‘నాలుగేళ్లలో 100 బిలియన్ డాలర్లు’

by  |
‘నాలుగేళ్లలో 100 బిలియన్ డాలర్లు’
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం కరోనా సంక్షోభంలోనూ భారీగా లాభాలతో దూసుకెళ్తున్న ఏకైక రంగం ఈ-కామర్స్ (E-commerce). ఇదివరకటి కంటే దేశవ్యాప్తంగా ఈ-కామర్స్ మార్కెట్ (E-Commerce Market) అత్యంత వేగంగా విస్తరిస్తోంది. అనేక స్టార్టప్ (Startup) కంపెనీలు ఇతర కంపెనీలతో కలిసి వ్యాపారాలను విస్తరిస్తుంటే, పలు దిగ్గజ కంపెనీలు ఓ మోస్తరు కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఈ-కామర్స్ రంగానికి రెక్కలు విస్తరిస్తున్నాయి. తాజాగా, గ్లోబల్ కంపెనీ అల్వరెజ్ అండ్ మార్సల్, సీఐఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ (Global Company Alvarez and Marshall, CII Institute of Logistics) సంయుక్త నివేదిక ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2024 నాటికి రిటైల్ ఈ-కామర్స్ మార్కెట్ విలువ ఏకంగా 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

మన కరెన్సీలో దీని విలువ సుమారు రూ. 7.5 లక్షల కోట్లు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ నేపథ్యంలో వినియోగదారుల కొనుగోలు ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి. అంతేకాకుండా, చిన్నా చితక వ్యాపారులు ఆన్‌లైన్ విక్రేతలుగా మారుతుండటం కూడా ఈ-కామర్స్ రంగం పుంజుకోవడానికి కారణంగా నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఏడాదిలో గ్రాసరీ విభాగంలో కూడా డిమాండ్ అధికంగా ఉండటం, ఫుడ్ డెలివరీ సంస్థల సంఖ్య పెరగడం కూడా రానున్న నాలుగేళ్లలో మార్కెట్ విస్తరణకు దోహదపడనున్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా, భారత్‌లో సరఫరా వ్యవస్థ (Supply system)లో సరికొత్త ఆవిష్కరణలు రావడం మార్కెట్ భవిష్యత్తు విస్తరణకు కీలకంగా కనిపిస్తోందని నివేదిక వెల్లడించింది. 2019 ముగిసే సమయానికి రిటైల్ రంగం సుమారు రూ. 68.6 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రిటైల్ ఈ-కామర్స్ విభాగం విలువ సుమారు రూ. 2.25 లక్షల కోట్లు. 2010లో ఇది కేవలం రూ. 7500 కోట్ల విలువ మాత్రమే ఉండేది. పదేళ్ల కాలంలో మూడున్నర రెట్లు పెరిగిందని నివేదిక పేర్కొంది.

Next Story

Most Viewed