డ్రైవింగ్ లైసెన్స్.. స్మార్ట్ కార్డుకు బ్రేక్

by  |
డ్రైవింగ్ లైసెన్స్.. స్మార్ట్ కార్డుకు బ్రేక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత తీరడం లేదు. దాదాపు ఏడాదిన్నర కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ.. శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. లక్షలకు లక్షలు పేరుకుపోయిన సమయంలో ఐదు వందలో, వెయ్యి కార్డులనో అప్పటికప్పుడు తెప్పించుకుని డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి కొంతమంది వీఐపీలు, ఒత్తిడి తీసుకువచ్చే వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ కార్డుల కొరత సమస్య పరిష్కారం కావడం లేదు. కార్డులను జారీ చేసే సంస్థలతో పాటు స్మార్టు కార్డులను, వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్‌లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకు కోట్లాది రూపాయల బకాయిలు ఉండడంతో సదరు సంస్థలు ఇవ్వలేకపోతున్నాయి.

ఇటీవల రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ ఈ కాంట్రాక్ట్ తీసుకున్నా.. దానికి కూడా రూ.4 కోట్ల వరకు పెండింగ్ పెట్టడంతో మొత్తం కార్డుల జారీని నిలిపివేశారు. మరోవైపు పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ. కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ.. స్మార్ట్‌కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్‌ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. గత 4 నెలలుగా సుమారు రెండు లక్షలకు పైగా స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు చెప్పుతున్నారు.

గ్రేటర్‌లోనే లక్షకుపైగా పెండింగ్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఉప్పల్, నాగోల్, మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, కొండాపూర్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బండ్లగూడ తదితర అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో గత 4 నెలలుగా స్మార్ట్‌కార్డుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 250 నుంచి 300 వరకు స్మార్ట్‌కార్డుల డిమాండ్‌ ఉంటుంది. ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌ కార్యాలయంలో కూడా కార్డుల జారీ ఆపేశారు. అటు మేడ్చల్‌, ఉప్పల్‌లో ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ కొరత తీవ్రంగా ఉంది. ఇక ప్రతి రోజు సుమారు 300 మందికి డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించి స్పీడ్‌ పోస్టు ద్వారా స్మార్ట్‌ కార్డులను వినియోగదారులకు పంపించే నాగోల్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ ట్రాక్‌లో కొరత తీవ్రంగా ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ లతో పాటు ఆయా జిల్లాల పరిధిలో 4 నెలలుగా రెండు లక్షలకు పైగా కార్డుల పంపిణీ నిలిచిపోయింది.

చెల్లించిన ఫీజులు ఏమైనట్లు?

డ్రైవింగ్‌ లైసెన్సు అయినా, ఆర్సీ అయినా స్మార్ట్‌కార్డు రూపంలో ఉంటేనే వాహనదారుడికి గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం రవాణాశాఖ విధించే నిబంధనలన్నింటినీ పాటిస్తారు. డ్రైవింగ్‌ లైసెన్సు కోసం రూ.1550 ఆన్‌లైన్‌లో ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఇక వాహనాలు కొనుగోలు చేసిన సమయంలోనే జీవితకాల పన్నుతో పాటు, వాటి శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌తో సహా అన్ని ఫీజులను షోరూమ్‌లో చెల్లిస్తారు. స్మార్ట్‌కార్డులను వినియోగదారుల ఇంటికి పంపించేందుకు అయ్యే స్పీడ్‌ పోస్టు చార్జీ రూ.35లు కూడా ఆర్టీఏ ఖాతాలో ముందుగానే జమ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు సేవా రుసుము పేరిట రూ.250 వసూలు చేస్తారు. ఇలా ఫీజుల రూపంలోనే రవాణాశాఖ వినియోగదారుల నుంచి ప్రతి సంవత్సరం రూ. కోట్లల్లో వసూలు చేస్తుంది.

ఎందుకు చెల్లించడం లేదు

రవాణా శాఖలో బకాయిల చెల్లింపులు నిలిచిపోతున్నాయి. గతంలో పూణేకు చెందిన కొన్ని ప్రైవేట్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు స్మార్టు కార్డులను తయారు చేసి ఇచ్చేవి. కానీ రవాణాశాఖ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు చేతులెత్తేశాయి. ఏకంగా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దాంతో హైదరాబాద్‌కు చెందిన సీఎంఎస్, ఎంటెక్, తదితర సంస్థలతో గతేడాది ఒప్పందం కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులను అందజేయడం ఈ సంస్థల బాధ్యత. ప్రతి 3 నెలలకు ఒకసారి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొంతకాలంగా ఈ బిల్లులను చెల్లించకపోవడంతో ఆ సంస్థలు కార్డుల పంపిణీ నిలిపివేశారు. సకాలంలో కార్డులు లభించకపోవడం వల్ల తమ వద్ద ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్సు రశీదులు ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ పోలీసులు చలానాలు విధిస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారికంగా పోలీసులకు ఒక నోటీసు రూపంలో సమాధానం చెప్పాలని వాహనదారులు కోరుతున్నారు.



Next Story

Most Viewed