కిక్కిచ్చిన దసరా.. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయి విక్రయాలు

by  |
liquor sales
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : దసరా పండుగ వేళ తెగ తాగేశారు. పండగ వేళ మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.30 కోట్ల మేర మద్యం అమ్మకాలు అయ్యాయి. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు మద్యం కొనుగోలు చేశారు. దసరా పండుగ వేళ అటు మద్యం వ్యాపారులకు కాసుల కిక్కు.. ఇటు మద్యం ప్రియులకు మత్తు కిక్ లభించింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 163 వైన్ షాపులు ఉండగా.. 39బార్లు ఉన్నాయి. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు సగటున రూ.3 నుంచి రూ.4 కోట్ల మేర మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ప్రతి నెలా రూ.100 నుంచి 120 కోట్ల వరకు మద్యం విక్రయాలు సాగుతాయి. అక్టోబర్ నెలలో గత 15 రోజుల్లో రూ.62.26 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గత నాలుగు రోజుల్లోనే సగం మద్యం విక్రయించారు. దసరా పండుగ ఉండటంతో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నెల 11 నుంచి 15వరకు రూ.29.08 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు అయినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల కంటే ఈ నాలుగు రోజులు రెట్టింపు స్థాయిలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. సాధారణంగా రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు మద్యం అమ్ముతుండగా.. దసరా పండుగ వేళ రోజుకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు మద్యం అమ్మింది.

అక్టోబర్ నెలలో మొదటి పదిహేను రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.62.26 కోట్ల మేర మద్యం విక్రయాలు అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో రూ.12.16 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.15.06కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ.5.91కోట్లు, మంచిర్యాల జిల్లాలో రూ.29.13కోట్లు చొప్పున విక్రయాలు జరిగాయి. గత నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు అయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 14వరకు నాలుగు రోజుల్లోనే రూ.29.08కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో రూ.5.15 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.6.93 కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ.2.80 కోట్లు, మంచిర్యాల జిల్లాలో రూ.14.20 కోట్లు చొప్పున విక్రయం జరిగింది. మంచిర్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దసరా పండుగ నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.15 కోట్ల విలువైన మద్యం కొన్నారు.


Next Story

Most Viewed