జీతాల్లేవ్.. సౌకర్యాల్లేవ్

by  |
జీతాల్లేవ్.. సౌకర్యాల్లేవ్
X

దిశ ప్రతినిధి, మెదక్ : పీహెచ్ సీల పరిధిలో కరోనా కట్టడికి ముందుండి పోరాడుతుంది ఈసీఏఎన్ఎంలు. రోజు పీపీఈ కిట్, మాస్కులు ధరించడంతో శ్వాస ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇతర అనారోగ్యం బారిన పడుతున్నారు. పీహెచ్‌సీ కేంద్రాల్లో ఇతర వైద్య సిబ్బంది, డాక్టర్, సూపర్ వైజర్లు ఉన్నప్పటికి పనిభారమంతా ఈసీఏఎన్ఎంలపైనే పడుతుంది. ఎలాంటి ఇతర సౌకర్యాల్లేక కేవలం జీతం పై ఆధారపడుతున్న వారికి గత రెండు నెలలుగా జీతాలు రావడం లేదు, మరోవైపు ఉద్యోగ భద్రత లేదు. ఇన్ని ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నామని పలువురు ఈసీఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

సిద్దిపేట జిల్లాలో 33 పీహెచ్‌సీలు, రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉ న్నాయి. వీటి పరిధిలోని 147 రెగ్యులర్ ఏఎన్ఎంలు, 44 మంది ఈసీఏఎన్ఎంలు, సెకండ్ ఏఎన్ఎంలు 186 మంది విధులు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో 20 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉ న్నాయి. ఇందులో 126 రెగ్యులర్ ఏఎన్ఎం పోస్టులు మంజూరు కాగా 88 మంది మాత్రమే ఉన్నారు. 38 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈసీ ఏఎన్ఎంలు 34 మంజూరు కాగా 32 మంది మాత్రమే ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎంలు సైతం 160 మందికి 128 మంది మాత్రమే ఉన్నారు. మేల్ హెల్త్ అసిస్టెంట్లు 80 మంజూరు కాగా 35 మంది ఉ న్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 33 పీహెచ్‌సీలు ఉండగా అందులో29 పీహెచ్ సీలు, నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు కలవు. ఇందులో 112 ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ లో 260 మంది ఈసీఏఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు.

వేతనాలు పెండింగ్ ..

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న ఈసీఏఎన్ఎం లను ఆదుకోవాల్సింది పోయి వారికి వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది. గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఈ సీఏఎన్ఎంలకు ( యూరోపియన్ స్కీంలో ఏఎన్ఎంలు ) ఇప్పటి వరకు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనే విధులు నిర్వహిస్తున్నారు. వీరిని ఇప్పటి వరకు రెగ్యులరైజ్ చేయలేదు. కనీసం రెగ్యులర్ ఏఎన్ఎంలకు ఇచ్చిన మాదిరిగా పీఎఫ్, ఉద్యోగ భద్రత, రవాణా ఛార్జీలు, ఇతర అలవెన్సెస్ ఏవి లేవు. కేవలం జీతాల పైనే ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో గత రెండు నెలలుగా వేతనాలు అందించడం లేదు. లాక్ డౌన్ ప్రారంభంలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో మూడు నెలల పాటు తమ జీతంలో పది శాతం కట్ చేసి వేతనం ఇచ్చారని, ఇప్పుడేమో రెండు నెలలుగా పూర్తిగా వేతనాలు బంద్ చేశారని, ఇలాంటి పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా మారిందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు.

పూర్తి భారమంతా ఈసీఏఎన్ఎంలదే …

కరోనా కష్టకాలంలో వైద్య సిబ్బందిని పెంచి తమకు విధుల్లో కొంత పనిఒత్తిడి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పదేపదే కోరుతున్న వినడం లేదు. కొవిడ్ బాధితులను చూసుకోవడమే గగనమైతున్న తరుణంలోవాటికి తోడు గ్రామాల్లో ఓపీ సేవలు, ఆర్ సీహెచ్, గర్భిణీ స్త్రీలను చెకప్ చేయడం, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి డెలివరీ చేయించడం, కేసీఆర్ కిట్ అందివ్వడం, ఆన్ లైన్ లో వారి వివరాలు నమోదు చేయడం, కరోనా పేషంట్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, టీబీ వ్యాధి గ్రస్తులు, లెప్రసీ రోగులు, బీపీ, షుగర్ బారిన పడిన వారికి మందులు అందించడం. ఇలా పొద్దంతా నిమిషం కూడా విశ్రాంతి దొరకడం లేదు. ఇలాగైతే తమ ప్రాణాలను కాపాడుకోవడం కష్టంగా మారిందంటున్నారు. పలువురు ఈసీఏఎన్ఎంలు.

అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన..

కరోనా టెస్టుల కోసం వచ్చే వారిని పరీక్షించడానికి పీహెచ్ సీ వైద్యులు, సూపర్‌వైజరు ఏఎన్‌ఎంలకే బాధ్యతలను అప్పగిస్తున్నారు. గతంలో రోజుకు 50 టెస్టులు చేయాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్కో ఏఎన్ఎం 150 వ రకు టెస్టులు చేయాలని టార్గెట్ విధిస్తున్నారు. దీంతో వారంత పీపీఈ కిట్ ధరించి, మాస్కు వేసుకొని టెస్టులు చేస్తున్నారు. పీపీఈ కిట్ ధరించడం వల్ల శ్వాస సరిగ్గా ఆడక, చెమట పెట్టడం వల్ల చాలా మంది ఏఎన్ఎంలు స్పృహ తప్పి పడిపోవడం, హార్ట్ ఎటాక్, పక్షవాతం లాంటి ఆనారోగ్యం బారిన పడుతున్నారు. అయినా పీహెచ్సీ వైద్యులు, ఆస్పత్రి సూపర్‌వైజర్లు వారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. కనీసం ఏ ఒక్క సూపర్‌వైజర్, మేల్ హెల్త్ అసిస్టెంట్లు ఒక్కరూ కూడా కొవిడ్ టెస్టులు చేయడం లేదు. అనారోగ్యం బారిన పడుతున్నాం. తమకు పీపీఈ కిట్ వేసుకోకుండా ఇతర పని అప్పగించాలని పీహెచ్‌సీ వైద్యులను ప్రాధేయపడుతున్న వినని పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, మంత్రి హరీశ్ రావు స్పందించి అనారోగ్యం బారిన పడుతున్న ఈసీఏఎన్ఎంలకు మినహాయింపు ఇవ్వాలని, సకాలంలో జీతాలు అందించాలని ప్రాధేయపడుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.



Next Story

Most Viewed