ఓ సీపీఎస్ ఉద్యోగీ కదలిరా.. అభీ నహీతో.. కభీ నహీ..

by Disha edit |
ఓ సీపీఎస్ ఉద్యోగీ కదలిరా.. అభీ నహీతో.. కభీ నహీ..
X

సీపీఎస్ ఉద్యోగీ కదలిరా, ఉద్యమం పిలుస్తోంది, కదంతొక్కి కదలిరా, అభి నహీతో .. కభీ నహీ. అవును ఇది నీ వృద్ధాప్య జీవిత సమస్య, ఇది ఇప్పుడు సాధ్యం కాకుంటే మరెప్పుడూ సాధ్యం కాదు. 20, 25 సంవత్సరాలు చదివి 30, 40 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తే చివరికి వృద్ధాప్యంలో నీకు మిగిలేది కేవలం ఆసరా పింఛన్ కన్నా అధ్వాన పెన్షనా? ప్రభుత్వ ఉద్యోగానికి, ప్రైవేట్ ఉద్యోగానికి తేడా పాత పెన్షనే. పాత పెన్షన్ లేని ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగమని ఎలా అంటారు? ఉద్యోగులంటే ప్రజల్లో భాగమని మరచి ఆసరా పెన్షన్‌కు కూడా అనర్హులని చేస్తున్న ఈ నయా ఆర్థిక విధానాలను ప్రశ్నిస్తూ కదలిరా.

వెనక్కి తగ్గిన ప్రభుత్వాలు..

ఓ ఉద్యోగి మేలుకో.. ఉద్యమానికి కదలిరా. రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కును కాపాడుకోవడానికి కదలిరా. 30, 40 సంవత్సరాలు గొడ్డు కష్టం చేస్తే పెన్షన్ లేదట, సరిహద్దుల్లో చావుతో సహవాసం చేసిన వారికి పెన్షన్ రాదట, కానీ ఐదు సంవత్సరాలు ప్రజా ప్రతినిధిగా ఉంటే పెన్షనట! ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కావడం ఉద్యోగమా, లేక సేవనా? సేవ అయితే వారికి పెన్షన్ ఎందుకు? ప్రజాప్రతినిధులకు పెన్షన్ మనకు టెన్షనా? సీపీఎస్ రద్దు ఇప్పుడు సాధ్యం కాకపోతే ఇంకెప్పుడు సాధ్యం కాదని తెలుసుకో. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం ఊపందుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమం ఉధృతం చేశారు. ఇప్పుడు ఉద్యమ సెగ రాజకీయ రూపం తీసుకుంది. సీపీఎస్ రద్దు రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఒక ప్రధాన అంశంగా మారింది.

ఉద్యోగుల ఓట్లే ఈరోజు పార్టీల రాజకీయ భవిష్యత్తును తారుమారు చేస్తున్నాయి. అందుకు ఉదాహరణే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు. ఆయా రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిన పార్టీలు ఐదు శాతం ఓట్ల తేడాతో అధికారం కైవసం చేసుకున్నాయి. ఆ ఫలితాలతో ఆలోచనలో పడ్డ కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ను మెరుగుపరచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. అలాగే రాష్ట్రంలోనూ ఇప్పుడు సీపీఎస్ రద్దు ప్రధాన అంశంగా మారింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల ప్రధాన డిమాండ్ సీపీఎస్ రద్దుగా మారిపోయింది. ఒకప్పుడు సీపీఎస్ చాలా ఉత్తమమైనదని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగుల భవిష్యత్తు పట్ల భద్రతను కోరుకుంటున్నారని స్వయానా సీఎం పేర్కొంటున్నారు. అంటే ప్రభుత్వం ఒక మెట్టు దిగి సీపీఎస్‌పై ఆలోచిస్తుందని తెలుస్తుంది.

అందుకే మనం ఇప్పుడే అప్రమత్తం కావాలి. ఇప్పుడే ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. ముఖ్యమంత్రి మాటల్లోని అర్ధాన్ని గుర్తించాలి ఎందుకంటే సీపీఎస్‌‌పై పరిశీలిస్తాం అన్నారంటే రద్దు చేయన్నట్లేనని గుర్తించాలి. కొన్ని రాష్ట్రాలు సీపీఎస్‌ను రద్దు చేశాయి అయినా కేంద్రం పీఎఫ్ఆర్డీఏ అనే పీటముడి వేసింది. రాష్ట్రవాటా, ఉద్యోగులవాటా వెనక్కి ఇవ్వనంటోంది. అది ఒక స్కీం, అందులో ఆ డబ్బులు డిపాజిట్ చేయబడి ఉన్నాయి. దాన్ని వెనక్కు తీసుకోలేము అన్నారు. అయినప్పటికీ ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా పరిశీలిస్తామని ప్రకటించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్ పరిశీలనకు ఒక కమిటీ వేయవచ్చు.

ఉద్యోగుల పెన్షన్ సర్కార్ బాధ్యతే!

అయితే రాష్ట్రంలో కమిటీలంటే కాలయాపనే! అందుకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ సమయంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలి. సీపీఎస్ రద్దు చేయక తప్పని పరిస్థితి కల్పించాలి. రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీ సీపీఎస్‌ను రద్దు చేస్తాం అని మేనిఫెస్టోలో పెట్టబోతుంటే పరిశీలిస్తామనడం భావ్యం కాదు. ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడం వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వంతో సాధ్యమయినప్పుడు సీపీఎస్‌ను ఓపీఎస్ గా మార్చలేరా?వచ్చే ఎన్నికల వ్యూహాల్లో ప్రధాన అస్త్రంగా సీపీఎస్ రద్దు ఉండేలా చేయాలి. అందుకే కదం తొక్కు. ఈ పోరాటం కొందరికి గుణపాఠం కావాలి. ప్రజా సంక్షేమానికి పాతరేసే నయా ఉదారవాదులకు కనువిప్పు కావాలి.

పెట్టుబడిదారులకు రాయితీలియ్యడమే సర్కార్ బాధ్యత కాదు, ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడం కూడా సర్కారు బాధ్యతే అని తెలియజెబుతాం! దేశ అభివృద్ధి అంటే ఉద్యోగులను వయస్సులో ఉన్నప్పుడు వాడుకొని వృద్ధాప్యంలో వదిలించుకోవడం కాదు, అవసాన దశలో ఆదుకోవడమే అనే సత్యాన్ని నిరూపించాలి. పీఎఫ్ఆర్డీఏ అనే పీటముడిని వేసిన ప్రభుత్వాలే ఆ పీటముడిని విప్పేందుకు, ఈ నయా ఉదారవాద ఆర్థిక విధానాలను బద్దలుకొట్టి సామ్యవాద, సంక్షేమ, సమ్మిళిత ఆర్థిక విధానాల వైపు నడిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుటకు కదలిరా. తెలంగాణ ఉద్యమమే మనకు ఆదర్శం. అప్పుడు నీ రాష్ట్రం కోసం పోరాడావు, ఇప్పుడు నీ వృద్ధాప్య జీవిత భద్రత కోసం ఉద్యమించుటకు కదలిరా! ఆగస్ట్ 12న ‘చలో హైదరాబాద్’ ధర్నాకు కదలిరా!

జుర్రు నారాయణ యాదవ్,

TTU, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

94940 19270



Next Story

Most Viewed