ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిదొంగలా?

by Disha edit |
ఉద్యోగులు, ఉపాధ్యాయులు పనిదొంగలా?
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రాం, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, రోశయ్య లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రులు తమ నేర్పరితనంతో కర్ర ఇరక్కుండా పాము చావకుండా పాలనను నెట్టుకొచ్చారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ, పదవీకాలం 55 యేళ్లకు తగ్గింపులోనూ ఎన్టీ రామారావు మొదట్లో మొండికేసినా మళ్లీ గొంతు సవరించుకొని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనిపించారు.గత ప్రభుత్వాలు ఏవి కూడా చట్టాన్ని కక్ష సాధింపులకు ఆయుధంగా మలచలేదు. ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందనేందుకు సవాలక్ష ఉదాహరణలున్నాయి. ఉద్యోగులను బదనాం చేస్తే ప్రజలు మరింత సంతోషపడతారని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఎవరో ఉచిత సలహాలు ఇచ్చినట్లుంది. అందుకే బ్రిటిష్ కాలం నాటి సీసీఏ నిబంధనలకు పదునుపెట్టే యత్నాలు ఆరంభించింది. తనిఖీల పేరుతో, నిఘా విభాగాలు నెలకొల్పి ఠారెత్తించబోతున్నారు. దీనిని పరోక్ష గూఢచర్యంగానే చూడవలసివుంటుంది. ఇదొక దుస్సాహసం.

పాలకులు మారినపుడు ప్రభుత్వ విధానాలు మారుతుంటాయి. విధానాల్లో మార్పుల వల్ల ప్రజలకు మరింత మేలు ఓనగూరాలి. అంతేకాకుండా ఇప్పటికే వున్న లోపాలను సరిదిద్దేవిగా ఉండాలి. అందుకోసం చట్టాన్ని కక్ష సాధింపులకు ఆయుధంగా మలచకూడదు. వాస్తవాన్ని వాస్తవంగా చూడగలిగిన దార్శనికత ప్రభుత్వాధినేతల్లో వుండితీరాలి. తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అసాధారణ చర్యలతో వంగదీయాలని చూడడం ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేసినట్లుగానే భావించాల్సి ఉంటుంది. సమస్యలను దాటవేస్తూ, బాధ్యతలను పక్కదారి పట్టిస్తూ గొంతు పిసికి కిక్కురుమనకుండా ఉంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి... ఏపీలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఆపత్కాలాన్ని సృష్టించింది.

ప్రభుత్వమే కక్ష సాధిస్తే... దిక్కెవరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి, భవనం వెంకట్రాం, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రోశయ్య లాంటి ఉద్దండులైన ముఖ్యమంత్రులు తమ నేర్పరితనంతో కర్ర ఇరక్కుండా పాము చావకుండా ప్రభుత్వాలను నెట్టారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలోనూ, పదవీకాలం 55 యేళ్లకు తగ్గింపులోనూ ఎన్టీ రామారావు మొదట్లో మొండికేసినా మళ్లీ గొంతు సవరించుకొని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనిపించారు. గతంలో తమిళనాడులో ఉద్యోగులతో యుద్ధానికి దిగిన జయలలిత ముఖ్యమంత్రి ఉన్నకాలంలో తీవ్ర సంక్షోభంలో పడ్డారు. సమకాలీన రాజకీయ వ్యవస్థలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన పక్క రాష్ట్రంలోని ఎం.కె. స్టాలిన్, సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న అశోక్ గెహ్లాత్, నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్ లాంటి వారు సైతం అత్యంత చాకచక్యంగా ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మసలుతున్నారు. ఇంట్లో పెళ్ళయినా, పండుగ అయినా, జబ్బున పడినా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఎంతో కొంత సాయం అడ్వాన్స్ ఇచ్చి ఉద్యోగులకు చేయూత నిచ్చాయి. అలాగే లంచగొండితనం, అవినీతి, అక్రమాలు, అశ్రిత పక్షపాతం వంటి ఆరోపణలపై గట్టి విచారణ, చర్యలకు ప్రభుత్వాలు ఉపేక్షించ లేదు. నాటి ప్రభుత్వాల సహేతుక చర్యలను కూడా సంఘాలు ఆక్షేపించలేదు.

ఉద్యోగులపై పరోక్ష గూఢచర్యం

ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రస్తుత ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోందనేందుకు సవాలక్ష ఉదాహరణలున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య బలమైన సఖ్యత ఉంటే ఆ పరిస్థితి ప్రజలకు ప్రయోజనం కలిగిస్తుంది. కానీ ఉద్యోగులను బదనాం చేస్తే ప్రజలు మరింత సంతోషపడతారని ప్రభుత్వానికి ఎవరో ఉచిత సలహాలు ఇచ్చినట్లుంది. అందుకే బ్రిటిష్ కాలం నాటి సీసీఏ నిబంధనలకు పదునుపెట్టే యత్నాలు ఆరంభించింది. అందుకే అణిచివేత ద్వారా అదుపులోకి తెచ్చుకోవాలని నడుం బిగించింది. ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడేళ్ళ తర్వాత ఉద్యోగులను దారికి తెచ్చుకోవాలని సంకల్పించింది. జిల్లా పాలనాధికారులకు అందిన సూచనల మేరకు వారు కార్యరంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ఉద్యోగుల కదలికలను కట్టడిచేసే యత్నాలు ముమ్మరం చేశారు. తనిఖీల పేరుతో, నిఘా విభాగాలు నెలకొల్పి ఠారెత్తించబోతున్నారు. దీనిని పరోక్ష గూఢచర్యంగానే చూడవలసివుంటుంది. ఇదొక దుస్సాహసం.

