తెలంగాణ పర్యాటక శాఖలో ఏపీ అధికారులు

by  |
తెలంగాణ పర్యాటక శాఖలో ఏపీ అధికారులు
X

పర్యాటక శాఖలో పక్కోళ్లే కీలక స్థానాలను ఆక్రమిస్తున్నారు.. మన దగ్గర అర్హులున్నా అందలం మాత్రం అప్పగించడం లేదు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా వారినే తీసుకొచ్చి ప్రముఖ బాధ్యతలు అప్పగిస్తున్నారు. రిటైర్డ్​ అయి ఏండ్లుగా ఖాళీగా ఉన్నవారిని పిలిచిమరీ పదవులు కట్టబెడుతున్నారు.. అర్హులైన వాళ్లు మన దగ్గరున్నా ఎందుకని వారిని తీసుకొస్తున్నారో అంతు చిక్కని ప్రశ్న.. టూరిజంలో జరుగుతున్న ఈ తంతు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఉండే పోస్టుల్లో పక్క రాష్ట్ర అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏపీలో పదవీ విరమణ పొందినా ఇక్కడ తిరిగి విధులు అప్పగిస్తున్నారు. స్వరాష్ట్రంలో ఆంధ్రోళ్లకే పెద్దపీట వేస్తున్నారు. వారంతా ఎప్పటి నుంచో ఉన్నవారు కూడా కాదు. ఏపీలో దాదాపు ఏడేండ్ల కిందటే పదవీ విరమణ పొంది ఖాళీగా ఉన్న వారికి తాజాగా తెలంగాణకు తీసుకువచ్చి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీనిపై పర్యాటక శాఖలో పలు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్​, ఎంపీ సంతోష్​రావు బంధువునంటూ చెప్పుకుంటున్న సదరు ఉన్నతాధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, స్థానికంగా ఎంతో మంది అర్హులైన అధికారులున్నా అందరినీ పక్కనపెట్టి ఏపీ అధికారులకు కీలక పదవులు అప్పగించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఎంతో పాటు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అయితే సదరు శాఖ మంత్రి కూడా దీనికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ఎందుకు రప్పించారో..?

పర్యాటక శాఖలో ఇష్టారీతిన ఉద్యోగులను నియమిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగాల కోసం రూ.లక్షలలో వసూలు చేసినట్లు గతంలో విచారణలు కూడా జరిగాయి. కారణాలేమైనా నివేదికలను మాత్రం తొక్కి పెడుతున్నారు. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. ఏపీలో ఏడేండ్ల కిందట టూరిజం శాఖలో పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను ఇటీవల రాష్ట్రానికి తీసుకువచ్చారు. టూరిజం శాఖ ఉన్నతాధికారికి దగ్గరగా ఉంటారని, గతంలో ఉన్న పలు లావాదేవీలతో వారిని కీలక పోస్టులలో పెట్టేందుకు లక్షలు చేతులు మార్చారని ఆరోపణలున్నాయి. ఆరోపణలకు అనుగుణంగానే ప్రధానంగా మూడు కీలక స్థానాలలో ఏపీలో పదవీ విరమణ పొందిన అధికారులకు పగ్గాలు అప్పగించారు. తారామతి మల్టీ ఫంక్షన్​హాల్​ రిసార్ట్​ బాధ్యతలను ఏపీలో రిటైరైన అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఆయన సర్వీసు కాలంలో కూడా వివాదాస్పదంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన అదేస్థాయి అధికారులు కూడా ప్రశ్నించినా సమాధానం లేదు. పలువురు అధికారులు సీఎం కేసీఆర్​కు కూడా ఫిర్యాదు చేశారు. తారామతి వేదికగా చాలా అక్రమాలు చేస్తున్నారని, రిసార్టుల్లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా వసూలు చేస్తున్న అద్దె, భోజనాలు, ఇతర ఖర్చుల్లో సగం చూపిస్తూ కలిసి పంచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

