ఈ రద్దు... ప్రజాస్వామ్యమేనా?

by Disha edit |
ఈ రద్దు... ప్రజాస్వామ్యమేనా?
X

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 దేశంలో చాలా కాలం నుంచి చర్చగా మారింది. ఈ ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించింది. బ్రిటిష్ సామ్రాజ్యవాద వలస పాలన నుండి రాజరికంగా ఉన్న రాజుల రాజ్యాలు ప్రజాస్వామ్య స్వతంత్ర దేశాలుగా ఏర్పడే క్రమంలో జమ్మూకాశ్మీర్ అప్పటి రాజా హరిసింగ్ భారతదేశంలో విలీన సందర్భంగా జమ్మూ కాశ్మీర్ రక్షణ, విదేశీ, సమాచార రంగానికి సంబంధించిన అధికారాలను మాత్రమే భారత ప్రభుత్వానికి అప్పగించి పరిపాలనకు సంబంధించిన చట్టాల రూపకల్పన వంటి అధికారాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వదిలేశారు.

పరాధీనంలో వారి ఆస్తులు..

జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ భారతదేశంతో షరతులతో కూడిన విలీన ఒప్పందానికి కారణం ఉంది. ఆనాడు రాజా హరిసింగ్ రాజ్యంలో రాజ్యానికి సరిపడా సైన్యం లేని కారణంగా భారతదేశంతో షరతుల ఒప్పంద అవసరం ఏర్పడింది. ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాజ్యంలో రాజ్యానికి సరిపడినంత సైన్యం ఉంటే భారతదేశంతో షరతులతో కూడిన ఒప్పందం కూడా జరిగి ఉండేది కాదు. నేడు జమ్మూ కాశ్మీర్ ఒక స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉండి ఉండేది.

భారత పార్లమెంటులో నాలుగు సంవత్సరాల క్రితం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్‌ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. జమ్మూ కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన ప్రాంతంగా, లద్దాక్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోయింది. కానీ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎన్నికలు నిర్వహించలేక పోయింది. నాలుగు సంవత్సరాల తరువాత భారత సుప్రీంకోర్టు చేత పార్లమెంట్ ఆర్టికల్ 370 రద్దు చేయడం న్యాయమేననీ తీర్పు ఇప్పించారు. పార్లమెంట్ ఆర్టికల్ 370ని రద్దు చేయడం అంటే తరతరాల కాశ్మీరీ ప్రజల హక్కులనూ తరతరాల కాశ్మీర్ ప్రజల వారసత్వ సంపదనూ అభివృద్ధి పేరిట భారత బడా వ్యాపారస్తులకు, భారత కార్పోరేట్లకూ, విదేశీ దళారులకు అప్పగించడమే. ఆర్టికల్ 370 రద్దుతో తరతరాల కాశ్మీరీ ప్రజల వారసత్వ సహజ వనరులు, తరతరాల నుండి లభించిన వారసత్వ హక్కులు వారి కళ్ళముందే పరాధీనం కావడమే.

నాడు తెలంగాణ, నేడు కాశ్మీర్

ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉండాలని ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట బలవంతంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో విలీనం చేశారు. తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసే సందర్భంలో కూడా ఒప్పందాల పేరిట పెద్దమనుషుల ఒప్పందమని నిబంధనలు పెట్టుకున్నారు. ఆ నిబంధనలలో అత్యంత ముఖ్యమైన నిబంధన ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో భూములు కొనుగోలు చేయవద్దని. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో రైతుల భూములు ఇతర ప్రాంతాల వారు కొనడం మూలంగా రైతులు భూములు కోల్పోతే రైతులు బ్రతకడమే కష్టంగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఆంధ్రా ప్రాంతాల వారు తెలంగాణలో భూములు కొనుగోలు చేయవద్దని నిబంధనలు పెట్టారు.ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో భూములు కొనవద్దన్న నిబంధనను అతిక్రమించి భూములు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.ఆంధ్ర ప్రాంతం వారు తెలంగాణలో భూములు కొనడం మొదలైనప్పటి నుండి మొత్తం తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదులోనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు అన్నీ ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రేపటి రోజున అభివృద్ధి పేరిట జమ్మూ కాశ్మీర్లో జరగబోయేది కూడా ఇదే.

వారి సంపద కాస్తా..

జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి జరగాలంటే ఎవరైనా భూములు కొనవచ్చని చెబుతూ ఆర్టికల్ 370ని దేశ సమైక్యత పేర, దేశ అభివృద్ధి పేరిట రద్దు చేశారు. ఇకనుండి కాశ్మీర్ ప్రజల భూములు కాశ్మీరీ ప్రజలవి కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. కాశ్మీరీ ప్రజల తరతరాల వారసత్వ హక్కులు రేపటి భారత కార్పొరేట్ల హక్కులుగా మారనున్నాయి. తరతరాల కాశ్మీరీ ప్రజల వారసత్వ సంపద రేపటి భారత వ్యాపార వర్గం వారసత్వ సంపదగా మారనున్నది.

ఆజాదీకా అమృత్ మహోత్సవాల పేరిట, భారత్‌లో అభివృద్ధి పేరిట తరతరాల భారత దళితుల సంస్కృతినీ, ఆదివాసీల సంస్కృతినీ, దేశ జాతుల సంస్కృతిని విధ్వంసం చేయడం ప్రారంభించారు. నేడు ప్రజల అభివృద్ధి అంటే అది భారత వ్యాపారుల భారత కార్పొరేట్ల అభివృద్ధే. ఆర్టికల్ 370ని ఏ ప్రాంత ప్రజల హక్కుల కొరకు సృష్టించారో, ఏ ప్రాంత ప్రజల తరతరాల వారసత్వ సంపద కాపాడడానికి దాన్ని సృష్టించారో, ఏ ప్రాంత ప్రజల తరతరాల సంస్కృతిని కాపాడటం కోసం సృష్టించారో, ఆ ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కూడా ఆ ప్రాంత ప్రజల ప్రజాభిప్రాయాన్ని కొలమానంగా తీసుకోవాలి. కానీ భారత పార్లమెంటు, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నదే పెద్ద ప్రశ్న.

గుండమల్ల సత్యనారాయణ

89199 98619



Next Story

Most Viewed