కరోనా ఫ్రీ క్రికెట్‌కు ఈసీబీ సిద్ధం

by  |
కరోనా ఫ్రీ క్రికెట్‌కు ఈసీబీ సిద్ధం
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్తంభించిపోయింది. మూడు నెలలుగా దేశవాళి నుంచి అంతర్జాతీయస్థాయి వరకు క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. తిరిగి ఆటను ప్రారంభించడానికి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆసక్తిగా ఉన్నాయి. ఈ విషయంలో ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ఒక అడుగు ముందుంది. బ్రిటన్ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూనే మ్యాచ్‌లు నిర్వహిచాలని నిర్ణయించింది. ఈనెల 9 నుంచి వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. ఇప్పటికే ఆటగాళ్లు, అంపైర్లు, సహాయక, బ్రాడ్‌కాస్టింగ్, గ్రౌండ్ సిబ్బంది ఆరోగ్యాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక సిద్ధం చేసింది. ఆయా క్రికెట్ స్టేడియాల్లో బయో-సెక్యూర్ వాతావరణాన్ని సృష్టించనుంది. ఇందుకోసం గోల్డ్ స్టాండర్డ్ పేరుతో స్టేడియాల్లో ఏర్పాట్లు చేయనుంది. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియంలో 160 నుంచి 200మంది వరకు సిబ్బంది అవసరమవుతారు. వీళ్లందరికీ ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మ్యాచ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు నుంచి వీళ్లు స్టేడియంలోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో ఉంటారు. ఇలా ఒక్కో నగరంలో మూడు స్టేడియాలను సిద్ధం చేస్తున్నారు. ప్రాక్టీస్‌ కోసం ఒకటి, మ్యాచ్ కోసం మరో రెండు స్టేడియాలు ఉపయోగిస్తారు. ప్రతి స్టేడియాన్ని మూడు జోన్లుగా విభజించనున్నారు. ఒక జోన్‌లో ఆటగాళ్లు, మరో జోన్‌లో అంపైర్లు, ఇతర సిబ్బంది, చివరి జోన్‌లో గ్రౌండ్స్‌మెన్, ఇతర సహాయక సిబ్బందిని పరిమితం చేయనున్నారు. తమ జోన్ పరిధి దాటి బయటకు వెళ్లడానికి అనుమతివ్వరు.

ఆటగాళ్లే బంతులు తెచ్చుకోవాలి

మ్యాచ్ సమయంలో బ్యాట్స్‌మెన్ బంతిని బౌండరీకి తరలిస్తే ఆటగాళ్లే తెచ్చుకోవాలి. అంతేగాని మునుపటిలా బౌండరీ దగ్గర ఎవరూ ఉండరని సమాచారం. సిక్స్‌ వెళ్తే మాత్రం సహాయక సిబ్బంది బంతిని అందిస్తారు. కానీ, వాళ్లు తప్పనిసరిగా మెడికల్ గ్లౌజులు ధరించాలని నిబంధన విధించారు. ఎట్టి పరిస్థితిలోనూ బంతిని నేరుగా తాకొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికీ ఏయే గ్రౌండ్లలో మ్యాచ్‌లు జరగాలనేది నిర్ణయించలేదు. కానీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, సౌంతాప్టన్, ఎడ్జ్‌బాస్టన్‌లలో మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఈసీబీ అధికారి ఒకరు చెప్పారు. గ్రౌండ్‌కు సమీపంలోని హోటల్స్‌లోనే రూమ్స్ బుక్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ప్రేక్షకులు గ్యాలరీల్లో తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఉపయోగించవద్దని, సొంత వాహనాలు ఉంటేనే మ్యాచ్ చూడటానికి రావాలని ఈసీబీ సూచిస్తోంది. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని చెబుతున్నారు.

ఉమ్మి వేయరాదు

ప్రేక్షకులు, ఆటగాళ్లు ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయరాదని ఈసీబీ చెబుతోంది. ఎవరికి కేటాయించిన జోన్‌లో వాళ్లు కూర్చోవాలని సూచిస్తోంది. ఇక ఆటగాళ్లకు ప్రతిరోజు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, కాగా, ఎవరైన క్రీడాకారుడు కొవిడ్-19 బారిన పడితే సబ్‌స్టిట్యూట్‌ను ఆడించాలా లేదా అనే విషయం ఇంకా ఐసీసీ నిర్ణయించలేదు. ఈ నిబంధనపై పూర్తి స్థాయిలో ఐసీసీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈసీబీ తెలిపింది. ప్రతిరోజు స్టేడియం, గ్యాలరీలను డిస్‌ఇన్‌ఫెక్ట్, శానిటైజేషన్ చేసిన తర్వాత రెండో రోజు ఆటను ప్రారంభిస్తారు. కాగా, ఇన్ని నిబంధనలు అమలు చేసినా ఎవరైనా కొవిడ్-19 బారిన పడే అవకాశం ఉండటంతో మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. ఇక క్రీడాకారులు ఆగస్టు 10 వరకు కుటుంబాలకు దూరంగా ఉండాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులను కలవడానికి వీళ్లేదని ఈసీబీ స్పష్టం చేసింది.

Next Story

Most Viewed