ప్రభుత్వ వైఖరి దేనికి సంకేతం

ఇప్పుడొక ధర్మసందేహం. ఇపుడే నిద్ర మేల్కొన్నట్టు ప్రభుత్వం ఎందుకు ఇంత ఎక్కువగా స్పందిస్తోందో అంతుపట్టడం లేదు. ప్రజలకు సేవలందించడంలో ఉద్యోగుల వెనుకబాటుతనం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందా, జవాబుదారీతనం తగ్గిందా... ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు. అయితే దాన్ని సరి చేయడానికి సవాలక్ష మార్గాలున్నాయి. దాన్ని బూచిగా చూపి ప్రభుత్వంలోని ప్రతి శాఖలోని ఉద్యోగులపైనా డేగ కన్ను వేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజా బాహుళ్యం నుంచి వచ్చిన వారే కదా! వారిని ప్రత్యేక శత్రువర్గంగా ముద్ర వేయడం దేనికి సంకేతం ప్రజలకు ఉద్యోగులను దూరం చేయడంవల్ల బావుకునేదేంటి ఉపాధ్యాయుల, ఉద్యోగుల పనితీరును కొలవడానికి అనేక ప్రామాణిక పద్ధతులున్నాయి. వారు నిజంగా పని చేయకుండా తప్పించుకు తిరుగుతున్న సందర్భంలో అదుపులో పెట్టడానికి మరెన్నో మార్గాలున్నాయి. సామ, దాన, బేద, దండోపాయాల్లో చివరి అస్త్రం గత్యంతరం లేని స్థితిలో తీసుకోవాలని అనుభవాలు చెబుతున్నాయి. క్లుప్తంగా దీనర్థం ఏంటంటే..

ఏదైనా మంచి చెప్పాలంటే..

మంచి మాటలతో చక్కగా చెప్పు...

మారకపోతే ఏదైనా ఇచ్చి చెప్పు...

మారకపోతే గొడవపడి చెప్పు...

మారకపోతే కొట్టి చెప్పు....

ప్రజలను దారిమళ్లించేందుకే

ఈ సంకట స్థితికి కారణంమేంటి కారకులెవరు తెరముందు పాత్రధారులెవరు తెరవెనుక సూత్రధారులెవరు ఈ తరహా వైఖరి ఎటువైపు దారితీస్తుంది. ఇంత యాగీ చేసి ప్రభుత్వం బావుకునేదేంటి ఉద్యోగులతో ప్రత్యక్ష సంబంధం లేని శాఖలకు కూడా ఇదే సెగ పెట్టడంలోని ఆంతర్యం ఏంటి నిశితంగా పరిశీలిస్తే ఆదాయవనరుల్లేని విద్య, వైద్య శాఖలపై ఈ ఒత్తిడి నరాలు చిట్లే స్థాయికి పెంచారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోరుతున్న ఉద్యోగులను ప్రభుత్వం కుంటిసాకులతో మూడేళ్ళుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ఉద్యోగవర్గం గుర్తించింది. కరువు భత్యం ఎగ్గొట్టి పెరుగుదల అంటూ పీఆర్సీలో చూపించడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఒక అశాస్త్రీయ వాదనను తెరపైకి తేవడాన్ని ఎండగడుతున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే మెలుగుతూనే అవకాశం దొరికిన సందర్భంలో భగ్గుమంటున్నారు. ఉద్యోగులను పని దొంగలుగా సమాజం ముందు నిలబెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన పాలకులు ప్రజలను దారి మళ్లిస్తున్నారు.

డాగ్‌స్క్వాడ్లతో తనిఖీలా

ప్రభుత్వానికీ ప్రజలకూ మధ్య వారధులుగా పని చేస్తున్న ఉద్యోగులపై అనుమానం కలిగేలా, అపవాదు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉద్యోగులపై నిఘా పెట్టి హాజరు, పనితీరును ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, డాగ్‌స్క్వాడ్లతో తనిఖీలు చేయించబూనడం దురదృష్టకరం. ఆత్మాభిమానం దెబ్బతినేలా ఉద్యోగులను పని దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం. ఉద్యోగులకు ముఖ గుర్తింపు హాజరు అమలు చేస్తున్నారని, సెల్‌ఫోన్‌తో హాజరు వేయడంవల్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని, ఇది ప్రమాదకరమని సంఘాల నేతలు ఘోషిస్తున్నారు.

ఉభయులూ సమతౌల్యత పాటించాలి

ఈ నేపథ్యంలో ఉద్యోగులు కూడా తమ సరిహద్దులు గుర్తించాలి. విశృంఖలత్వాన్ని, తెగింపును గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయాలకు వచ్చే ప్రజల అవసరాలను సకాలంలో తీర్చి పంపడం ద్వారా సానుకూలంగా వ్యవహరించాలి. కార్యాలయాలకు వచ్చే వారు కేవలం ప్రజలు మాత్రమే కాదు. వారు మనకు యజమానులు అనే వాస్తవాన్ని గుర్తించి మసలుకుంటే భవిష్యత్తులో కాగలకార్యం గంధర్వులు తీరుస్తారు. ప్రభుత్వ శైలిపై సాధారణ ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఒకటో తేదీ జీతం చెల్లింపులో జాప్యంపై బహిరంగ చర్చ నడుస్తోంది. కరువుకాటకాలు, తుపాన్లు, భూకంపాలు వచ్చినా ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయంలో గతంలో ప్రభుత్వాలు వెనకడుగు వేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై ఉద్యోగులు చర్చించే పరిస్థితి మనకూ, ప్రభుత్వానికి ఏ రకంగా చూసినా శ్రేయోదాయకం కాదు.

మోహన్ దాస్

రాష్ట్ర కౌన్సిలర్ ఏపిటిఎఫ్ 1938.

94908 09909

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672



Next Story

Most Viewed