అన్నదాతను ఆదుకోరా...!

by Disha Web Desk 12 |
అన్నదాతను ఆదుకోరా...!
X

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతాంగంపై అకాల వర్షాలు గోరు చుట్టుపై రోకలి పోటుగా మారాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ మారు లక్షలాది ఎకరాల్లో రబీ సాగు తగ్గగా, నకిలీ, కల్తీ విత్తనాలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పెట్రో ధరాఘాతం, ప్రభుత్వ నిరాదరణ.. ఈ అవాంతరాలన్నీ దాటుకొని పండించిన పంటలను భారీ వానలు ముంచెత్తాయి. ఈదురుగాలులు, వడగండ్ల దాడితో లక్షలాది ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలు నీటి పాలయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్ల ముందే తడిసి ముద్దవడంతో అన్నదాతల గుండె చెరువైంది. ఈ వేసవిలో కాలం కాని కాలంలో విడతలు విడతల్లో కురిసిన వర్షాలు పైర్లను ఆగమాగం చేశాయి. గడచిన రెండు మూడు రోజుల్లో పడ్డ వానలకు పొలాల్లోని పంటలు దెబ్బతినడం ఒక ఎత్తుకాగా కల్లాల్లో కోసి ఆరబెట్టిన, చివరికి మార్కెట్‌ యార్డుల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న, మిరప, పసుపు, పత్తి, వేరుశనగ పంటలు వానలకు నానడం మరో ఎత్తు. అక్కడక్కడ మొలకలు సైతం వచ్చాయి.

అరకొర పంపిణీతో రైతు హరీ

ఉద్యానవన పంటలు మామిడి, అరటి, బొప్పాయి, బత్తాయి తోటలు దెబ్బ తిన్నాయి. పధ్నాలుగు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. పంట నష్టం భారీగా ఉంటుందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. విపత్తుల వలన పంటలు నష్టపోయిన రైతులకు ఎప్పటిదప్పుడే పరిహారం చెల్లిస్తామంటోంది రాష్ట్ర సర్కారు. ఆ విధంగా అరకొర పంపిణీ చేస్తోంది. కాగా మార్చిలో కురిసిన వానల నష్టం అంచనాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ లోపు ఏప్రిల్‌ 23 నుంచి రాష్ట్రంలో ఎక్కడో అక్కడ వానలు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఎట్టకేలకు మంగళవారం సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్‌, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు తప్ప ఎలాగో స్పష్టత ఇవ్వలేదు.

గతంలో విపత్తులొచ్చిన వెంటనే అధికారులు ఏయే పంటలు ఎంతెంత విస్తీర్ణంలో ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో ప్రాథమిక అంచనాలు వెల్లడించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇ-క్రాప్‌లో నమోదు చేసిన పంటలు నష్టపోతేనే పరిహారం ఇస్తున్నందున, అంత వరకే నష్టం జరిగిందంటున్నారు. మిగతా నష్టాలను కనీసం పరిగణనలోకి తీసుకోవట్లేదు. కౌలు రైతుల పంట పొలాలు మునిగినా అవి ఇ-క్రాప్‌లో నమోదు కావట్లేదు కనుక ఆ నష్టాలను వదిలేస్తున్నారు. ఎన్యూమరేషన్‌లో పారదర్శకత పాటించకుండా లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యేంత వరకు సమాచారం గుంభనంగా ఉంచుతున్నారు. నష్టాల వివరాలు రహస్యంగా ఉంచాలని ఉన్నతాధికారులు తాఖీదులిస్తున్నారు.

లబ్ధిదారుల కోత అన్యాయం..

లబ్ధిదారుల కోత, అనర్హుల ఎంపిక, నిధుల ఆదా కోసం ప్రభుత్వం రైతులకు అన్యాయం తలపెట్టడం క్షమించరానిది. పంట నష్ట పరిహారం నిబంధనలు రైతులను పరిహాసమాడుతున్నాయి. కోసి ఆరబెట్టిన పంటలకు పరిహారం రాదంటున్నారు. మామిడి, బత్తాయి ఇత్యాది పండ్లు నేల రాలడం వలన రైతులకు అపార నష్టం వాటిల్లినా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వరట. పూర్తిగా చెట్లు పడిపోతేనే సహాయం. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎప్పుడో 2014లో నిర్ణయించిందే ఇప్పుడూ అమలు చేస్తున్నారు. 33 శాతం పంట దెబ్బతింటేనే ఇస్తారు. ఎకరా వరి, పత్తి, మిర్చి పంటలకు ప్రభుత్వం ఇచ్చేది రూ.6 వేలు. తోటలకైతే రూ.8 వేలు. ఈ మాత్రం దానికి పలు నిబంధనలు. కేంద్రం నిర్ణయించిన పరిహారం ఇంకా ఇంకా తక్కువ. అసలు కేంద్రం రాష్ట్రం పంపిన వినతులపై స్పందించట్లేదు.

కేంద్ర బృందాలొచ్చినా నామ్‌ కే వాస్తే రిపోర్టులిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. కేంద్రం కొత్తగా నిధులివ్వకుండా అడ్వాన్స్‌లు, పాత బకాయిల కింద జమ వేసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో రైతులకు అరకొర పరిహారం అందిస్తోంది. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు సముచిత స్థాయిలో పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి. త్వరితగతిన బీమా చెల్లించాలి. కఠిన నిబంధనలు తొలగించాలి. రంగుమారిన, తడిసిన ధాన్యం కొనుగోలుకు కేంద్రంతో మాట్లాడి నాణ్యతా ప్రమాణాలు సడలించేలా చర్యలు తీసుకోవాలి. రబీ ధాన్యం, ఇతర ప్రధాన పంటలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలి.

మేకల రవి కుమార్

కర్నూలు - 82474 79824


Next Story