంసలు పొందాలని భావిద్దాం.


డా. కోడూరి శ్రీ వాణి

శాతవాహన విశ్వవిద్యాలయం

కరీంనగర్, 97019 49459


Next Story

Most Viewed