ఏకమైన ఊరు.. సొంత నిధులతో కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం

by  |
Gollala Mamidada
X

దిశ, ఫీచర్స్: కొవిడ్ బాధితుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వాస్పత్రుల్లో బెడ్ దొరకదు, ఇంట్లోనే సెల్ఫ్ ఐసో‌లేషన్‌లో ఉందామంటే ఇరుకు గదులతో ఇబ్బందులు.. ప్రైవేట్ దవాఖానాలో చేరాలంటే సరిపోని స్థోమతకు తోడు పాజిటివ్ రోగులను పొలిమేరల్లో అడుగుపెట్టనివ్వని గ్రామాలు.. వెరసి నిత్యం ఇలాంటి సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏకమైన ఒక ఊరి జనం.. తామే ఓ కొవిడ్ కేర్ సెంటర్ నిర్మించుకుని మిగతా పల్లెలకు ఆదర్శంగా నిలుస్తుండటంతో పాటు చుట్టుపక్కల పల్లెల్లోని కొవిడ్ బాధితులకు సైతం అండగా ఉంటున్నారు. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది? ఈ ఆలోచన వారికి ఎలా వచ్చింది?

తూర్పు గోదావరి జిల్లా, గొల్లల మామిడాడ గ్రామస్తులు ఫస్ట్ వేవ్ సందర్భంలో కరోనావైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆ తరువాత కేసులు తగ్గినా.. ప్రస్తుత సెకండ్ వేవ్‌లో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. కాగా ఈ ఆపత్కాలంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలని నిర్ణయించుకున్న గ్రామస్తులు.. బాధిత కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే యువత, వలంటీర్లతో పాటు గ్రామస్తులంతా చందాలు వేసుకుని దాదాపు రూ.50 లక్షలు సేకరించారు. ఈ మేరకు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 30 పడకల సామర్థ్యంతో కొవిడ్ కేర్ సెంటర్‌ను సొంతంగా నిర్మించుకోగా.. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ రోజే (మే28) ప్రారంభం కాబోతోంది. ప్రభుత్వాస్పత్రుల్లోని లోపాలు, ప్రైవేట్ దవాఖానాల దోపిడీని ఎదుర్కొనేందుకు సమిష్టి ప్రయత్నాన్ని చేసిన మామిడాడ గ్రామస్తులు.. తమ గ్రామస్తులకే కాకుండా సమీప పల్లె జనాలకు సైతం చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యారు.

ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగానే ఎదుర్కొన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు పడ్డాం. ఇక మార్చిలో ప్రారంభమైన సెకండ్ వేవ్ ఉధృతంగా మారింది. ఈ క్రమంలో దగ్గరి బంధువులను, ప్రియమైన వారిని, స్నేహితులను కోల్పోయాం. ఈ సంఘటనలతో గుణపాఠాలు నేర్చుకుని కొవిడ్ కేర్ ఏర్పాటుకు సిద్ధమయ్యాం. మహమ్మారిపై తమ స్థాయిలో ఉత్తమంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వాలు.. ప్రతిదీ చేయలేవనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక 30 బెడ్లకు సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచాం. – మండ రాజారెడ్డి, కరోనా కేర్ సెంటర్ మెంబర్

ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది ప్రజలు ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్నారు. అటువంటి మరణాలను తగ్గించడానికి, ఈ సెంటర్ నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నాం. అన్ని పడకలలో ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న కోవిడ్ రోగులకు ఉచితంగా ప్రథమ చికిత్సతో పాటు పూర్తి స్థాయి చికిత్స, ఆక్సిజన్ అందించనున్నాం. ఈ మానవతా కార్యక్రమానికి మా గ్రామస్తులు లక్షల రూపాయలు అందించారు. ఈ విధంగా, మా గ్రామం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. మానవులకు సేవ చేయడమే భగవంతునికి సేవ చేయడం అనే నినాదాన్ని మేము నమ్ముతున్నాం. కాగా కేంద్రంలో అన్ని సౌకర్యాలతో ఉత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. – డీవీకే బ్రహ్మానంద రెడ్ది, స్థానికుడు

Next Story

Most Viewed