పర్యాటక శాఖ పరిధిలోని మరో కీలకమైనది బేగంపేటలోని హరిత టూరిజం ప్లాజా. దీని నిర్వహణను కూడా ఇటీవల ఏపీలో పదవీ విరమణ పొందిన అధికారికి అప్పగించారు. దీనికోసం ఓ మంత్రి, టూరిజం శాఖ ఉన్నతాధికారి రాజకీయం చేశారని, సీఎం, ఎంపీల పేర్లు చెప్పి ఎట్టకేలకు తీసుకువచ్చారని చర్చ జరుగుతోంది. టూరిజం శాఖలోని ఉన్నతాధికారితో కలిసి పనిచేయడంతో ఇరువురి మధ్య అవగాహన ఉందని, దీంతో ఏపీలో పదవీ విరమణ పొంది ఏండ్ల నుంచి ఖాళీగా ఉంటున్న సదరు అధికారిని తీసుకువచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించే విధంగా అధికారాలు అప్పగించారని ఆరోపణలున్నాయి. ఇక్కడ కూడా పలు అంశాల్లో తప్పుడు నిర్ణయాలు, అక్రమాలకు తావిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్​హెచ్​ఆర్​డీ) బాధ్యతలను కూడా ఇటీవలే ఏపీలో రిటరైన అధికారికి అప్పగించారు. దీనిలో టూరిజం శాఖ ఉన్నతాధికారిదే నిర్ణయమని చెప్పుతున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో ఏపీకి చెందిన అధికారులను, ఉద్యోగులను ఇక్కడకు తీసుకువచ్చి నియామకం చేశారనే ప్రచారం జరుగుతోంది.

స్థానికంగా ఉన్నా

వాస్తవంగా రాష్ట్ర పర్యాటక శాఖలోని కీలక విభాగాలు, రిసార్టుల్లో స్థానికేతరులు, ఏపీలో పదవీ విరమణ పొందిన అధికారులను తీసుకురావడం ఉన్నతస్థాయి విచారణ సైతం జరుగుతోంది. అయితే స్థానికంగా ఎంతో మంది అధికారులు, పదవీ విరమణ పొందిన అధికారులు కూడా ఉన్నారు. తారామతి, హరిత ప్లాజాలో విధుల్లో చేరేందుకు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు. కానీ అవన్నీంటినీ పక్కన పెట్టారు. ఏపీకి చెందిన వారు ఏండ్ల కిందటే పదవీ విరమణ చేసిన వారిని తిరిగి ఎందుకు నియామకం చేసుకున్నారో వివాదాస్పదంగానే మారుతోంది. దీనిపై సదరు మంత్రికి కూడా గతంలో ఫిర్యాదు చేశారు. కానీ మంత్రి నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. దీంతో సీఎం కేసీఆర్​తో పాటు సీఎస్​, విజిలెన్స్​కు ఫిర్యాదు చేశారు.

విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

టూరిజం శాఖలో ఈ వ్యవహారంపై ఉద్యోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ జాయింట్​ సెక్రెటరీ విచారణకు ఆదేశాలిచ్చారు. పలు విభాగాల్లో ఏపీకి చెందిన రిటైర్డ్​ అధికారులను నియమించిన అంశంపై వివరాలు అడిగారు. ఈ నెల 19న జాయింట్​ సెక్రెటరీ నుంచి టూరిజం ఎండీకి లేఖ పంపించారు. అయితే దీనిపై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చినట్లు ఆరోపణలున్నాయి. సదరు శాఖ ఉన్నతాధికారి సీఎం కేసీఆర్​, ఎంపీ సంతోష్​కు బంధువునంటూ బెదిరింపులకు గురి చేసినట్లు కూడా విమర్శులున్నాయి. దీంతో విచారణ నివేదికను పక్కన పెడుతున్నారని పర్యాటన శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed